ఆ మాటలు అబద్ధం అయ్యాయి!
‘ఇంకెంత? జస్ట్ రెండంటే రెండేళ్లు. ఆ తర్వాత పెట్టే బేడా సర్దుకుని ఎక్కణ్ణుంచి వచ్చిందో అక్కడికి వెళ్లిపోవాల్సిందే’’... హాట్ గాళ్ సన్నీ లియోన్ బాలీవుడ్‌కి వచ్చినప్పుడు కొందరు అన్న మాటలివి. ఒకప్పుడు నీలి చిత్రాల్లో నటించినందున సన్నీ అంటే చాలామందికి చులకన భావం. అందుకే ఆ సినిమాలు మానేసి, హిందీ సినిమాలు చేస్తున్నా.. ఇక్కడ ఎంతోకాలం కొనసాగలేరన్నది వారి నమ్మకం. అలాగే, పెద్ద పెద్ద స్టార్స్ పక్కన నటించాలని ఆమె అనుకుంటే అది కలగానే మిగిలిపోతుందని కూడా బలంగా వాదించినవాళ్లు ఉన్నారు.
అయితే ఆమె కల నిజమైంది. ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ‘రయీస్’లో ఆమె ఐటమ్ సాంగ్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈ 25న సినిమా విడుదల కానుంది. ఇంకా ఆ తీయని కలలోనే సన్నీ తేలియాడుతున్నారు. ఈ హ్యాపీ మూడ్‌లో తనను హేళన చేసినవాళ్లను గుర్తు చేసుకున్నారామె. ‘‘నాకు అవకాశాలు రావని అవమానించిన వారు, నేనంటే గిట్టనివారు నాకు ‘రయీస్’లో నటించే అవకాశం వచ్చిందని విన్నప్పుడు చేదు వార్తలా ఫీలై ఉంటారు. పని గట్టుకుని నా గురించి ప్రచారం చేశారు. వాళ్లంటే నాకు అసహ్యం’’ అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సన్నీ ఘాటుగా స్పందించారు.
ఇంకా సన్నీ మాట్లాడుతూ – ‘‘నిజానికి షారుక్‌తో నేను నటించింది ఒకే ఒక్క సాంగ్‌లోనే కావచ్చు. అయినా అది నాకు గొప్ప విషయమే. ఎందుకంటే, స్టార్స్ నన్ను దగ్గరకు రానివ్వరని చాలామంది అన్నారు. ఆ మాటలు అబద్ధం అయ్యాయి. ఇతర స్టార్స్ కూడా నాకు అవకాశం ఇస్తారనే నమ్మకం ఉంది. రెండేళ్లల్లో వెళ్లిపోతానన్నారు. 20 ఏళ్లయినా ఇక్కడే ఉంటా. కష్టపడి పని చేస్తాను. ఆ దేవుడి ఆశీస్సులు ఎలానూ ఉన్నాయి. నా ఎదుగుదలను ఎవరూ ఆపలేరు’’ అని ఎంతో నమ్మకంగా అన్నారు.