‘‘సాధారణంగా సీక్వెల్ అనగానే మొదటి సినిమాకు మించి ఉండాలని ప్రేక్షకుడు కోరుకుంటాడు. అది ఇచ్చామనే అనుకుంటున్నాం. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ హీరో అయినా బీ, సీ సెంటర్స్‌లో ఫాలోయింగ్ క్రియేట్ చేయాలని అనుకుంటాడు. ‘పందెం కోడి’ సిరీస్ నాకు ఆ మార్కెట్‌ని ఏర్పరిచింది’’ అని విశాల్ అన్నారు. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పందెం కోడి 2’. తెలుగులో ‘ఠాగూర్’ మధు రిలీజ్ చేశారు. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా విజయం పట్ల హీరో విశాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా పలు విశేషాలు పంచుకున్నారు.
► తెలుగు, తమిళం ఆడియన్స్‌కు నేటివిటీ ఒక్కటే తేడా. సినిమా బావుంటే ఆదరిస్తారు. ‘పందెంకోడి 3’ పార్ట్ కూడా ఉంటుంది. ఇదివరకటిలా పదమూడేళ్లంటే కష్టం. మాకు వయసు అయిపోతుంది. త్వరగా మూడో పార్ట్ వర్కౌట్ చేయమని లింగుస్వామికి చెప్పాను (నవ్వుతూ).
► ప్రస్తుతం టెలివిజన్ యాంకర్‌గా ‘నామ్ ఒరువర్’ అనే కార్యక్రమం చేస్తున్నాను. సహాయం కావాలనుకునేవాళ్లకు, సహాయం చేయాలనుకునేవాళ్లకు ఈ షో ద్వారా ఓ ప్లాట్‌ఫారమ్ క్రియేట్ చేశాం అనిపిస్తోంది.
► నా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అన్నీ సీక్వెల్సే ఉన్నాయి. ‘డిటెక్టీవ్, అభిమన్యుడు, పందెం కోడి’.. ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుందో చెప్పలేను. ప్రస్తుతం ‘టెంపర్’ రీమేక్ చేస్తున్నాను. ఇది వరకూ చాలా రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. ‘మిర్చి, అత్తారింటికి దారేది’ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ‘టెంపర్’ ఇప్పుడు చెప్పాల్సిన కథ. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు బావుంటుంది అని ఎంచుకున్నాను. రీమేక్ చేస్తే తెలుగు మార్కెట్ ఉండదనే భయం లేదు. నా అదృష్టం ఏంటంటే నా దర్శకులందరూ అద్భుతమైన నటులు. వాళ్లు చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోతా.
► ప్రస్తుతం ‘మీటూ’ ఉద్యమం జరుగుతోంది. దానికి సంబంధించి ఇండస్ట్రీ పరంగా తగిన చర్యలు తీసుకుంటున్నాం. కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కొత్తవాళ్లకు గైడెన్స్, కౌన్సిలింగ్ ఇవ్వనున్నాం. నేరం జరిగినప్పుడు మాట్లాడకపోవడం కూడా నేరమే. ఓసారి అమలాపాల్‌కు ఇలాంటి సమస్యే ఎదురైతే వెంటనే నాకు చెప్పింది. మేం స్పందించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించాం. వేధింపులకు గురైన అమ్మాయిలు ధైర్యంగా ముందుకు రావాలి. అయితే ‘మీటూ’ని పక్కదోవ పట్టించకూడదు. ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు కూడా ఉంటే మంచిది. ఎందుకంటే అప్పుడు ‘మీటూ’ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు.
► గవర్నమెంట్ తలుచుకుంటే పైరసీని ఆపగలదు. కానీ ఆ ఒక్క అడుగు వేయకుండా ఏం ఆపుతుందో అర్థం కావడం లేదు. ఇది వరకు బెదిరింపులకు కంగారు పడే వాళ్లు. ఇప్పుడు వాళ్లకు ఆ బెదిరింపులు కూడా అలవాటు అయిపోయాయి.
► రాబోయే ఎన్నికల గురించి అడగ్గా – ‘‘డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడానికి రెడీ అవుతున్నాను (నవ్వుతూ). ఒకసారి ఎన్నికల్లో నిలబడితే నామినేషన్ క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత బై ఎలక్షనే క్యాన్సిల్ చేసేశారు. యువత కూడా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయ నాయకులు సరిగ్గా పనిచేయడం లేదు అనిపించినప్పుడు మేం రాజకీయాల్లోకి రావాలి అనుకుంటాం. ఇంట్లో కూర్చొని విమర్శిస్తే పనులు జరగవు. బయటకొచ్చి నిలబడితేనే మార్పు కనిపిస్తుంది.
► నటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం ప్రెసిడెంట్‌గా బాధ్యతలు ఎక్కువ అయ్యాయి. నిద్ర తక్కువైంది. బిల్డింగ్ కట్టిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అది నా కల. అది కళ్లారా చూసుకున్నాకే పెళ్లి. వరలక్ష్మీ నా బెస్ట్ ఫ్రెండ్, సోల్‌మేట్. లవ్ మ్యారేజే చేసుకుంటాను.. అయితే ఎప్పుడో చెప్పలేను. కరుణానిధిగారి జ్ఞాపకార్థం ఫిబ్రవరిలో ఓ షో చేసి, దానితో ఓ గొప్ప నివాళి ప్లాన్ చేశాం.
ఇంట్లో కూర్చుంటే మార్పురాదు
Published Sun, Oct 28 2018 2:40 AM | Last Updated on Sun, Oct 28 2018 1:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment