
సుయ్ ధాగా – అఫీషియల్ ట్రైలర్
నిడివి:3 ని. 11 సె.
హిట్స్ :2,20,51,230
అంటే ‘సూది దారం’ అని అర్థం. అమాయకుడైన భర్తను ప్రయోజకుడిగా చేసుకునే భార్య కథలు మనకు గతంలో వచ్చాయి. అలాంటి కథే ఇది. ఇంట్లో దర్జీ పని వంశపారంపర్యంగా ఉన్నా అది మర్చిపోయి చిల్లర పనులు చేసుకుంటూ వెన్నెముక లేని జీవితం గడుపుతున్న భర్తను అతడి భార్య జాగురూకతలోకి తీసుకుని వస్తుంది. మన కాళ్ల మీద మనం నిలబడదాం అంటుంది. దిగువ మధ్యతరగతికి చెందిన ఈ జంట టైలర్ వృత్తిని మొదలుపెట్టి లోకాన్ని ఎదిరించి తమ ఉనికి చాటుకోవడానికి ఎన్ని సంఘర్షణలు చేశారనేది కథ. గతంలో వచ్చి, హిట్ అయిన ‘దమ్ లగాకే హైసా’ సినిమా దర్శకుడు శరత్ కటారియా ఈ సినిమాకు దర్శకుడు. వరుణ్ ధావన్ హీరో, అనుష్క శర్మ హీరోయిన్. ఒకరికి బానిసగా ఉండటం కంటే స్వయం ఉపాధికి పూనుకోవడం మంచిదని చెబుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది.
అరవింద సమేత వీరరాఘవ – టీజర్
నిడివి: 0.52 సె.
హిట్స్ :99,58,492
రాయలసీమ తెలుగు సినిమాకు జీవధాత్రిగా కొనసాగడం చూస్తే ఒక వైపు సంతోషపడాలో మరోవైపు ఆలోచనలో పడాలో తెలియని స్థితి. ఫ్యాక్షన్ అంశాన్ని కథగా తీసుకుని డజన్ల కొద్దీ సినిమాలు వచ్చాయి. చాలా హిట్ అయ్యాయి. దానిని దాటేసి తెలుగు సినిమా వేరే కథలవైపు చూడటం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తిరిగి రాయలసీమ ఫ్యాక్షన్ కథను తీసుకొని ఎన్.టి.ఆర్.తో త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టడం ఒకవైపు గన్‌షాట్ హిట్‌కు సూచన ఇస్తుంటే మరోవైపు మళ్లీ అదే కథనా అని సందేహం కలుగుతుంది. స్థలకాలాలు మారితే అదే అంశం కొత్తగా ఉంటుంది. హీరోనిబట్టి దర్శకుడిని బట్టి ఈ కథాంశం మళ్లీ కొత్తగా ఉంటుందని ఆశించవచ్చేమో. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎలా ఉంటుందో తెలుసా’... అని జగపతిబాబు డైలాగ్ చెబుతుంటే ఆ ఫోర్స్ హీరోను ఎలివేట్ చేసేలా ఉంది. ‘కంటబడ్డావా కనికరిస్తానేమో వెంటపడ్డానా నరికేస్తా వొబా’ అని ఎన్టీఆర్ చెప్పే పంచ్ డైలాగ్ అభిమానులకు కిక్ ఇచ్చే స్థాయిలో ఉంది. పూజా హెగ్డే ఈ సినిమా హీరోయిన్. దసరా విడుదల.
మంటో – అఫీషియల్ ట్రైలర్
నిడివి :2 ని. 22 సె.
హిట్స్ :64,45,475
హీరోలంటే రాజకీయ నాయకులో, సినిమా హీరోలో మాత్రమే కాదు. రచయితల్లో కూడా హీరోలుంటారు. సాదత్ హసన్ మంటో అలాంటి హీరో. అమృత్‌సర్‌లో జన్మించి ముంబైలో కొంత కాలం ఉండి దేశ విభజన సమయంలో లాహోర్‌ను ఎంచుకుని ఆయన ఆ సమయంలో రాసిన కథలు ఆయన యశస్సును శాశ్వతం చేశాయి. మంటో రాసిన కథలు ఆ కాలంలో సంచలనం. వాటి మీద కేసులు పడ్డాయి. ఆయనను చాలామంది కోర్టుకు ఈడ్చారు. మంటో కథల్లోని పదును, నగ్నత్వం ఎప్పూడూ ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఆయన జీవితం గురించి పలు సృజనాత్మక ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. మంటో పై పాకిస్తాన్‌లో ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో మరో సినిమా రానుంది. నందితా దాస్ దర్శకురాలు. నవాజుద్దీన్ సిద్దిఖీ మంటో పాత్రను పోషించారు. రిషి కపూర్, జావేద్ అఖ్తర్ వంటి సీనియర్స్ కూడా ఇందులో ఉన్నారు. ఇప్పటికే కొన్ని చలనచిత్ర ఉత్సవాల్లో ప్రశంసలు పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న విడుదల కానుంది. సాహిత్యం, దేశ విభజన పట్ల ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరూ ఈ సినిమాను గమనించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment