
సినిమా: నటుడు సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఎన్‌జీకే. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి సాయిపల్లవి, రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ముందు ప్రకటించారు. అయితే చిత్ర నిర్మాణం ప్రణాళిక ప్రకారం పూర్తికాకపోవడంతో చిత్ర విడుదలలో జాప్యం జరిగిందని, అందుకు సూర్య అభిమానులకు క్షమాపణ చెప్పుకుంటున్నట్లు నిర్మాతల వర్గం ఆ మధ్య వెల్లడించింది. ఎన్‌జీకే చిత్ర చివరి షెడ్యూల్ ఈ నెల చివరిలో ప్రారంభం కానుందని, 20 రోజుల పాటు చెన్నైలో జరగనుందని తాజాగా చిత్ర వర్గాలు తెలిపారు.
దీంతో డిసెంబర్ రెండో వారం వరకూ షూటింగ్ కొనసాగే అవకాశం ఉంది. దీంతో నిర్మాణాంతర కార్యక్రమాలు జరగాల్సి ఉండడంతో సంక్రాంతికి కూడా ఎన్‌జీకే తెరపైకి వచ్చే అవకాశం లేదు. అంతేకాదు రిపబ్లిక్‌డే సందర్భంగా కూడా చిత్రం విడదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి తొలివారం లేక రెండవ వారమే సూర్య చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ చిత్రం వ్యవహారంలో నటుడు సూర్యకు దర్శకుడు సెల్వరాఘవన్‌కు మధ్య మనస్పర్థలు, అదే విధంగా నిర్మాతకు, దర్శకుడికి మధ్య విభేదాలు తలెత్తినట్లు కోలీవుడ్‌లో ప్రచారం వైరల్ అవుతోంది. నటుడు సూర్య ఎన్‌జీకే చిత్రం తరువాత దర్శకుడు కేవీ.ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం ఎన్‌జీకే చిత్రం కంటే ముందు విడుదలైనా ఆశ్చర్య పడాల్సిన అవసరం ఉండదనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment