మొహమాటం వదిలేయాలి!
చుట్టూ నలుగురు ఉంటేనే చాలామందికి నోట మాట రాదు. మరి.. సినిమా తారల చుట్టూ వందల మంది ఉంటారు. ఎలా నటించగలుగుతారబ్బా? అనే డౌటు చాలామందికి వస్తుంటుంది. ఇదే విషయం గురించి ఇటీవల తమన్నా దగ్గర ప్రస్తావిస్తే - ‘‘ఆర్టిస్టుగా నటించాలంటే పరిసర ప్రాంతాలను మర్చిపోవాలి. మనల్ని ఎవరూ చూడటంలేదు అనుకోవాలి. ముఖ్యంగా మొహమాటం వదిలేయాలి. చేస్తున్న పాత్రకు న్యాయం చేయాలనే విషయాన్ని మాత్రమే మనసులో పెట్టుకుని, నటించాలి. నేనలానే చేస్తాను. చుట్టూ ఎంతమంది ఉన్నా టైపిస్ట్‌లు కీ-బోర్డ్‌ని టపటపలాడిస్తూ తమ పని తాము చేసుకుపోతారు.
కండక్టర్లూ, డాక్టర్లూ.. ఇలా ఎవరికివాళ్లు తమ పని తాము చేస్తారు. మేం కూడా అంతే. మా పని మేం చేస్తున్నాం. చుట్టూ వేల మంది ఉన్నా మా పని మేం చేయాలి. అందరి గురించీ ఆలోచించి, బాగా చేయకపోతే మేం మాటలు పడాల్సి వస్తుంది. దాంతో పాటు వృత్తి మీద భక్తి, శ్రద్ధలు లేవని కూడా అనిపించుకోవాల్సి వస్తుంది. అందుకే కెమెరా ముందుకెళ్లాక నన్ను మర్చిపోతాను. ఇతరులనూ మర్చిపోతాను. పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకుని చేస్తాను’’ అన్నారు.