ఒక సర్కిల్‌.. నాలుగు కోణాలు | The story of four friends who share difficult comforts | Sakshi
Sakshi News home page

ఒక సర్కిల్‌.. నాలుగు కోణాలు

Published Sat, Feb 9 2019 12:01 AM | Last Updated on Sat, Feb 9 2019 1:44 PM

The story of four friends who share difficult comforts - Sakshi

మనందరికీ స్నేహితులు. వాళ్లందరూ మన సర్కిల్‌.భిన్న వైరుధ్యాల వృత్తం అది.వృత్తంలో శృతులు తప్పుతాయి. కానీ వృత్తం శృతి తప్పదు. కుటుంబంతో పంచుకోలేనివి..సమాజంతో చెప్పుకోలేనివి..ఈ సర్కిల్‌లోనే ఆవిష్కృతం అవుతాయి. పరిష్కృతమూ అవుతాయి.నాలుగు స్తంభాల ఆటలోప్రతిష్టంభన ఉండదనిఈ నలుగురు అమ్మాయిల కథలు మనకు చెబుతాయి.

టకీలా షాట్స్‌తో కష్టసుఖాలను పంచుకునే నలుగురు స్నేహితుల కథ.. ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌! ముంబైలోని పాష్‌ లొకాలిటీలో నివసిస్తూ అంతే ఆధునికమైన జీవనశైలితో పురుషాధిపత్య సమాజంలోని చాలెంజెస్‌ను ఎదుర్కొంటున్న ఆ నలుగురు..  దామిని రిజ్వి రాయ్, అంజనా మీనన్, ఉమంగ్‌ సింగ్, సిద్ధీ పటేల్‌.

ఇంట్రడక్షన్‌
దామిని (సయాని గుప్తా).. జర్నలిస్ట్‌. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం వెబ్‌సెట్‌కి ఫౌండర్‌. కుంభకోణాలు, రాజకీయ పర్యవసానాల మీద కథనాలు రాస్తూంటుంది. ఫియర్‌లెస్‌ జర్నలిస్ట్‌గా అవార్డులు..సోషల్‌ మీడియాలో పాపులారిటీ.. ట్రోలింగ్‌ సర్వసాధారణం ఆమెకు. అబ్సేషన్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌.. రిలేషన్స్‌లో అసంతృప్తి కూడా ఆమె ఐడెంటిటీలో భాగమే.  అంజనా మీనన్‌ (కృతి కుల్హరి).. ముంబైలో లీడింగ్‌ అడ్వకేట్‌. సింగిల్‌ మదర్‌. నాలుగేళ్ల కూతురు. భర్త వరుణ్‌ ఖన్నా. స్ట్రగులింగ్‌ స్క్రిప్ట్‌ రైటర్‌. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న ప్పటి నుంచీ అన్ని బాధ్యతలూ అంజనా భుజాల మీదే.  కూతురు పుట్టాక కూడా వరుణ్‌లో ఎలాంటి మార్పు రాదు.  కెరీర్‌ మీద దృష్టి పెట్టడు. అన్నిటినీ తేలికగా తీసుకునే అతని తత్వంతో విసిగిపోయి విడాకులు తీసుకుంటుంది అంజనా.  అయితే  కూతురు మీద భర్తకున్న హక్కును గౌరవిస్తుంది.

భర్త జీవితంలోకి ఇంకో అమ్మాయి వస్తుంది. ఆమె పేరు కావ్య. తన కూతురును చాలాబాగా చూసుకుంటూంటుంది. దాంతో పాపా ఆమెకు చాలా మాలిమి అవుతుంది. ఎంతలా అంటే ప్రతి విషయంలో తల్లిని  కావ్యతో పోల్చుకునేంతలా.  ఇది అంజనాకు ఇబ్బందిగానే కాదు బాధగానూ ఉంటుంది. అంజనా తల్లికీ కావ్య నచ్చుతుంది. తన బిడ్డలో లేని సహనం, అమ్మతనంలోని ఓపిక ఆమెకు కావ్యలో కనపడుతుంది. దాంతో ఆమే కావ్యకు దగ్గరవుతుంది. వీటన్నిటి వల్ల కావ్యతో సఖ్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది అంజనాకు.ఉమంగ్‌ సింగ్‌ (బాని జి).. లుథియానాలో పుట్టిపెరిగిన అమ్మాయి. జిమ్‌ ట్రైనర్‌.

తన సెక్సువాలిటీ మీద అవగాహన, తనకేం కావాలో స్పష్టత ఉన్న మనిషి. బై సెక్సువల్‌. బాలీవుడ్‌ స్టార్‌ సమారా కపూర్‌ (లిసా రే) అంటే క్రష్‌.. ప్రేమ. సిద్ధీ పటేల్‌ (మాన్వి గగ్రూ).. వయసు మళ్లుతున్న అవివాహిత వాళ్లమ్మ దృష్టిలో. సంపన్న కుటుంబం. భోజన ప్రియురాలు, బొద్దుగా  ఉంటుంది చిన్నప్పటి నుంచీ.  బయటవాళ్లకంటే తల్లి దగ్గరే బాడీ షేమింగ్‌కు గురవుతూ ఉంటుంది. ఆమె తిండి మీదే కాదు ప్రవర్తన మీద కూడా బోలెడు ఆంక్షలు విధిస్తూ ఉంటుంది తల్లి.  పెళ్లే ఆ పిల్లకున్న  ఏకైక లక్ష్యమన్న భావనలో కూతురిని పడేస్తుంది. దీంతో తల్లి పట్ల అసహనంగా ఉంటుంది సిద్ధీ. అమ్మ కంటే తనను పెంచిన ఆయా అంటే ఆమెకు  ఇష్టం, గౌరవం.  తల్లి పోరు నుంచి తప్పించుకోవడానికి పెళ్లే మార్గమని సిద్ధీ ఓ నిశ్చయానికి వచ్చేస్తుంది.  

ట్రక్‌ బార్‌ 
 తను పెట్టిన వెబ్‌సైట్‌లోనే తననే కార్నర్‌చేస్తూ   ఆ మానసిక ఒత్తిడితో దామిని,  ఏ పనీపాటా లేకుండా కాలక్షేపం చేస్తున్న  భర్తతో విసిగిపోయిన  అంజనా.. తనకు నచ్చిన తీరులో బతకడానికి ముంబై వచ్చిన ఉమంగ్‌.. అమ్మ చీవాట్లతో ఆత్మాభిమానం దెబ్బతిన్న సిద్ధీ.. ట్రక్‌బార్‌కు వస్తారు. ఒకరికొకరు పరిచయం అవుతారు. గూడు కట్టుకున్న దిగులుకు ఫోర్‌ మోర్‌ షాట్స్‌తో అవుట్‌ లెట్‌ కనుక్కుంటారు.

ఒకరి లైఫ్‌ స్టయిల్‌ పట్ల ఒకరికి యాక్సెప్టెన్స్‌ ఉండదు. అలాగని వ్యతిరేకించుకోరు. గౌరవించుకుంటారు. నలుగురినీ కలుపుతున్న కామన్‌ పాయింట్స్‌ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అని తెలుసుకుంటారు. స్నేహాన్ని గట్టిచేసుకుంటారు. ఆ నాటి నుంచి ట్రక్‌బార్‌ మీటింగ్‌ పాయింట్‌ అవుతుంది వాళ్లకు. బార్‌ ఓనర్‌ (ప్రతీక్‌ బబ్బర్‌).. పురుషాధిపత్యం మీద వీళ్లు వేసుకునే జోకులు, చేసే కామెంట్స్‌కి శ్రోత అవుతాడు. 

సెకండ్‌ ఇన్నింగ్స్‌
 కొత్త జీవితం మొదలుపెట్టాలని నలుగురికీ ఉంటుంది. వరుణ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ కావ్య తనలోని   అమ్మతనాన్నే కాదు స్త్రీత్వాన్నీ  సవాల్‌ చేసినట్టు ఫీలవుతుంది అంజనా. దాంతో తన ఆఫీస్‌లో అప్రెంటిస్‌గా చేరిన ఒక యంగ్‌ లాయర్‌తో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలనుకుంటుంది. ఈ ఆలోచనకు,  అంతర్లీనంగా దాగి ఉన్న సంప్రదాయ భావాలకు మధ్య తీవ్ర ఘర్షణ మొదలవుతుంది అంజనాలో. ఆ అబ్బాయితో బంధాన్ని కోరుకుంటుంది కాని అది తన కూతురికి తెలియకుండా దాచాలనుకుంటుంది. ఈ విషయంలో ఆ అప్రెంటీస్‌కి, అంజనాకు మధ్య చిన్న వాగ్వాదం జరుగుతుంది. ఆ అప్రెంటీస్‌ ఇచ్చిన భరోసాతో  సమాధానపడి అతనిని ఇంటికి పిలుస్తుంది అంజనా. అదే సమయానికి ఆమె మాజీ భర్త వరుణ్, అతని గర్ల్‌ఫ్రెండ్‌ కావ్యా ఇంటికి వస్తారు కూతురిని చూడ్డం కోసం. బాయ్‌ఫ్రెండ్‌తో అంజనా కనిపించే సరికి ఓర్చుకోలేక పోతాడు వరుణ్‌. ఆ అసూయను అణచిపెట్టుకుని కూతురికి జబ్బు చేసినప్పుడు బయటపెడ్తాడు.

కూతురు కన్నా వేరే ఆసక్తులు ఎక్కువయ్యాయని ఆమెను అపరాధిగా చేసి కూతురి బాధ్యతను అంజనా నుంచి లాక్కోడానికి ప్రయత్నిస్తాడు. తనను తాను నిరూపించుకోవడానికి అంజనా తన రిలేషన్‌కు స్వస్తి చెప్పి కూతురిని తన దగ్గరే ఉంచుకుంటుంది. ఇటు  దామిని కూడా ఆఫీస్‌ పాలిటిక్స్‌తో విసిగిపోతుంది. వెబ్‌సైట్‌  కో ఫౌండర్స్‌ న్యూయార్క్‌లో మాస్‌ కామ్‌ చేసిన ఓ కొత్త అమ్మాయిని అప్పాయింట్‌ చేస్తారు గ్లామర్‌ న్యూస్‌తో వ్యూస్‌ను  మరింత పెంచడానికి. సెలబ్రిటీల ప్రైవేట్‌ వ్యవహారాల మీద పెన్‌ పెట్టమని రిపోర్టర్లను ఆదేశిస్తుంది ఆ కొత్త అప్పాయింటీ. ఖంగు తింటుంది దామినీ. రానురాను తన ప్రాపకం, ప్రభావం తగ్గడంతో డీలా పడిపోతుంది. ఆ టైమ్‌లో ఆమెకు అండగా నిలుస్తాడు ట్రక్‌బార్‌ ఓనర్‌ (ప్రతీక్‌ బబ్బర్‌).

 అతనికి దగ్గరవుతుంది దామినీ. అనుకున్నట్టుగానే సమారాకు దగ్గరవుతుంది ఉమంగ్‌. ఆమెకు పర్సనల్‌ జిమ్‌ ట్రైనర్‌గా చేరి. అయితే తనకున్న పబ్లిసిటీ, ఫ్యాన్‌ఫాలోయింగ్‌ దృష్ట్యా ఉమంగ్‌ను తన పార్టనర్‌గా ఎక్కడా పరిచయం చేయదు సమారా. పార్టీల్లో కూడా కేవలం జిమ్‌ ట్రైనర్‌గానే పరిచయం చేస్తుంది. అవమానంగా భావిస్తుంది ఉమంగ్‌. ఈలోపే వాళ్లిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటోగ్రాఫ్‌ మీడియా, సోషల్‌ మీడియాలో వైరలై సమారా ఒక లెస్బియన్‌ అనే  వార్తలు వస్తాయి. ఇది తన కెరీర్‌ను దెబ్బతీయనుందని  ఉమంగ్‌తో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటుంది సమారా. అలా ఉమంగ్‌ మళ్లీ ఒంటరిదైపోతుంది. తల్లి  పెట్టే నసతో ఆత్మన్యూనతకు గురైన సిద్ధీ.. అడల్ట్‌ వెబ్‌సైట్‌లో మొహం కనపడకుండా అర్థనగ్నంగా ఫోజులిస్తూ.. దానికి ఫాలోయింగ్‌తో  ఆత్మస్థయిర్యం పెంచుకుంటూంటుంది. 

బ్లాక్‌మెయిల్‌
 దామినీ బర్త్‌డే సెలబ్రేట్‌ చేయడానికి గోవా టూర్‌ వెళ్తారు నలుగురూ. అక్కడ సిద్ధీకి తన చిన్ననాటి స్నేహితుడు కనిపిస్తాడు.  అతను సిద్ధీని ఇష్టపడ్తుంటాడు. అతని సాహచర్యం సిద్ధీకీ నచ్చుతుంది.  అతనితో ఉన్నప్పుడే ఒకసారి  సిద్ధీకి బ్లాక్‌మెయిల్‌ మెస్సేజ్‌ వస్తుంది.. ‘‘నిన్ను హాఫ్‌ న్యూడ్‌గా చూడాలి.. వెంటనే ఆన్‌లైన్‌లోకి రా.. లేదంటే నీ ఫోటోస్‌ నీ బాయ్‌ఫ్రెండ్‌కి షేర్‌ చేస్తా’’ అంటూ. షాక్‌ అవుతుంది సిద్ధీ. గోవా నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ బ్లాక్‌మెయిల్‌ వెంటాడుతుంది. సిద్ధీ ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్లకు తెలిసి.. సంతోషంగా వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటారు. అటువైపు పేరెంట్స్‌ కూడా అభ్యంతరపెట్టరు. కాని ఎందుకనో సిద్ధీయే  ఆనందంగా ఉండదు. అప్పుడే పెళ్లి చేసుకోవాలని అనిపించదు ఆమెకు. ఇంతేనా జీవితం? అనుకుంటుంది. ఏదో సాధించాలనే తపన మొదలవుతుంది.

ఈలోపు మళ్లీ బ్లాక్‌మెయిల్‌ మెస్సేజ్‌ వస్తుంది. ఫ్రెండ్స్‌ని బార్‌కి పిలుస్తుంది ఆ విషయం చెప్పడానికి. సిద్ధీకి కాబోయే మామగారు కనిపిస్తారు బార్‌లో. మెస్సేజ్‌లో వాడిన భాషతో మాట్లాడుతుంటాడు. అప్పుడు అర్థమవుతుంది సిద్ధీకి ఆ బ్లాక్‌మెయిల్‌ తనకు కాబోయే మామ నుంచే అని. అతన్ని చెంప దెబ్బ కొడ్తుంది. ‘‘ఛీ నీలాంటి దాన్నా నా ఇంటికి కోడలుగా చేసుకునేది?’ అంటాడు. ‘‘ముందు నీలాంటి వాడి ఇంటికి కోడలుగా రావడానికి నేను సిద్ధంగా లేను’’ అని పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుంటుంది.  ఇటు దామిని కలిసి ఉండాలనుకున్న ట్రక్‌ బార్‌ ఓనర్‌ దగ్గరకు అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ వచ్చేస్తుంది. అలా దామినీ ఒంటరే అయిపోతుంది.  అలా మళ్లీ నలుగురు.. ట్రక్‌ బార్‌లో కలుసుకొని ఫోర్‌ మోర్‌ షాట్స్‌ తీసుకుని సడలని ఆత్మవిశ్వాసంతో ఒంటరి పోరాటానికి సిద్ధపడ్తారు. ఇదీ కథ. టకీలా బాటిల్‌లో స్త్రీ సాధికారతను.. షాట్స్‌లో ఆమె స్వేచ్ఛను పోసి స్ట్రీమింగ్‌ చేస్తోంది అమేజాన్‌ ప్రైమ్‌ ‘‘ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌’’ పేరుతో! 
– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement