యాక్షన్ సినిమాలపై మనసుపడ్డ హీరోయిన్!
ముంబై: సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉన్న హీరోయిన్ టబు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలో పోషించి నటిగా నిరూపించకున్న టబు మనస్సు ఇప్పుడు యాక్షన్ సినిమాల వైపు మళ్లింది. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యరాయ్ 'జజ్బా' యాక్షన్ సినిమాతో సత్తా చాటింది. ఈ నేపథ్యంలో తాను కూడా ఓ యాక్షన్ సినిమాలో ఫైట్లు, విన్యాసాలు చేసి.. ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఈ అమ్మడు కోరుకుంటోంది.
ఇదే విషయాన్ని తాజాగా ఓ వార్తాసంస్థకు టబు తెలిపింది. పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అని ప్రకటించింది. ప్రస్తుతానికైతే భారీ యాక్షన్ సీన్లతో గొప్ప కంటెంట్ ఉన్న స్ర్కిప్ట్ తన దృష్టికి రాలేదని, ఒకవేళ వస్తే తప్పకుండా చేస్తానని ఆమె తెలిపింది. ఇది కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ యాక్షన్ సినిమాగా ఉండాలని చెప్పింది. ఈ మధ్యకాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నప్పటికీ, తన ప్రయారిటీస్ వేరు అని, మంచి బలమున్న కథాంశంతోపాటు దానిని సరిగ్గా డీల్ చేయగల డైరెక్టర్, చక్కగా నిర్మించగల ప్రొడ్యూసర్ ఉంటేనే.. అలాంటి ప్రాజెక్టుల్లో తాను భాగం అవుతానని టబు వివరించింది. టబు తాజాగా నటించిన సినిమా ఫితూర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు అభిషేక్ కపూర్, నిర్మాత సిదార్థ రాయ్ కపూర్.