సినిమా: కోలీవుడ్, టాలీవుడ్ అంటూ దక్షిణాదిలో నటిగా పేరు తెచ్చుకుని ఆ తరువాత బాలీవుడ్‌లో సెటిల్ అయిన నటి తాప్సీ. ఈ మధ్య తనకు సంబంధం లేని విషయాల్లో కూడా నేనున్నానంటూ బయలుదేరుతుంది తాప్సీ. ఈ అమ్మడి వ్యవహారం ఎటుదారి తీస్తుందో తెలియదుగానీ బింకాలు మాత్రం బాగానే పోతోంది. అసలు కథేంటంటే తెలుగులో బాలకృష్ణ సరసన వీరభద్ర, తమిళంలో విశాల్‌కు జంటగా తీరాద విళైయాట్టు పిళ్లై చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన తనూశ్రీదత్తా గురించి అప్పట్లో పెద్దగా తెలియని వారుంటారేమోగానీ ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రముఖ బాలీవుడ్ నటుడు నానాపటేకర్ వంటి వారు తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కింది.ఈ విషయంలో నటి తనూశ్రీదత్తాపై విమర్శించేవారి సంఖ్యతో పాటు మద్దతిచ్చే వారి సంఖ్యంగా బాగానే ఉంది. ఎప్పుడో పదేళ్ల ముందు జరిగిన సంఘటనలను ఇప్పుడు బయట పెట్టడం ఏమిటని విమర్శిస్తున్న వాళ్ల మధ్య తనూశ్రీదత్తా ఆరోపణలకు ఆధారాలున్నాయని ఆమెకు మద్దతుగా నిలిచేనటి తాప్సీ లాంటి వారు ఉన్నారు.అసలు తనూశ్రీ గురించి నటి తాప్సీ ఏమందో చూద్దాం.
సంఘటన జరిగినప్పుడే దాని గురించి బహిరంగంగా చెప్పవచ్చుగా అని నేను తనూశ్రీదత్తాను అడగను. ఆమె ఇంతకు ముందే పిర్యాదు చేసింది. అయితే అప్పట్లో ఆమెను గొంతు నొక్కే ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. దీంతో తనూశ్రీ ఇప్పుడు వాయిస్ పెంచింది. నాకు ఆమె మీద గానీ, తన ఉద్దేశంపైగానీ ఎలాంటిసందేహాలు లేవు. ఆమె అసభ్య సంఘటనకు గురైంది. అందుకు ఆధారాలు ఉన్నాయి. అందుకే 10 ఏళ్ల తరువాత గానీ, 40 ఏళ్ల తరువాత గానీ ఫిర్యాదు చేయడం పెద్ద విషయం కాదు. ఆ సంఘటనకు సంబంధించిన ప్రశ్నలకు తనూశ్రీ దత్తా చాలా ధైర్యంగా బదులిస్తున్నారు. అందులో ఆమె నిజాయితీ తెలుస్తోంది. తనూశ్రీదత్తాను చూసి ఆమెలా బాధింపునకు గురైనవారు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పాలన్నది నా భావన. ఆమె విషయంలో నా మనసుకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను. నేను నా మనసాక్షిని చంపుకుని జీవించలేను. ఇతరులేమనుకుంటారు అని భయపడుతూ జీవించలేను. నాకు నచ్చిన విధంగానే జీవిస్తాను. నా మససు స్వచ్ఛంగా ఉండబట్టే రాత్రుల్లో ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నాను అని తాప్సీ పేర్కొంది. నటుడు నానాటేకర్ నటి తనూశ్రీదత్తాతో అసభ్యంగా ప్రవర్తించలేదని, అసలు అలాంటి సంఘటనే జరగలేదని చెబుతున్నారు. నటి తనూశ్రీ దత్తా వద్ద అధారాలున్నాయని నటి తాప్సీ ఆమెకు వకాల్తా పలుకుతోంది. మరో పక్క నానాపటేకర్ ఈ వ్యవమారంలో నటి తనూశ్రీదత్తాకు నోటీసులు పంపారు. దీంతో ఈ రచ్చ ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి సినీవర్గాల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment