మార్షల్ ఆర్ట్స్ పాఠ్యాంశం కావాలి
‘‘మనందరం ఏకతాటిపై నడవాల్సిన సమయం ఆసన్నమైంది. కొంతమంది మానసిక స్థితిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చెడుని ఏరిపారేయడానికి అందరం నడుం బిగించాలి’’ అంటున్నారు నీతూచ్రంద. ఇటీవలి కాలంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని ఆమె ఇలా అంటున్నారు. నిర్భయ సంఘటన మర్చిపోక ముందే, అలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి.
ఇటీవల ఓ ఫొటోజర్నలిస్ట్‌పై జరిగిన సామూహిక అత్యాచారం కూడా వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనల నుంచి ఆడవాళ్లు తమను తాము రక్షించుకునేలా పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలంటున్నారు నీతూ. ఈ విషయమై, ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి ఓ దరఖాస్తు పెట్టారామె. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్న నీతూకి వాటివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో బాగా తెలుసు.
అందుకే నాలుగో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాలంటున్నారు. ‘‘మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడం ద్వారా ప్రత్యర్థిని పళ్లతో గాయపరచడం, మోకాలు, మోచేతులతో పంచ్‌లివ్వడం, ప్రత్యర్థి మీదకు ఉరికితే, ఎగిరి వెనక్కు దూకడంలాంటివి అలడవడతాయి. అది మాత్రమే కాదు.. మార్షల్ ఆర్ట్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. లొంగిపోకుండా ఎదిరించి పోరాడే స్థయిర్యాన్ని ఇస్తుంది’’ అని చెప్పారు నీతూచంద్ర.