Neetu Chandra
-
నటి నీతూ చంద్రా గుర్తుందా? ఆ అవకాశం వరించింది
తమిళసినిమా: నటి నీతూ చంద్రా గుర్తుందా? యావరుమ్ నలమ్, ఆదిభగవాన్ తదితర చిత్రాల్లో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి. ప్రస్తుతం హిందీ, బెంగాలీ తదితర భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడు తమిళంలో నటించి చాలా కాలం అయ్యింది. కాగా తమిళ చిత్రాల్లో నటించడం తనకు చాలా ఇష్టమని, అయితే మంచి అవకాశాలు రావడం లేదని ఇటీవల ఓ కార్యక్రమంలో వాపోయింది. ఆ వెంటనే కోలీవుడ్‌లో అవకాశం నీతూ చంద్రాను వరించింది. దర్శకుడు సుందర్.సీ కథానాయకుడిగానూ నటిస్తున్నారు. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం కాఫీ విత్ కాదల్ ఇటీవల విడుదలైంది. కాగా ఇరుట్టు చిత్రం తరువాత సుందర్.సీ కథానాయకుడిగా ఒన్ టూ ఒన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు భార్యగా నటి రాగిణీ త్రివేది నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనురాగ్ కాషీ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నీతూచంద్రా వచ్చి చేరినట్లు సమాచారం. ఇందులో ఆమె పాత్ర ఏమిటన్నది చిత్ర వర్గాలు వెల్లడించలేదు. తిరుజ్ఞానం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ విపిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. -
నా కల ఇప్పటికి నెరవేరింది: హీరోయిన్
నటి నీతూ చంద్ర గుర్తుందా? తమిళంలో యావరుం నలం, తీరాలి విళైయాట్టు పిళ్లై, ఆది భగవాన్, వైగై ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాల్లో కథానాయకిగా నటించిన ఈమె బాలీవుడ్ నటి అన్నది గమనార్హం. యుద్ధం చెయ్ చిత్రంలో నీతూ చంద్ర చేసిన ఐటెం సాంగ్ కురక్రారును ఉర్రూతలూగించింది. హిందీ, భోజ్‌పురి తదితర భాషా చిత్రాల్లో నటించిన ఈమె నిర్మాతగాను కొన్ని చిత్రాలను నిర్మించింది. తాజాగా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని గురించి నీతూచంద్ర తెలుపుతూ హాలీవుడ్ చిత్రాల్లో నటించాలన్నది తన చిరకాల కోరిక అని పేర్కొంది. అది ఇప్పటికి నెరవేరడం సంతోషంగా ఉందని పేర్కొంది. హాలీవుడ్ రంగ్ ప్రవేశం గురించి ఈమె తెలుపుతూ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లడానికి అవకాశాలను మనమే కల్పించుకోవాలని భావించే వ్యక్తిని తానని చెప్పుకొచ్చింది. ఆ మధ్య విల్ స్మిత్ నటించిన బ్యాడ్ బాయ్స్ చిత్రం ప్రివ్యూను అమెరికాలోని సోనీ పిక్చర్స్ స్టూడియోలో ఏర్పాటు చేశారన్నారు. అందులో పాల్గొనడానికి తనకు ఆహ్వానం వచ్చిందని చెప్పింది. అక్కడే నెవర్ బ్యాక్ డౌన్ చిత్రం నిర్మాత డేవిన్ జలోన్ను కలిసే అవకాశం కలిగిందని తెలిపింది. ఆయన తన ఆత్మరక్షణ విద్యలను చూశారన్నారు. నీతూతో ఆయన నిర్మిస్తున్న యాక్షన్ కథా చిత్రం నెవర్ బ్యాక్ డౌన్ రివోల్ట్ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించాలని చెప్పింది. మీరు హాలీవుడ్ చిత్రాలు నటిస్తారా? అని పలువురు అడుగుతున్నారని, ప్రస్తుతం అక్కడ మరో రెండు హాలీవుడ్ చిత్రాలు నటించడానికి అంగీకరించానని వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని చెప్పింది. అయితే తమిళ చిత్రాల్లో నటించడం తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. కోలీవుడ్‌లో తనకు చాలామంది అభిమానులు ఉన్నారని చెప్పింది. తనను అంతగా ఆదరించిన తమిళ చిత్రాల్లో నటించడానికి ఎప్పుడు సిద్ధమేనని చెప్పుకొచ్చింది. తమిళంలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానంది. హాలీవుడ్ స్థాయికి వెళ్లినా తమిళ చిత్రాల్లో నటించే అవకాశాన్ని మాత్రం వదులుకోనని నీతూ చంద్ర పేర్కొంది. -
బడా వ్యాపారవేత్త నన్ను జీతం తీసుకునే భార్యగా ఉండమన్నాడు: హీరోయిన్
ఓ బడా వ్యాపారవేత్త తనని వేతనం తీసుకునే భార్యగా ఉండమని ఆఫర్ చేశాడంటూ నటి నీతూ చంద్ర తన ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. అంతేకాదు శాలరీడ్ వైఫ్(వేతనం తీసుకునే భార్య) ఉంటే తనకు రూ. 25 లక్షలు ఇస్తానని సదరు వ్యాపారవేత్త ఆఫర్ చేశాడని కూడా ఆమె వెల్లడించింది. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీతూ పలు సంచలన విషయాలను వెల్లడించింది. ఈ సందర్భందగా ఆమె మాట్లాడుతూ.. ‘నాది సక్సెస్ ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ. 13 మంది జాతీయ అవార్డు గ్రహీతలైన నటుల సరసన హీరోయిన్గా చేశాను. పులు పెద్ద సినిమాల్లో నటిని. అలాంటి నాకు ఈ రోజు పని లేదు. ఒక పెద్ద వ్యాపారవేత్త నాకు నెలకు రూ. 25 లక్షలు ఇస్తానని, జీతం తీసుకుని భార్యగా ఉండాలని కోరాడు. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, పనీ లేదు. ఇన్ని మంచి సినిమాల్లో నటించాక కూడా నేను ఇక్కడ అనవసరంగా ఉన్నానేమో అని అనిపిస్తుంది’ అని నీతూ వాపోయింది. కాగా 2005లో ‘గరం మసాలా’ మూవీతో నీతూ హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత ట్రాఫిక్ సిగ్నల్, వన్ టూ త్రీ, ఓయ్ లక్కీ లక్కీ ఓయ్, అపార్ట్మెంట్ 13బి వంటి చిత్రాలలో నటించింది. అంతేకాదు ఆమె పలు అల్బమ్ సాంగ్స్‌లో కూడా నటించింది. ఇక చివరిగా షెఫాలీ షా, రాహుల్ బోస్, సుమీత్ రాఘవన్‌లు ప్రధాన పాత్రలు పోషించిన ‘కుచ్ లవ్ జైసా’ సినిమాలో కనిపించింది. ఆమె నటించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ సినిమా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నేషనల్ అవార్డును గెలుచుకుంది. ఆమె మరో చిత్రం ‘మిథిలా మఖాన్’ కూడా జాతీయ అవార్డును అందుకుంది. -
వీక్నెస్ నుంచే బలం రావాలి
అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆడపిల్ల అయితే అంతకన్నా ఎక్కువ చేయొచ్చు. సాధారణంగా ఆడపిల్ల అంటే ‘వీక్’ అంటారు. కానీ మన వీక్నెస్ తెలిస్తేనే కదా మనం స్ట్రాంగ్ అయ్యేది. శక్తి ఒకరు ఇచ్చేది కాదు. బయట నుంచి తీసుకునేది కాదు. లోపల నుంచి ఎదగాలి. నీతూచంద్ర చెబుతున్న మాటలు ప్రతి అమ్మాయి చదవాలి. విష్ణు, గోదావరి, సత్యమేవ జయతే వంటి తెలుగు సినిమాలు చేశారు. ఆ తర్వాత కనిపించలేదేం? నీతు: అప్పుడేం జరిగిందో చాలామందికి తెలుసు అనుకుంటాను. ఇప్పుడా విషయం గురించి మళ్లీ చెప్పాలనిపించడంలేదు. నా స్టాఫ్‌తో సహా ఉదయం 4 గంటలకే హైదరాబాద్ నుంచి హడావిడిగా వెళ్లిపోవాల్సి వచ్చింది. భయంకరమైన సంఘటన అది. అప్పుడు మా నాన్నగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటు ప్రొఫెషనల్‌గా ఘోరమైన పరిస్థితి, అటు వ్యక్తిగతంగా పెద్ద బాధ. ఇక్కడ నిలబడి ఫైట్ చేద్దామంటే నా పర్సనల్ లైఫ్ అందుకు స్కోప్ ఇవ్వలేదు. నాన్నగారి కోసం వెళ్లిపోవాల్సి వచ్చింది. మీకెదురైన చేదు అనుభవం ఒకే ఒక్క సినిమాతో. మరి.. ఇండస్ట్రీ మొత్తానికి దూరం కావడమెందుకు? ఆ తర్వాత నేను ‘మనం’ సినిమా చేశాను కదా? కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలనుకున్నాను. కానీ స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ మాత్రమే వచ్చేవి. నాకు తెలిసి ఎవరైనా ముందు సాంగ్స్, స్పెషల్ డ్యాన్స్‌లు చేసి ఆ తర్వాత క్యారెక్టర్లు చేస్తుంటారు. నేను దానికి విరుద్ధంగా చేశాను. నా దృష్టిలో హిందీ సినిమాకు సౌత్ సినిమా వెన్నెముకలాంటిది. స్పెషల్‌గా తెలుగు, తమిళం. ఈ రెండు ఇండస్ట్రీలు నాకు గుర్తింపును ఇచ్చాయి. తెలుగులో కనిపించడంలేదు. ఇతర భాషల్లో నటించి కూడా రెండు మూడేళ్లయినట్లు ఉంది కదా? క్వాలిటీ వర్క్ చేయాలనుకుంటాను. ‘విష్ణు, గోదావరి, సత్యమేవ జయతే’లో చేసిన పాత్రలు దేనికదే విభిన్నంగా ఉంటాయి. నాలుగేళ్లుగా థియేటర్స్ మాత్రమే చేస్తున్నాను. దాని వల్ల ‘నీతూ యాక్టింగ్ మానేసింది’ అని రాస్తున్నారు. సినిమాలు చేసిన తర్వాత థియేటర్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. మన దగ్గరకు వచ్చే సినిమాలు ఎలానూ వస్తాయనే ఉద్దేశంతో ఉన్నాను. మా నాన్నగారు పోవడంతో అమ్మను చూసుకుంటున్నాను. ఒకవేళ మంచి కంటెంట్ ఉన్న కథ వస్తే అందులో 17 ఏళ్ల అమ్మాయిగా, 85 ఏళ్ల వయసున్న బామ్మలా కనిపించాలన్నా అలానే మౌల్డ్ అయిపోతాను. రెండు గంటలు బ్రేక్ లేకుండా నటించగలను. సినిమాల సంఖ్య తగ్గడంతో ఇండస్ట్రీకి దూరం అయినట్లు అనిపించిందా? సోషల్ మీడియా వల్ల దూరం అయినట్టుగా లేదు. ఫిల్మ్స్‌కి దూరంగా ఉన్నా సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తున్నాను. నాకు ఇష్టం లేని సినిమాల్లో భాగం అవ్వడం లేదు.. అంతే. మనకు నచ్చని పనిని ‘చేయను’ అని తెగేసి చెప్పడం కూడా సక్సెసే. ‘యస్’ అని చెప్పి పిచ్చి పిచ్చి సినిమాలు చేయలేం కదా. అలాగని డ్యాన్స్‌లు చేయనని కాదు. అవీ చేస్తాను. అలాగే ‘బాహుబలి’ సినిమాలో హీరోయిన్లు చేసినట్లు యాక్షన్ మూవీ చేయాలని ఉంది. అవునూ... లాస్ ఏంజిల్స్‌లో యాక్టింగ్ కోర్స్‌కి వెళుతున్నారట. పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. మళ్లీ యాక్టింగ్ కోర్స్ ఎందుకు? ఏ ఆర్టిస్ట్ అయినా రోజూ ప్రాక్టీస్ చేయాల్సిందేనని నా అభిప్రాయం. అనుభవం సంపాదించుకున్నా కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అందుకే ఓపిక ఉన్నంత వరకూ థియేటర్, వర్క్‌షాప్స్ చేస్తూనే ఉంటాను. ఓకే.. మార్షల్ ఆర్ట్స్‌లో నాలుగు బ్లాక్ బెల్టులు సాధించారు. ఈ ఆర్ట్ మీ లైఫ్‌కి ఎలా ఉపయోగపడింది? స్పోర్ట్స్‌ని నా ఫ్రెండ్‌లా భావిస్తాను. స్పెషల్‌గా మార్షల్ ఆర్ట్స్. దీని వల్ల మనం ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే నేనున్న ప్రొఫెషన్‌కి డిప్రెషన్, బ్రెయిన్హెమరేజ్ వచ్చేస్తాయి. ఈ సినిమా నాకు కాకుండా ఆ అమ్మాయికి వెళ్లిపోయింది. అది అలా జరిగింది? ఇలాంటివి ఆలోచిస్తుంటాం. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు స్పోర్ట్స్ నేర్పించాలి. అది ఏ స్పోర్ట్ అయినా ఫర్వాలేదు. క్రమశిక్షణ, బాధ్యత, పోరాడే లక్షణం అలవడతాయి. అదో డిఫరెంట్ ఎనర్జీ. స్పోర్ట్స్ చాలా నేర్పింది. స్పోర్ట్స్‌ని ఫ్రెండ్‌లా అనుకుంటా అన్నారు. మరి మీ జీవితంలో స్పెషల్ పర్సన్ ఎవరూ లేరా? రిలేషన్షిప్లో ఉండటం కూడా ఓ పని లాంటిదే. యాక్ట్ చేస్తున్నాను, నిర్మిస్తున్నాను, మార్షల్ ఆర్ట్స్‌లో ఉన్నాను, పట్నా పైరెట్స్ కబడ్డీ జట్టును ప్రమోట్ చేస్తున్నాను. నాలుగేళ్లు రిలేషన్లో (బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడాతో ఒకప్పుడు ప్రేమలో ఉన్న నీతు) ఉన్నాను. అది కొనసాగని పరిస్థితి. ఆ బాధలోంచి బయటకు రావడానికి ఒకటిన్నర సంవత్సరం పట్టింది. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నాను. ప్రపంచం మొత్తం తిరిగి పని చేయాలనుకుంటాను. తెలుగులో సినిమా ఉంటే ఇక్కడికి వచ్చి సినిమా చేస్తాను. ప్రేమలో పడే టైమ్ దొరికి, మనసుకి నచ్చిన అబ్బాయి దొరికితే అప్పుడు పడతాను. మార్షల్ ఆర్ట్స్ వల్ల అడ్వాంటేజ్, డిస్ అడ్వాంటేజ్ రెండూ ఉంటాయి కదా? అవును. ఈ ఆర్ట్ వల్ల నేను రూడ్ అనుకునే అవకాశం ఉంది. అయితే నేను చాలా సాఫ్ట్. నన్ను గౌరవించండి.. నేను మిమ్మల్ని గౌరవిస్తాను అనే తత్వం నాది. గౌరవంలో తేడా వచ్చినప్పుడు ఇంకో కోణం చూపిస్తా (నవ్వుతూ). నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని పాత్రకు సరిపోయినా చాలామంది నన్ను సినిమాల్లో తీసుకోలేదు. మార్షల్ ఆర్ట్స్ వల్ల ఫెమినైన్ (స్త్రీత్వం)గా ఉండను అనుకుంటారు. అది ఒక డ్రాబ్యాక్. ఊరికే ఫైట్ చేస్తుంది అనుకుంటారు. మార్షల్ ఆర్ట్స్ అనేవి మనిషిని క్రమశిక్షణగా ఉంచడానికి, ఆత్మవిశ్వాసం పెంచడానికి, స్వీయ రక్షణకు ఉపయోగపడతాయి. దానివల్ల ఫెమినిటీ తగ్గదు. ఊరికే ఫైట్ చేయరు. చాలా బ్యాలెన్డ్స్‌గా ఉంటారు. బీహార్‌లో పుట్టి, హాలీవుడ్ ప్రాజెక్ట్ దాకా ఎదిగిన ఈ జర్నీ గురించి? బీహార్ అమ్మాయిలు హీరోయిన్ అవ్వాలని కలలు కనడమే ఎక్కువ. ఆ కలను నెరవేర్చుకున్నా. నాది సక్సెస్ఫుల్ జర్నీయే. ఇప్పుడు మీరు యాక్టర్, ప్రొడ్యూసర్, స్పోర్ట్స్ పర్సన్, డ్యాన్సర్.. అసలు చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు? చిన్నప్పుడు పిల్లలు అది అవ్వాలి.. ఇది అవ్వాలి అనుకోరు. వాళ్ల తల్లిదండ్రులు అనుకుంటారు. అటు వెపుగా పిల్లల్ని వెళ్లమంటారు. నేను ఇలా ఉన్నానంటే కారణం మా అమ్మగారు. తను నన్ను మార్షల్ ఆర్ట్స్ చేయమన్నారు. కథక్ నేర్చుకోమన్నారు. స్కూల్లో జరిగిన ఫంక్షన్స్‌లో యాక్ట్ చేశాను. నన్ను యాక్టర్‌ని చేసేలోపు నాలో ఈ స్కిల్స్ పెరిగేలా చూసుకున్నాడు దేవుడు. 12వ తరగతిలో నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. దాంతో నాకు చదువుకుంటూనే పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మా తమ్ముడు కూడా వాళ్ల క్లాస్ వాళ్లకు ట్యూషన్ చెప్పేవాడు. అంత టాలెంట్. ఇప్పుడు డైరెక్టర్, రైటర్ అయ్యాడు. ఇదంతా స్ట్రగుల్ అనుకోను. ‘స్ట్రగుల్’ అనే పదం నా డిక్షనరీలోనే ఉండదు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉండటం వల్ల చివరిదాకా పోరాడాలనే తత్వం నాలో ఏర్పడింది. హీరోయిన్ అవడంతో పాటు సినిమాలు నిర్మిస్తున్నారు... పైగా సందేశాత్మక సినిమాలు తీస్తున్నారు.. నా తమ్ముడు నితిన్‌తో కలిసి ఓ నిర్మాణ సంస్థను మొదలుపెట్టా. బీహార్‌కు అప్పటివరకూ నేషనల్ అవార్డ్ వచ్చింది లేదు. మా మొదటి సినిమా (‘దేశ్వా’)కే వచ్చింది. ఇంకా వెనక్కి వెళ్దాం. నా తొమ్మిదో తరగతిలో స్పోర్ట్స్‌లో ఇండియాను రిప్రజెంట్ చేశాను. జాకీచాన్ చేతుల మీదుగా అవార్డ్ వచ్చింది. నితిన్‌కు డైరెక్టర్‌గా హిందీ సినిమా చేసే అవకాశం వచ్చినా మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని భోజ్‌పురి సినిమా చేశాడు. బీహార్‌లో ఐదు భాషలు చనిపోయే స్థితిలో ఉన్నాయి. ‘భోజ్‌పురీ, మైధిలీ, మగై, అంగికా, బజ్జికా’... ఇవి బీహార్ భాషలు. భోజ్‌పురిలో చాలావరకు చీప్‌గా, బీ గ్రేడ్ సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలు మేం చేయాలనుకోలేదు. ఫ్యామిలీ అందరితో కలసి ఓ మాతృభాష సినిమా చూడలేని పరిస్థితి అక్కడ ఉంది. ఓ రెవల్యూషన్ తీసుకురావాలనుకున్నాం. మేం తీసే సినిమాల్లో రవి కిషన్, మనోజ్ తివారి వంటి స్టార్లు కనిపించరు. బీహార్లోనే షూటింగ్ చేస్తాం. అలా అయితే అక్కడివాళ్లకి కొంత పని కల్పించవచ్చు, ట్యాక్స్ కట్టవచ్చు అని. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? బీహార్ సినిమా పరిస్థితి మారాలంటే ఐదు ‘బాహుబలి’లు కావాలి. మార్షల్ ఆర్ట్స్ ఉపయోగాల గురించి అమ్మాయిలకు ఏమైనా చెబుతారా? శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతాం. ఐదుగురు అబ్బాయిలు వీధిలో ఉన్నారనుకోండి.. మామూలు అమ్మాయిలైతే ‘వామ్మో అబ్బాయిలు’ అని బిక్కుబిక్కుమంటూ నడుస్తారు. మీ నాన్న, అన్నయ్య, తమ్ముడు, భర్త.. ఇలా అందరూ ఎప్పుడూ మీతో ఉండలేరు కదా. అందుకని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. అబ్బాయిలు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. ఎందుకంటేæ యవ్వనంలో వాళ్లు చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. కానీ మార్షల్ ఆర్ట్స్ వల్ల సెన్సిబుల్‌గా మారిపోతారు. చుట్టూ ఉన్నవాళ్లను రక్షించాలనే మైండ్ సెట్ ఏర్పడుతుంది. ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? రెండు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తా. ఓ మ్యూజిక్ వీడియో చేశాను. దాని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. – డి.జి. భవాని -
వరస్ట్ ఎంట్రీ
అనుకున్నది సక్రమంగా జరగకపోతే బ్యాడ్ డేగా, మరింత మిస్‌ఫైర్ అయితే వరస్ట్ డేగా భావిస్తాం. హీరోయిన్ నీతూచంద్ర మాత్రం వరస్ట్ డేనే నాకు బెస్ట్ అంటున్నారు. కారణం ‘వరస్ట్ డే’ అనే షార్ట్ ఫిల్మ్‌తో హాలీవుడ్ ఇండస్ట్రీకు ఎంట్రీ ఇవ్వడమే. ‘గోదావరి, సత్యమేవజయతే’ వంటి తెలుగుసినిమాల్లో నటించారు నీతూచంద్ర. ఇప్పుడు హాలీవుడ్ సినిమా చేయడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ – ‘‘2019 నాకు అద్భుతంగా స్టార్ట్ అయింది. ‘వరస్ట్ డే’ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. ఇందులో నెగటివ్ రోల్ చేస్తున్నాను. ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా, భయంకరంగా ఉంటుంది. ఈ పాత్ర వల్ల నటిగా చాలా నేర్చుకునే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. స్టానిస్లివా అనే లాస్ ఏంజెల్స్ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఇదేకాక కొరియన్ సినిమాలో కూడా నీతూచంద్ర కనిపించనున్నారని సమాచారం. -
నా ప్రతిభను సరిగా వాడుకోలేదు
సాక్షి, చెన్నై: అందం, అభినయంలో ఎవరికీ తగ్గని నటి, బెంగాలీ బ్యూటీ నీతూచంద్ర. 'యావరుం నలం' (తెలుగులో పదమూడు) చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయింది. అనంతరం ఆదిభవాన్ చిత్రంలో జయం రవితో పోటీపడి పోరాట సన్నివేశాల్లోనూ నటించి మెప్పించింది. అయితే సినిమా సూపర్ హిట్ సాధించినా అమ్మడుకి అవకాశాలు మాత్రం రాలేదు. ఎందుకనో తను పెద్దగా కోలీవుడ్ దృష్టిని ఆకట్టుకోలేకపోయింది. అయితే అడపాదడపా కోలీవుడ్‌లో మెరుస్తున్న నీతూచంద్ర మాతృభాషలో నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తోంది. తాజాగా ఈబ్యూటీ సినిమా వాళ్లపై పెద్దనిందనే వేస్తోంది. అదేమిటంటే తనలో ఉన్న ప్రతిభను ఎలా ఉపయోగించుకోవాలో సినీ పరిశ్రమకు తెలియదు అంటోంది. సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్ వంటి హీరోలతో నటించే ప్రతిభ తనలో ఉందని, అయినా తన ప్రతిభను సరిగా వాడుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది. తన తండ్రి కేన్సర్ వ్యాధితో మరణించడంతో కుటుంబం, చిత్ర నిర్మాణ సంస్థ బాధ్యతలు చూసుకోవలసి వచ్చిందని అందుకే ఎక్కువ చిత్రాల్లో నటించాలని ఉన్నా కుదరడం లేదని తెలిపింది. మంచి కథ అనిపిస్తేనే నటించడానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు నీతూచంద్ర చెప్పింది. -
శింబుతో అందుకు నీతూ నో?
నటుడు శింబు చిత్రం నుంచి నటి నీతూచంద్రా వైదొలిగిందా? కోలీవుడ్‌లో నడుస్తున్న తాజా చర్చ ఇదే. సంచలన నటుడు శింబు నటిస్తున్న తాజా చిత్రం అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్. పలు ప్రత్యేకతలు సంతరించుకున్న ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది శింబు నాలుగు పాత్రల్లో నటించడం. రెండోది మిల్కీబ్యూటీ తమన్న, శ్రియ, సానాఖాన్లు ఆయనకు జంటగా నటించడం. త్రిష ఇల్లన్నా నయనతార వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైఖేల్ రాయప్పన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఇటీవల తెరపైకి వచ్చి రికార్డులు బద్దలు కొడుతున్న బాహుబలి చిత్రం తరహాలో అన్బానవన్ అసరాదవన్ అడంగాదన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండడం. కాగా ఇందులో మరో సంచలన నటి నీతూచంద్రా శింబుతో లెగ్ షేక్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ జాణ చిత్రం నుంచి వైదొలగిందనే ప్రచారం జోరందుకుంది. దీనిపై దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ వివరణ ఇస్తూ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో శింబు మధురై మైఖెల్, అశ్విన్దాదా మొదలైన నాలుగు గెటప్‌లలో తెరపై అలరించనున్నారని తెలిపారు. చిత్రంలో ఐదు పాటలు చోటు చేసుకుంటాయని చెప్పారు. యువన్‌శంకర్‌రాజా బాణీలు అందించిన వీటిలో ఇప్పటికి నాలుగు పాటల చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. మరో పాటను త్వరలోనే దుబాయ్‌లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాటలో శింబు సర్ప్రైజ్ గెటప్‌లో కనిపించనున్నారని చెప్పారు. ఇదే పాటకు ఆయనతో నటి నీతూచంద్రాను నటించడానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. అయితే ఆమె చిత్రం నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోందనని.. చిత్రంలో శింబుతో నీతూచంద్రా ఆడటం అన్నది జరిగితీరుతుందని స్పష్టం చేశారు. చిత్రం నుంచి ఆమెను ఎవరూ తొలగించలేదని తెలిపారు. ఇది బాహుబలి తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న చిత్రమని.. తొలి భాగాన్ని రంజాన్ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు,రెండవ భాగాన్ని మరో రెండు నెలల తరువాత విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
సింగమ్‌తో ఐటమ్!
‘గోదావరి’లో సుమంత్ మరదలుగా నటించిన నీతూ చంద్ర గుర్తుందా? చీరకట్టు, బొట్టుతో అచ్చ తెలుగు అమ్మాయిలా మెప్పించారు. ‘గోదావరి’ తర్వాత రాజశేఖర్ ‘సత్యమేవ జయతే’లో హీరోయిన్గా, ‘మనం’లో గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడీ బ్యూటీ ఐటమ్ సాంగ్ ద్వారా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సింగం-3’లో నీతు ఐటమ్ సాంగ్ చేశారు. ‘ఓ సోనే సోనే..’ సాంగ్‌లో సూర్యతో కలసి స్టెప్పులేశారు. తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 5న పాటల్ని, 16న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ స్వరకర్త. -
సూర్యతో బాలీవుడ్ బ్యూటీ నీతుచంద్ర
సూర్యతో బాలీవుడ్ బ్యూటీ నీతుచంద్ర లెగ్ షేక్ చేశారన్నది తాజా సమాచారం. కోలీవుడ్‌లో ఇంతకుముందు యావరుమ్ నలం, ఆదిభగవాన్ తదితర చిత్రాల్లో నాయకిగా నటించిన భామ నీతుచంద్ర. ఆ మధ్య యుద్ధం సెయ్ చిత్రం కోసం దర్శకుడు మిష్కిన్‌తో సింగిల్ సాంగ్‌లో ఆడిన ఆ బ్యూటీ చిన్నగ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్‌లో ఐటమ్‌సాంగ్‌తో ప్రత్యక్షం కానున్నారు. సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఎస్-3. సింగం చిత్రానికి మూడో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అందాల భామలు అనుష్క, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈచిత్రం కోసం ఇటీవల స్థానిక బిన్నిమిల్లో ఒక పాటను చిత్రీకరించారు. ఇందులో సూర్య సరసన నీతుచంద్ర లెగ్ షేక్ చేయడం విశేషం. సాధారణంగా హరి చిత్రాల్లో ఎందరు హీరోయిన్లు ఉన్నా మరో నటితో ప్రత్యేక గీతం చోటు చేసుకుంటుంది. సింగం-2లో అలాంటి ప్రత్యేక గీతంలో నటి అంజలి నటించారు. ఇప్పుడు ఉత్తరాది బ్యూటీ నీతుచంద్ర నటించారు. నృత్యదర్శకురాలు బృందా కొరియోగ్రఫీలో ఓ సానే సూపర్ సోనిక్ అనే పల్లవితో సాగే ఈ పాటను బిన్నిమిల్లులో నాలుగు రోజుల పాట చిత్రీకరించారు. ఎస్-3 చిత్రం దీపావళికి విడుదలవుతుందనే ప్రచారం జరిగింది.అయితే చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తికాకపోవడంతో చిత్రాన్ని డిసెంబర్ 16న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతల వర్గం అధికారికంగా ప్రకటించారు. ఎస్-3 క్రిస్మస్ సెలవులపై గురి పెట్టినట్లుంది. కొన్ని కీలక సన్నివేశాలను మలేషియాలోనూ ఒక పాటను జార్జియాలోనూ చిత్రీకరించనున్నట్లు సమాచారం. -
మూడోసారి నిర్మాతగా...!
‘గోదావరి’ చిత్రంలో హీరో సుమంత్‌కు మరదలిగా నటించిన నీతూ చంద్ర గుర్తున్నారా? ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా హిందీ చిత్రాలు చేస్తున్నారు. అది మాత్రమే కాదు. నాలుగేళ్ల క్రితం తన సోదరుడు నితిన్ చంద్రను దర్శకునిగా పరిచయం చేస్తూ, ‘దేశ్వా’ అనే చిత్రం నిర్మించారు. ఆ చిత్రానికి మంచి ప్రశంసలు లభించాయి. ఆ ఉత్సాహంతో నీతూ హిందీలో ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ బిహార్’ అనే చిత్రం నిర్మించారు. మొదటి రెండు చిత్రాలూ నిర్మాతగా అభినందనలు తెచ్చిపెట్టడంతో మూడో చిత్రం నిర్మిస్తున్నారు. ‘మిథిలియా మక్కాన్’ పేరుతో తన సోదరుడి దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మిస్తున్నారామె. ఇప్పటివరకూ యూఎస్, కెనడా, నేపాల్‌లో షూటింగ్ జరుపుకుంది. తదుపరి ముంబైలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. అనురీటా ఝా, పంకజ్ ఝా ముఖ్య తారలుగా ఈ చిత్రం రూపొందుతోంది. -
అమెరికాలో గోదావరి పిల్ల
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’ చిత్రంలో నటించిన నీతూ చంద్ర గుర్తున్నారా? అదేనండీ ఏ నిర్ణయం తీసుకోవాలన్న అయోమయానికి గురయ్యే యువతి పాత్రలో నటించిన కథానాయిక. నీతూ చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 9న న్యూయార్క్‌లో జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవాల్లో గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించనున్నారు. ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు అమెరికాలో స్థిరపడిన భారతీయులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. -
స్లీప్ వెల్!
మన ఆరోగ్యానికి నిద్ర చేసే మేలు అంతా ఇంతా కాదు. నావరకైతే మంచి నిద్ర అంటే, ఎనిమిది గంటలు నిద్రపోవడం. అయితే నా పనుల భారం వల్ల ఆ నిద్రలేమిని భర్తి చేయలేకపోతున్నాను. అందుకే నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు గంట పాటు ‘నిద్ర ఆసన’ వేస్తాను. ఇది శరీరానికి, మనుసుకు ఎంతో రిలాక్స్ ఇస్తుంది. నిద్రకు ముందు... మేకప్ తొలగిస్తాను. ముఖం శుభ్రంగా కడుక్కొని కొబ్బరినూనె రాస్తాను. నీళ్లు బాగా తాగుతాను. దిండు వాడను. వాడితే నాకు తలనొప్పి వస్తుంది. నా స్లీప్ సీక్రెట్: జీవితాన్ని ఈజీగా తీసుకో. పాజిటివ్‌గా చూడు. - నీతూ చంద్ర, హీరోయిన్ -
తమిళ చిత్రాలతోనే గుర్తింపు
తమిళ చిత్రాలతోనే తాను గుర్తింపు పొందినట్లు నటి నీతుచంద్ర పేర్కొన్నారు. ఈ బెంగాలీ సుందరి సొంతగడ్డపై నటిగానే కాకుండా నిర్మాతగా త్రాలు నిర్మించి అవార్డులు పొందారు. అయినా తమిళ చిత్రాలపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. కోలీవుడ్‌లో యావరుం నలం చిత్రంతో రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఆదిభగవాన్ తదితర చిత్రాల్లో నటించారు. ఇటీవల చెన్నైకి విచ్చేసిన ఈ బ్యూటీ మాట్లాడుతూ ఏడాది గ్యాప్ తరువాత మళ్లీ తమిళంలో ఒక చిత్రం చేయనున్నానని చెప్పారు. దర్శకుడు షాజి కైలాష్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కథ చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. తానిప్పటి వరకు పోషించనటువంటి పాత్రను ఈ చిత్రంలో పోషించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేనన్నారు. మంచి సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రంగా ఉంటుందన్నారు. వ్యాపారాత్మక చిత్రాల్లో నటించే అవకాశాలు తనకు ఇక్కడే లభిస్తున్నాయన్నారు. తాజా చిత్రంలో కూడా ఆ తరహా పాత్రనే పోషించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం చెన్నై, విశాఖపట్నం ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోనుందని చెప్పారు. ఇటీవల 1980 ప్రాంత నటీనటుల విందులో కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఇందులో నటి శ్రీప్రియకు అంకితం ఇచ్చేలా ఆమె నటించిన చిత్రంలోని పాటకు తాను నర్తించానన్నారు. ఇది తనకు తీయని అనుభూమితిని మిగిల్చిందన్నారు. -
హాలీవుడ్‌కెళ్లేది ఎవరు?
కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమయిన అంశం గురించి చర్చ జోరుగా సాగుతోంది. అదే హాలీవుడ్‌కెళ్లే దక్షిణాది హీరోయిన్ ఎవరన్నది. ఈ విషయంలో అందాల తార అనుష్క,నయనతారల్లో ఒకరికి అవకాశం లభించవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే హాలీవుడ్లో రూపొందుతున్న బ్రహ్మాండ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం ఎక్స్‌పాండబుల్‌లో ఏడుగురు హీరోయిన్లు ముఖ్య పాత్రలు ధరించనున్నారట. ఈ ఏడుగురు హీరోయిన్ల పాత్రలకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ నటీమణులను ఎంపిక చేసి నటింప చేయాలన్నది యూనిట్ వర్గాల నిర్ణయం. ఆ ఏడుగురు హీరోయిన్లలో దక్షిణాదికి చెందిన ఒక నటిని నటింప జేయాలని నిర్ణయించారట. వచ్చే ఏడాది ఎక్స్‌పాండబుల్ చిత్ర దర్శక, నిర్మాతల బృందం ముంబాయి చెన్నైలో మకాం పెట్టి హీరోయిన్ల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు సిల్వర్‌స్టార్ స్టాలిన్, మెల్‌గిప్సన్‌లు గౌరవ పాత్రల్లో మెరవనున్నారట. చిత్రంలో ఏడుగురు హీరోయిన్లు గ్లామర్‌ను గుప్పించడంతో పాటు సాహసోపేత పోరాటాలు చేయూల్సి ఉంటుందట. దీంతో తమిళంలో నయనతార, అనుష్క, రాయ్ లక్ష్మీ, నీతు చంద్రలలో ఒకరు ఎంపికయ్యే వకాశం ఉందని సమాచారం. అనుష్క అరుంధతి చిత్రంలో కత్తి చేత పట్టి రౌద్రపూరిత నటనను ప్రదర్శించారు. తాజాగా రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో వీరోచిత పాత్రల్ని పోషిస్తున్నారు. నయనతార తమిళ బిల్లా చిత్రంలో ఈత దుస్తుల్లో అందాల మోత మోగించడంతోపాటు పిస్టల్ చేత పట్టి హీరోయిజాన్ని ప్రదర్శించారు. ఇక నీతు చంద్ర ఆదిభగవాన్ చిత్రంలో, రాయ్‌లక్ష్మీ కూడా కొన్ని చిత్రాల్లో యాక్షన్ హీరోయిన్గా నటించారు. అయితే నయనతార, అనుష్కల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చని కోలీవుడ్ టాక్. మరి హాలీవుడ్‌కు వెళ్లేదెవరో..? -
అలాంటివి ఆశించొద్దు
సంస్కృతి సంప్రదాయ ప్రవర్తనలను నా నుంచి ఆశించొద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తోంది బెంగాలీ భామ నీతూ చంద్ర. తమిళంలో యావరుం నలం చిత్రం ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత జయం రవి సరసన ఆదిభగవాన్, యుద్ధం సెయ్ చిత్రంలో అమీర్‌తో ఐటమ్ సాంగ్ లాంటివి చేసేసి పాపులర్ అయ్యింది. ఈ మధ్య గ్రీక్ చిత్రం ఒకటి చేసిన నీతుచంద్ర ఏ విషయంలో అయినా చాలా బోల్డ్‌గా ఉంటుంది. తమిళంలో ఎక్కువ చిత్రాలు చెయ్యడం లేదే అన్న ప్రశ్నకు తాను నటిని మాత్రమే కాదు. నిర్మాతను కూడా. బెంగాలీలో మంచి కథా చిత్రాలను నిర్మించి నిర్మాతగా రాణించాలని ఆశిస్తున్నాను అని పేర్కొంది. అలాగే వైవిద్యభరిత పాత్ర అనిపిస్తే మాత్రమే నటించడానికి అంగీకరిస్తున్నానని చెప్పింది. మూస పాత్రలు చెయ్యదలచుకోలేదని స్పష్టం చేసింది. తన తల్లి తనను సూపర్ స్టార్‌గా భావిస్తారని ఆమె కలలను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మహిళలు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందడం అరుదని పేర్కొంది. అలాంటిది తాను మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది మూడు సార్లు భారత దేశం తరపున అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పింది. ఒక సారి నటుడు జాకీచాన్ నుంచి అవార్డు కూడా అందుకున్నట్లు తెలిపింది. అయినా తన తల్లి అంటే చాలా భయం అని అంది. తాను తరచూ పద్ధతిగా ప్రవర్తించాలంటూ హెచ్చరిస్తుంటారని చెప్పింది. సమాజంలో స్త్రీలకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని గుర్తు చేస్తుంటారని పేర్కొంది. అయితే సంస్కృతి, సంప్రదాయాలను తన నుంచి ఎదురుచూడటం ఆశనిపాతమేనని నీతూచంద్ర అంటోంది. ఈ విషయాలను ఇంత నిర్భయంగా చెప్పడంలోనే ఈ అమ్మాయి ఎంత ఫాస్టో అర్థం అవుతోంది. -
పెళ్లి సందేహమే
నేను పెళ్లి చేసుకుంటానన్నది సందేహమేనంటోంది నటి నీతు చంద్ర. ఈ బెంగాలీ భామ యావరుం నలమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. అనంతరం యుద్ధం ఫేమ్, ఆది భగవాన్ చిత్రాల్లో నటించింది. యోగి చిత్రంలో అమీర్‌తో ఐటమ్ సాంగ్‌కు స్టెప్స్ వేసిన ఈ బ్యూటీపై ఆ సమయంలో పలు వదంతులొచ్చాయి. బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడే ప్రేమలోపడిన నీతు చంద్ర ఆయనతో రెండేళ్లు డేటింగ్ చేసింది. చాలా మంది సినీ ప్రేమికుల మాది రిగానే వీరి ప్రేమకు ముసలం పుట్టింది. ఇద్దరు చర్చించుకుని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రేమ విఫలం నీతును చాలా బాధించిందట. ఆ తర్వాత నటనపైనే పూర్తి దృష్టి సారించిన నీతు చంద్ర గురించి మళ్లీ వదంతులు మొదలయ్యాయి. రణ్దీప్తో మళ్లీ చెట్టాపట్టాలంటూ చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి స్పందించిన నీతు చంద్ర రణ్‌దీప్ తాను మళ్లీ కలుసుకోలేదని స్పష్టం చేసింది. తాను ఒంటరేనని తెలిపింది. ఇక తన జీవితం లో పెళ్లి అనేది సందేహమేనని పేర్కొంది. తాను గ్రీస్ భాషలో నటించి న బ్లాక్ 12 అనే చిత్రం పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైందని వెల్లడించింది. అంతేకాదు గ్రీస్ భాషా చిత్రంలో నటించిన తొలి భారతీయ నటిని తానేనని చెప్పుకోవడం గర్వంగా ఉందని తెలిపింది. ఇకపోతే లెస్బియన్ చిత్రాలలో నటిస్తారా? అని అడుగుతున్నారని, సినిమానే అయినా మరో స్త్రీ తనను సృశించడాన్ని కలలో కూడా ఊహించలేనని నీతుచంద్ర పేర్కొంది. -
కన్నడంలో పువ్వాయ్ పువ్వాయ్...!
ఈ మధ్యకాలంలో వచ్చిన సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్‌లో ‘పువ్వాయ్ పువ్వాయ్...’ ఒకటి. మహేష్‌బాబు నటించిన ‘దూకుడు’లోని ఈ పాటకు తనతో పాటు పార్వతి మెల్టన్ కాలు కదిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే పాటకు కన్నడంలో నీతుచంద్ర డాన్స్ చేస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా కన్నడంలో ‘దూకుడు’ రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ప్రత్యేక పాటలో నీతూ నర్తిస్తున్నారు. ఇటీవలే పునీత్, నీతు పాల్గొనగా ఈ పాట చిత్రీకరణ ప్రారంభించారు. గణేష్ మాస్టర్ నృత్యదర్శకత్వంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని, స్టెప్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని నీతూ పేర్కొన్నారు. ఈ ట్యూన్ చాలా పెప్పీగా ఉందని కూడా తెలిపారామె. -
పెళ్లి చేసుకోమని ఒకటే పోరు: రణదీప్ హుడా
బాలీవుడ్ లో సుస్మితా సేన్, నీతూ చంద్రల డేటింగ్ తో కాలం గడిపిన బాలీవుడ్ హీరో రణదీప్ హుడా కు ఈ మధ్య ఇంటిపోరు ఎక్కువైంది. ప్రస్తుతం ఒంటరిగా కాలం గడుపుతూ.. కెరీర్ పైనే కన్నేసిన రణదీప్ ను ఓ ఇంటివాడైతే చూడాలని తల్లి కోరుకునేదటా! అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ అవకాశాలు పెరగడంతో పరిస్థితిని అర్ధం చేసుకున్న తన తల్లి ప్రస్తుతం పెళ్లి విషయం ఎత్తడం లేదని రణదీప్ తెలిపాడు. తన కుటుంబమే తనకు అతిపెద్ద విమర్శకులని.. తన కుటుంబానికి ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. తనకు పూర్తి సహకారాన్నిఅందిస్తున్నారని రణదీప్ మీడియాతో అన్నాడు. మాన్సూన్ వెడ్డింతో కెరీర్ ప్రారంభించిన రణదీప్ హుడా డర్నా జరూరీ హై, రిస్క్, రంగ్ రసియా, లవ్ కిచిడి,జన్నత్ 2, మర్డర్ 3 చిత్రాల్లో నటించాడు. -
మార్షల్ ఆర్ట్స్ పాఠ్యాంశం కావాలి
‘‘మనందరం ఏకతాటిపై నడవాల్సిన సమయం ఆసన్నమైంది. కొంతమంది మానసిక స్థితిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చెడుని ఏరిపారేయడానికి అందరం నడుం బిగించాలి’’ అంటున్నారు నీతూచ్రంద. ఇటీవలి కాలంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని ఆమె ఇలా అంటున్నారు. నిర్భయ సంఘటన మర్చిపోక ముందే, అలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇటీవల ఓ ఫొటోజర్నలిస్ట్పై జరిగిన సామూహిక అత్యాచారం కూడా వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనల నుంచి ఆడవాళ్లు తమను తాము రక్షించుకునేలా పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలంటున్నారు నీతూ. ఈ విషయమై, ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి ఓ దరఖాస్తు పెట్టారామె. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్న నీతూకి వాటివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో బాగా తెలుసు. అందుకే నాలుగో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాలంటున్నారు. ‘‘మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడం ద్వారా ప్రత్యర్థిని పళ్లతో గాయపరచడం, మోకాలు, మోచేతులతో పంచ్లివ్వడం, ప్రత్యర్థి మీదకు ఉరికితే, ఎగిరి వెనక్కు దూకడంలాంటివి అలడవడతాయి. అది మాత్రమే కాదు.. మార్షల్ ఆర్ట్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. లొంగిపోకుండా ఎదిరించి పోరాడే స్థయిర్యాన్ని ఇస్తుంది’’ అని చెప్పారు నీతూచంద్ర.