వైవిధ్యభరిత కథాచిత్రాలకు కేరాఫ్ అడ్రస్ పా.రంజిత్. చుట్టూ ఉన్న సామాజిక అంశాలనే కథావస్తువులుగా తీసుకుని సినిమా అనే శిల్పంగా చెక్కుతుంటాడు. ఈయన సినిమాలు డైరెక్ట్ చేయడంతో పాటు పలు సినిమాలను నిర్మిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌లో బాటిల్ రాధ అనే సినిమా నిర్మిస్తున్నాడు. తాగుడుకు బానిసైన వ్యక్తి దాన్నుంచి ఎలా బయటపడ్డాడన్నదే కథ.
పా.రంజిత్ ఎమోషనల్
ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌లో పా.రంజిత్ (Pa. Ranjith) తన గతాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తోంది. తినే తిండి కోసం మనం ఎవరిపైనా ఆధారపడకూడదు. మా నాన్న కూడా ఎప్పుడూ అలాంటి పరిస్థితి రానివ్వలేదు. ఏనాడూ మమ్మల్ని పస్తులుంచలేదు. మేము మంచి బట్టలు వేసుకోవాలని, బాగా చదువుకోవాలని చెప్తుండేవాడు. అందుకోసం ఎంతో కష్టపడేవాడు.
(చదవండి: పిల్లలతో ఇదేం పని? టీఆర్పీ కోసం ఏదైనా చేయిస్తారా?)
పండగరోజు అమ్మ ఏడుస్తూ..
కానీ ఎప్పుడైతే తాగడం మొదలుపెట్టాడో తనను తానే కోల్పోయాడు. నాకు బాగా గుర్తుంది.. ఓ పండగరోజు ఊర్లోని అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మా ఇంట్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అమ్మ ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు నేను పన్నెండవ తరగతి చదువుతున్నాను. మా అమ్మ అలా నిత్యం ఏడుస్తుంటే చూడలేకపోయాను. తన బాధ భరించలేకపోయాను. చచ్చిపోదామనుకున్నాను. మా నాన్నతో మందు మాన్పించాలని అమ్మతో పాటు నా సోదరులు కూడా చాలా ప్రయత్నించారు.
మద్యానికి బానిసై చనిపోయాడు
చివరకు ఆస్పత్రిపాలయ్యాడు. ఆరు నెలలకంటే ఎక్కువ బతకడని చెప్పారు. కానీ వారం రోజుల్లోనే కన్నుమూశాడు. నాన్న.. మా అమ్మను కష్టపెట్టినట్లుగా నేను నా భార్యాపిల్లల్ని బాధ పెట్టకూడదని ఆరోజే నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. బాటిల్ రాధ సినిమా (Bottle Radha Movie) విషయానికి వస్తే.. దినకరణ్ శివలింగం డైరెక్ట్ చేసిన ఈ మూవీలో గురు సోమసుందరం, సంచన నటరాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ జనవరి 24న విడుదల కానుంది.
విభిన్న సినిమాల డైరెక్టర్
పా.రంజిత్ విషయానికి వస్తే.. అట్టకత్తి సినిమాతో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు. కార్తీతో మద్రాస్ మూవీ చేశాడు. రజనీకాంత్‌తో కబాలి, కాలా సినిమాలు చేశాడు. సార్పట్ట పరంపరై, నచ్చత్రం నగర్గిరదు మూవీస్ తెరకెక్కించిన ఈయన చివరగా తంగలాన్ చేశాడు. హిందీలోనూ నేరుగా ఓ సినిమా చేస్తానని గతేడాది ప్రకటించాడు. దీనికి బిర్సా ముండా అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశాడు.
ఎవరీ బిర్సా ముండా
బిర్సా ముండా ఆదివాసీ నాయకుడు. 19వ శతాబ్దంలో జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం పోరాడారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 22 ఏళ్ల వయసులోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా నామకరణం చేశారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!
Comments
Please login to add a commentAdd a comment