
మళ్లీ... తమన్నా ఐటమ్!
స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగుల్లో నటించడమనే ట్రెండ్ బాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ఉంది. తెలుగులో ఇటీవల ఈ ట్రెండ్‌ను పాపులర్ చేసిన స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. ‘నా ఇంటి పేరు సిల్కూ.. నా ఒంటి పేరు మిల్కూ’ అంటూ ‘అల్లుడు శీను’లో కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ప్రత్యేక పాట చేయడం అప్పట్లో హాట్ టాపిక్. తర్వాత అదే హీరోతో ‘స్పీడున్నోడు’లోనూ స్పెషల్ సాంగ్ చేశారు. ఆ రెండు పాటలూ హిట్టే.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తెలుగులో ప్రత్యేక పాట చేయడానికి తమన్నా రెడీ అయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘జాగ్వార్’. చన్నాంబిక ఫిలింస్ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్నారు. ఎ.మహదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చేయనున్నారు.
ఈ నెల 5న ప్రారంభమయ్యే షెడ్యూల్‌లో ఈ సాంగ్ షూట్ చేస్తారు. ‘‘ఎస్.ఎస్.తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. సెప్టెంబర్ 18న పాటల్ని, అక్టోబర్ 6న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని కుమారస్వామి తెలిపారు.