న్యూఢిల్లీ : రోజులు గడుస్తున్న కొద్దీ సంజయ్ లీలా బన్సాలీ 'పద్మావతి' చిత్ర వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకొనేలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఈ చిత్ర విడుదలను నిషేధించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. 'పద్మావతి' చిత్రం విడుదలపై నిషేధం విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది. సెన్సార్ బోర్డుకు ఉన్న అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. సీబీఎస్‌సీ ఇంకా సర్టిఫికెట్ ఇవ్వనే లేదని, అలాంటప్పుడు సినిమా విడుదలను ఎలా ఆపేస్తామని ప్రశ్నించింది.
సీబీఎఫ్‌సీ నుంచి పద్మావతికి సర్టిఫికేషన్ రావాల్సి ఉందని పేర్కొంది. పద్మావతి సినిమా విడుదలపై నిషేధం విధించాలంటూ అడ్వకేట్ ఎంఎల్ శర్మ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సినిమా విడుదల నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ స్వచ్ఛందంగా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. అయితే సినిమాను నిషేధించాల్సిందేనంటూ కర్ణిసేన ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment