అలాంటివి ఆశించొద్దు
సంస్కృతి సంప్రదాయ ప్రవర్తనలను నా నుంచి ఆశించొద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తోంది బెంగాలీ భామ నీతూ చంద్ర. తమిళంలో యావరుం నలం చిత్రం ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత జయం రవి సరసన ఆదిభగవాన్, యుద్ధం సెయ్ చిత్రంలో అమీర్‌తో ఐటమ్ సాంగ్ లాంటివి చేసేసి పాపులర్ అయ్యింది. ఈ మధ్య గ్రీక్ చిత్రం ఒకటి చేసిన నీతుచంద్ర ఏ విషయంలో అయినా చాలా బోల్డ్‌గా ఉంటుంది. తమిళంలో ఎక్కువ చిత్రాలు చెయ్యడం లేదే అన్న ప్రశ్నకు తాను నటిని మాత్రమే కాదు. నిర్మాతను కూడా. బెంగాలీలో మంచి కథా చిత్రాలను నిర్మించి నిర్మాతగా రాణించాలని ఆశిస్తున్నాను అని పేర్కొంది. అలాగే వైవిద్యభరిత పాత్ర అనిపిస్తే మాత్రమే నటించడానికి అంగీకరిస్తున్నానని చెప్పింది. మూస పాత్రలు చెయ్యదలచుకోలేదని స్పష్టం చేసింది.
తన తల్లి తనను సూపర్ స్టార్‌గా భావిస్తారని ఆమె కలలను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మహిళలు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందడం అరుదని పేర్కొంది. అలాంటిది తాను మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది మూడు సార్లు భారత దేశం తరపున అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పింది. ఒక సారి నటుడు జాకీచాన్ నుంచి అవార్డు కూడా అందుకున్నట్లు తెలిపింది. అయినా తన తల్లి అంటే చాలా భయం అని అంది. తాను తరచూ పద్ధతిగా ప్రవర్తించాలంటూ హెచ్చరిస్తుంటారని చెప్పింది. సమాజంలో స్త్రీలకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని గుర్తు చేస్తుంటారని పేర్కొంది. అయితే సంస్కృతి, సంప్రదాయాలను తన నుంచి ఎదురుచూడటం ఆశనిపాతమేనని నీతూచంద్ర అంటోంది. ఈ విషయాలను ఇంత నిర్భయంగా చెప్పడంలోనే ఈ అమ్మాయి ఎంత ఫాస్టో అర్థం అవుతోంది.