తమిళసినిమా: నటి నీతూ చంద్రా గుర్తుందా? యావరుమ్ నలమ్, ఆదిభగవాన్ తదితర చిత్రాల్లో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి. ప్రస్తుతం హిందీ, బెంగాలీ తదితర భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడు తమిళంలో నటించి చాలా కాలం అయ్యింది. కాగా తమిళ చిత్రాల్లో నటించడం తనకు చాలా ఇష్టమని, అయితే మంచి అవకాశాలు రావడం లేదని ఇటీవల ఓ కార్యక్రమంలో వాపోయింది. ఆ వెంటనే కోలీవుడ్‌లో అవకాశం నీతూ చంద్రాను వరించింది. దర్శకుడు సుందర్.సీ కథానాయకుడిగానూ నటిస్తున్నారు.
ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం కాఫీ విత్ కాదల్ ఇటీవల విడుదలైంది. కాగా ఇరుట్టు చిత్రం తరువాత సుందర్.సీ కథానాయకుడిగా ఒన్ టూ ఒన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు భార్యగా నటి రాగిణీ త్రివేది నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనురాగ్ కాషీ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నీతూచంద్రా వచ్చి చేరినట్లు సమాచారం. ఇందులో ఆమె పాత్ర ఏమిటన్నది చిత్ర వర్గాలు వెల్లడించలేదు. తిరుజ్ఞానం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ విపిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment