
ఐ డోంట్ కేర్!
‘‘సన్నీ లియోన్‌తో నాకు పోలిక పెట్టకండి. ఎందుకంటే, మంచి నటన, డ్యాన్స్, రియాల్టీ షోస్ అన్నీ చేసి, నా ప్రతిభ నిరూపించుకున్నా. సన్నీ లియోన్‌లా శృంగార చిత్రాల్లో నటించలేదు’’ అని ఆ మధ్య బహిరంగంగా సన్నీపై నోరు పారేసుకున్నారు రాఖీ సావంత్. అసలు సన్నీకి మన ఇండియాలో ఉండే అర్హత లేదని, తను అర్జంటుగా ఇక్కణ్ణుంచీ వెళ్లిపోవాలని కూడా రాఖీ పేర్కొన్నారు. విదేశీ భామ సన్నీపై వీలు కుదిరినప్పుడల్లా రాఖీ నానా దుర్భాషలాడుతూ వస్తున్నారు. దీనంతటికీ కారణం సన్నీ ఇక్కడ పాపులార్టీ సంపాదించుకోవడమే. ఉత్తరాదిన మాత్రమే కాకుండా దక్షిణాదిన కూడా సన్నీకి వచ్చిన గుర్తింపు చూసి, ఓర్వలేకే రాఖీ ఇలా దురుసుగా మాట్లాడుతున్నారని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. రాఖీ తనను అంటున్న మాటల గురించి సన్నీ ఇన్నాళ్లూ స్పందించలేదు.
కానీ, నోరు మూయించేలా సమాధానం చెప్పకపోతే రాఖీ ఇంకా రెచ్చిపోతుందనుకున్నారో ఏమో.. ‘ఎవరేమన్నా ఐ డోంట్ కేర్’ అనేశారు. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న సన్నీ దగ్గర రాఖీ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా, ఆమె ఈ విధంగా అన్నారు. ‘‘ఎవరో ఏదో అంటే నేనెందుకు పట్టించుకుంటాను. నేనిక్కడకు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను. ఎక్కడికీ వెళ్లను. వెళ్లాల్సిన అవసరంలేదు’’ అని ఆ వేడుకలో స్పష్టం చేశారు సన్నీ. ఒకరు విమర్శించడం వల్ల తన కెరీర్‌కి ఎలాంటి నష్టం జరగదనీ, తనకు ఏది దక్కాలో అది దక్కే తీరుతుందని కూడా ఈ హాట్ గాళ్ పేర్కొన్నారు. సినిమాల్లో నిలదొక్కువాలనే తన కలను నెరవేర్చుకుంటానని, తన ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని కూడా సన్నీ లియోన్ స్పష్టం చేశారు.