శింబుతో అందుకు నీతూ నో?
నటుడు శింబు చిత్రం నుంచి నటి నీతూచంద్రా వైదొలిగిందా? కోలీవుడ్‌లో నడుస్తున్న తాజా చర్చ ఇదే. సంచలన నటుడు శింబు నటిస్తున్న తాజా చిత్రం అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్. పలు ప్రత్యేకతలు సంతరించుకున్న ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది శింబు నాలుగు పాత్రల్లో నటించడం. రెండోది మిల్కీబ్యూటీ తమన్న, శ్రియ, సానాఖాన్‌లు ఆయనకు జంటగా నటించడం. త్రిష ఇల్లన్నా నయనతార వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైఖేల్ రాయప్పన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే ఇటీవల తెరపైకి వచ్చి రికార్డులు బద్దలు కొడుతున్న బాహుబలి చిత్రం తరహాలో అన్బానవన్ అసరాదవన్ అడంగాదన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండడం. కాగా ఇందులో మరో సంచలన నటి నీతూచంద్రా శింబుతో లెగ్ షేక్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ జాణ చిత్రం నుంచి వైదొలగిందనే ప్రచారం జోరందుకుంది. దీనిపై దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ వివరణ ఇస్తూ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో శింబు మధురై మైఖెల్, అశ్విన్‌దాదా మొదలైన నాలుగు గెటప్‌లలో తెరపై అలరించనున్నారని తెలిపారు.
చిత్రంలో ఐదు పాటలు చోటు చేసుకుంటాయని చెప్పారు. యువన్‌శంకర్‌రాజా బాణీలు అందించిన వీటిలో ఇప్పటికి నాలుగు పాటల చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. మరో పాటను త్వరలోనే దుబాయ్‌లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాటలో శింబు సర్‌ప్రైజ్ గెటప్‌లో కనిపించనున్నారని చెప్పారు. ఇదే పాటకు ఆయనతో నటి నీతూచంద్రాను నటించడానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.
అయితే ఆమె చిత్రం నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోందనని.. చిత్రంలో శింబుతో నీతూచంద్రా ఆడటం అన్నది జరిగితీరుతుందని స్పష్టం చేశారు. చిత్రం నుంచి ఆమెను ఎవరూ తొలగించలేదని తెలిపారు. ఇది బాహుబలి తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న చిత్రమని.. తొలి భాగాన్ని రంజాన్ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు,రెండవ భాగాన్ని మరో రెండు నెలల తరువాత విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.