సూర్యతో బాలీవుడ్ బ్యూటీ నీతుచంద్ర
సూర్యతో బాలీవుడ్ బ్యూటీ నీతుచంద్ర లెగ్ షేక్ చేశారన్నది తాజా సమాచారం. కోలీవుడ్‌లో ఇంతకుముందు యావరుమ్ నలం, ఆదిభగవాన్ తదితర చిత్రాల్లో నాయకిగా నటించిన భామ నీతుచంద్ర. ఆ మధ్య యుద్ధం సెయ్ చిత్రం కోసం దర్శకుడు మిష్కిన్‌తో సింగిల్ సాంగ్‌లో ఆడిన ఆ బ్యూటీ చిన్నగ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్‌లో ఐటమ్‌సాంగ్‌తో ప్రత్యక్షం కానున్నారు. సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఎస్-3. సింగం చిత్రానికి మూడో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అందాల భామలు అనుష్క, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈచిత్రం కోసం ఇటీవల స్థానిక బిన్నిమిల్‌లో ఒక పాటను చిత్రీకరించారు. ఇందులో సూర్య సరసన నీతుచంద్ర లెగ్ షేక్ చేయడం విశేషం. సాధారణంగా హరి చిత్రాల్లో ఎందరు హీరోయిన్లు ఉన్నా మరో నటితో ప్రత్యేక గీతం చోటు చేసుకుంటుంది. సింగం-2లో అలాంటి ప్రత్యేక గీతంలో నటి అంజలి నటించారు. ఇప్పుడు ఉత్తరాది బ్యూటీ నీతుచంద్ర నటించారు.
నృత్యదర్శకురాలు బృందా కొరియోగ్రఫీలో ఓ సానే సూపర్ సోనిక్ అనే పల్లవితో సాగే ఈ పాటను బిన్నిమిల్లులో నాలుగు రోజుల పాట చిత్రీకరించారు. ఎస్-3 చిత్రం దీపావళికి విడుదలవుతుందనే ప్రచారం జరిగింది.అయితే చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తికాకపోవడంతో చిత్రాన్ని డిసెంబర్ 16న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతల వర్గం అధికారికంగా ప్రకటించారు. ఎస్-3 క్రిస్‌మస్ సెలవులపై గురి పెట్టినట్లుంది. కొన్ని కీలక సన్నివేశాలను మలేషియాలోనూ ఒక పాటను జార్జియాలోనూ చిత్రీకరించనున్నట్లు సమాచారం.