తమన్నాకు తెలుగు నేర్పించింది మనోడే! | Tamanna Own Dubbing For Oopiri Movie | Sakshi
Sakshi News home page

తమన్నాకు తెలుగు నేర్పించింది మనోడే!

Published Thu, Mar 31 2016 2:52 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

తమన్నాకు తెలుగు నేర్పించింది మనోడే!

తమన్నాకు తెలుగు నేర్పించింది మనోడే!

  ‘ఊపిరి’తో సొంత డబ్బింగ్‌కు శ్రీకారం
  మూలస్థానం కుర్రోడిదే కీలకపాత్ర
 
 ఆలమూరు : ముంబయికి చెందిన ప్రముఖ హీరోయిన్ తమన్నా ఇటీవల విడుదలైన ‘ఊపిరి’ చిత్రంలో సొంత  గొంతుకతో తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది కదూ! అయితే ఆ మాటల వెనుక మన జిల్లాకు చెందిన కుర్రాడే ఉండటం విశేషం. ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారానికి చెందిన ఉప్పులూరి నాగ సుబ్రహ్మణ్యం (పండు) ఐదేళ్లుగా తమన్నా వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం షూటింగ్ సమయంలోను, బయట కూడా సహాయకుడిగా ఉంటున్నాడు. అయితే తమన్నా తెలుగు నేర్చుకోవాలనే తపనకు ఈపండు అంకితభావం ఎంతో దోహదపడింది.
 
 సినిమా రంగంపై ఉన్న మోజుతో..
 సినిమా రంగంపై ఉన్న మోజుతో పండు సుమారు పదేళ్ల క్రితం ఇల్లు విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అనేక కష్ట నష్టాలకోర్చి తొలుత హీరోయిన్ మమతా మోహన్‌దాసు వద్ద సహాయకుడిగా పనిచేసి రోజుకు రూ.రెండు వందలు జీతం తీసుకునేవాడు. అతని ప్రతిభను, వాక్చాతుర్యాన్ని గమనించిన హీరో రవితేజ తన సహాయకుడిగా నియమించకున్నాడు. నాలుగేళ్లు ఆయన వద్ద పనిచేసిన పండు ఆ తరువాత తమన్నా వద్ద సహాయకుడిగా చేరాడు. తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్‌లకు తమన్నా ఎక్కడికి వెళ్లినా ఆమె వెంట పండు ఉంటాడు. విద్యాభ్యాసాన్ని ఏడవ తరగతిలోనే ముగించినప్పటికీ కార్యదీక్షతో ప్రముఖ సినీ హీరో, హీరోయిన్ల వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న సమయంలో వారితో పాటు చాలా దేశాలను తిరిగివచ్చాడు.
 
 అందం కాపాడటంలో..
 సినిమాల్లోని నటీనటులు అందంగా ఉండటానికి మేకప్ మ్యాన్‌లు విశేషంగా కృషి చేస్తుంటారు. అయితే ఆ మేకప్ చెరిగిపోకుండా కాపాడేది ఈ సహాయకులే. షూటింగ్ సమయంలో క్లాప్ కొట్టే చివరి క్షణం వరకూ ఆ నటుల అందానికి భంగం కలుగకుండా వీరు గొడుగు పడుతూ ఉంటారు. తమన్నా, రవితేజతో పాటు అల్లు అర్జున్ తదితరులకు సహాయకుడిగా పనిచేసి గుర్తింపు తెచ్చుకుని పండు అందరి మన్ననలను అందుకుంటున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాళం, ఇంగ్లిషు భాషల్లో పరిజ్ఞానం సాధించడంతో అతనికి అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడుతున్నాయి. తమన్నాకు షూటింగ్‌లు లేని సమయంలో ఇతర హీరో హీరోయిన్లు కూడా విదేశీ షూటింగ్‌లకు పండును తీసుకువెళ్లడం అతనిలో ఉన్న ప్రతిభను సూచిస్తుంది.
 
 ఎన్నడూ పనివాడుగా చూడలేదు
 హీరోయిన్ తమన్నా అనతి కాలంలోనే సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ తనను ఎప్పుడు పనివాడుగా చూడలేదని పండు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. తనను ఇంట్లో వ్యక్తిగానే పరిగణిస్తూ క్రమం తప్పకుండా యోగక్షేమాలను చూసుకుంటారన్నారు. తెలుగు భాషపై ఉన్న మక్కువతో ముఖ్యంగా మన జిల్లా యాసను నేర్చుకునేందుకు ఆమె ఎంతో శ్రమ పడ్డారన్నారు. తెలుగు పదాలు, అర్థాలు తన ద్వారానే నేర్చుకుని ప్రస్తుతం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం తనకు మరుపురాని అనుభూతిని మిగిల్చిందన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన జాతీయ ఉత్తమ చిత్రం బాహుబలి షూటింగ్ సమయంలో తాను తమన్నాకు సహాయకుడిగా పనిచేశానని, ఆ చిత్ర నిర్మాణంలో తన భాగస్వామ్యం ఉండటం ఎన్నటికీ మరువలేనని చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement