
తమన్నా డాన్స్‌లో దుమ్మురేపారు
నటి తమన్నా డాన్స్‌లో దుమ్మురేపారని డాన్సింగ్‌కింగ్ ప్రభుదేవా అన్నారు. ఈయన నిర్మాతగా మారి తన ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తూ, కథానాయకుడిగా నటించిన చిత్రం దేవి. తమిళ్, తెలుగు, హిందీ భాషలలో ఏక కాలంలో రూపొందిన ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. తమన్నా నాయకి. సోనూసూద్, ఆర్‌జే.బాలాజీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది.
ఈ సందర్భంగా నటుడు, నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ ఈ చిత్ర విషయంలో ఒక్క నటనపైనే దృష్టి సారించి దర్శకుడు విజయ్, నటి తమన్నా, ఆర్‌జే.బాలాజీల నుంచి మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని భావించానన్నారు. ముందు నుంచి ఇదే అభిప్రాయం మైండ్‌లో ఫిక్స్ అయ్యి పోయిందన్నారు. ఇదే భావనతో దేవునికి నమస్కరించుకున్నానని అన్నారు.
నటుడిగా ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏమిటని అడుగుతున్నారనీ, ముందు తాను ఒక డాన్సర్‌గా పరిచయం అయ్యానన్నారు. ఆ తరువాత మాస్టర్, నటుడు, దర్శకుడుగా మారానని వివరించారు. అదే విధంగా తమిళం, తరువాత తెలుగు, హిందీ అంటూ తన పయనం సాగిందన్నారు. మళ్లీ ఇప్పుడు ఒక కొత్త నటుడిగా తమిళంలోకి వస్తున్నాననీ అన్నారు. ఇక దర్శకుడు విజయ్‌కు సహనం ఎక్కువ అన్నారు. చిన్న నటుడి నుంచి అందరికీ చాలా ఓర్పుగా సన్నివేశాలను వివరిస్తారనీ తెలిపారు.
ఫారిన్ గర్ల్ అనుకున్నా
ఇక నటి తమన్నా గురించి చెప్పే తీరాలన్నారు. నిజానికి తనకు తమన్నా పరిచయం లేదని, ఒక సారి ఫ్లైట్‌లో ఒక ఫారిన్ గర్ల్ తనను చూసి చేయి ఊపారన్నారు. బదులుగా తానూ చేయి ఊపానన్నారు. అప్పుడు తన స్నేహితుడితో చూశావా తనకు ఫారిన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అని గర్వంగా అన్నానని, అప్పుడు అతను ఆమె నటి తమన్న అని చెప్పారని తెలిపారు. అలాంటి ఫారిన్ గర్ల్‌లా ఉండే తమన్నాను దర్శకుడు విజయ్ ఈ చిత్రం కోసం విలేజ్ గర్ల్‌గా మారుస్తానంటే తాను నమ్మలేదన్నారు. అయితే రెండు గంటలు మేకప్ వేసి అచ్చం పల్లెటూరి అమ్మాయిగా తమన్నను మార్చేశారని చెప్పారు.
తమన్నా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనీ, తను సన్నివేశాల్లో చాలా అంకిత భావంతో నటిస్తారని ప్రశంసించారు. కాగా ఒక పాట రిహార్సల్స్ కోసం రెండు రోజులు వరుసగా రెండు రోజులు వచ్చిన తమన్న మూడో రోజు రాలేదని తెలిపారు. ఫోన్ చేస్తే కాలు నొప్పి అనీ, ఆ తరువాత నడుము నొప్పి, మెడ నొప్పి, ఒళ్లు నొప్పి, జ్వరం అంటూ ఈ రోజుకు వదిలేయండి సార్, రేపు చేద్దాం అని అన్నారన్నారు. ఆ తరువాత 15 రోజులు చిత్రీకరించిన పాటలో తమన్నా డాన్స్‌లో దుమ్ము రేపారన్నారు. సోనూసూద్, ఆర్‌జే.బాలాజీ అందరూ చాలా బాగా నటించారని తెలిపారు. చిత్రాన్ని అక్టోబర్ ఏడో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుదేవా వెల్లడించారు.