‘సత్యమేవ జయతే’లో సూర్య
ముంబై: సామాజిక దురాచాలపై చర్చ కోసం బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ నిర్వహిస్తున్న సత్యమేవ జయతే షోకు సహకరించడానికి దక్షిణాది హీరోలు రెడీ అంటున్నారు. దక్షిణాదిలో బాగా జనాదరణ ఉన్న హీరోల్లో ఒకరైన మోహన్‌లాల్ ఇది వరకే ఈ షోలో పాలుపంచుకోవడానికి ఒప్పుకున్నారు. లాల్ బాటలో తమిళ నటుడు సూర్య కూడా సత్యమేవ జయతే వేదికపైకి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి హీరోలంతా ఏకమై మనదేశాన్ని వేధిస్తున్న సామాజిక దురాచారాల నిర్మూలనకు కృషి చేయాలని ఆమిర్ కోరాడు. సత్యమేవ జయతేను హిందీలో నిర్మిస్తున్నా, మరాఠీ, బెంగాలీ, తమిళం, మలయాళం, తెలుగులోనూ అనువందించి ప్రసారం చేస్తారు. పలు సామాజిక అంశాల నేపథ్యంగా 2012లో వచ్చిన సత్యమేవ జయతే దేశవిదేశాల్లోనూ సంచలనం సృష్టించడం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి లాల్‌ను ప్రచారకర్తగా నియమించడం వల్ల దక్షిణాదిలో వీక్షకుల సంఖ్య బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. షోలో ఆమిర్ లేవనెత్తే పలు అంశాలపై లాల్ మాట్లాడతారు. స్టార్‌టీవీ నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ మలయాళ హీరో అన్నారు. ఈ కొత్త తరహా షోలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విపులంగా చర్చిస్తామని అన్నారు. లాల్, సూర్య వంటి నటులు షోలో కనిపించడం వల్ల ఇది మరింత మందికి చేరుతుందని స్టార్‌ఇండియా సీఈఓ ఉదయ్‌శంకర్ అన్నారు. దీని రెండో భాగం వచ్చే నెల రెండు నుంచి ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. స్టార్ గ్రూపు చానళ్లు స్టార్ ప్లస్, స్టార్ ప్రవాహ్, స్టార్ విజయ్, స్టార్ ఉత్సవ్, దూరదర్శన్‌లో ఈ షో ప్రసారమవుతుంది. తెలుగు చానల్ ఈటీవీలో మధ్యాహ్నం ఒంటిగంటకు సత్యమేవ జయతేను చూడవచ్చని స్టార్ వర్గాలు తెలిపాయి.