రాజమౌళిపై మిల్కీబ్యూటీ గుస్సా
మిల్కీబ్యూటీ తమన్నా చాలా అసహనానికి గురవుతున్నారట. సాధారణంగా విజయాలు ఆనందాన్ని పోగేసుకొస్తాయి. అలాంటి విజయం తమన్నాకు మాత్రం చికాకు కలిగించడం విశేషం. కొన్ని రోజుల ముందు వరకూ బాహుబలి చిత్రం తన కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ చిత్రాన్ని జీవితంలో మరచిపోలేను అంటూ ఎంతో ఉత్సాహంతో తెగ ఇంటర్వూ్యలు ఇచ్చేసిన ఈ జాణ తాజాగా బాహుబలి–2 చిత్రంతో డీలా పడిపోయింది. బాహుబలి–2 భారతీయ సినిమా రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ ఖ్యాతి పొందుతుంటే, అదే సినిమా తమన్నాను మాత్రం టెన్షన్‌కు గురి చేస్తోందట.
విషయం ఏమిటంటే బాహుబలి చిత్రంలో వీరనారిగా విజృంభించిన తమన్నాకు రెండో భాగంలో కనిపించీ కనిపించకుండా పోయిన పరిస్థితి. అంతా అనుష్క హవానే కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ లైట్‌గా తీసుకున్నా, అమ్మడి అభిమానులు, సన్నిహితులు ఫోన్లు చేసి మీరు చాలా తక్కువ సన్నివేశాల్లోనే కనిపించారు. అందులో సంభాషణలే లేవు అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. దర్శకుడు కావాలనే మీ సన్నివేశాలను కట్ చేశారని పేర్కొంటూ యూనిట్ వర్గాలు తమన్నాను టెన్షన్‌కు గురి చేస్తున్నారట. అలాంటి వారందరికీ బదులు చెప్పలేక ఈ ముద్దుగుమ్మ తీవ్ర అసహనానికి గురవుతోందట. అంతే కాదు దర్శకుడు రాజమౌళిపై గుస్సాగా ఉందట. పాపం తమన్నా.. ఇలాంటి పరిస్థితి ఏ నటికైనా సంకటంగానే ఉంటుంది మరి.