యాక్టింగ్ గ్రేట్... డెరైక్షన్ వీక్... తమాషా | 'Tamasha' review: Ranbir and Deepika stun in Imtiaz Ali's audacious love story | Sakshi
Sakshi News home page

యాక్టింగ్ గ్రేట్... డెరైక్షన్ వీక్... తమాషా

Published Fri, Nov 27 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

యాక్టింగ్ గ్రేట్... డెరైక్షన్ వీక్... తమాషా

యాక్టింగ్ గ్రేట్... డెరైక్షన్ వీక్... తమాషా

కొత్త సినిమా గురూ!
రొమాంటిక్ సినిమాలు తీయడంలో దిట్ట దర్శకుడు ఇమ్తియాజ్ అలీ.
మాజీ ప్రేమికులు - రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకోనే.
వీళ్ళ ముగ్గురి కాంబినేషన్‌లో ఒక చిత్రమైన ప్రేమకథ.
తాజా హిందీ చిత్రం ‘తమాషా’ మీద ఆసక్తి కలగడానికి అంతకన్నా ఇంకేం కావాలి?
కానీ, ఇందులో చర్చించిన పాయింట్ అంతకు మించి!

 
చిత్రం - ‘తమాషా’ (హిందీ)
తారాగణం - రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనే
కెమేరా - రవివర్మన్
సంగీతం - ఏ.ఆర్. రహమాన్,
ఎడిటింగ్ - ఆర్తీ బజాజ్
నిర్మాత - సాజిద్ నడియాడ్‌వాలా
రచన, దర్శకత్వం - ఇమ్తియాజ్ అలీ
 
జీవితం ఎలా జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? చిన్నప్పుడు ఇంట్లో తల్లి తండ్రుల నుంచి స్కూల్‌లో టీచర్ దాకా, పెద్దయ్యాక ఫ్రెండ్‌‌స మొదలు ఆఫీస్‌లో బాస్ దాకా ప్రతి ఒక్కరూ కండిషనింగ్ చేసేవాళ్ళే. చుక్కలకు ఎగరనివ్వకుండా రెక్కలు కత్తిరించేవాళ్ళే. మరి అప్పుడు జీవితం ఎలా జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? తాత్త్వికంగా అనిపించినా, వాస్తవికంగా అందరూ ఎదుర్కొనే సమస్య ఇది.

ముఖ్యంగా, మనసుకు సంకెళ్ళు లేకుండా, ఊహాప్రపంచంలోకి విహరిస్తూ, నచ్చింది చేస్తూ నచ్చినట్లు బతకాలని తపించేవాళ్ళకు అది మరీ పెద్ద సమస్య. మరి, అలాంటి ఒక అబ్బాయి వేద్ (రణబీర్‌కపూర్)కీ, ఒక అమ్మాయి తార (దీపిక)కీ మధ్య ఒకరి గురించి మరొకరికి తెలియనప్పుడు ప్రేమ పుడితే? పేర్లయినా తెలియకుండానే విడిపోయిన వారిద్దరూ నాలుగేళ్ళ తరువాత మళ్ళీ ఎదురైతే? ఇలాంటి ఒక చిత్రమైన నేపథ్యాన్ని, ఎంచుకున్న సమస్యకు జోడించి, దర్శకుడు ఇమ్తియాజ్ అలీ అందించిన న్యూ ఏజ్ లవ్‌స్టోరీ - ‘తమాషా’.
 
నవతరం మనస్తత్తాన్నీ, చిత్రమైన ప్రేమకథల్నీ రంగరించి విచిత్రంగా చెప్పడంలో పేరున్న ఇమ్తియాజ్ అలీ ఈసారీ ఆ శైలినే అనుసరించారు. సాదాసీదాగా సినిమాలన్నీ నడిచే లీనియర్ పద్ధతిలో కాక, నాన్-లీనియర్ కథనాన్ని ఎంచుకున్నారు. అందుకు తగ్గట్లే ఆయన తీసుకున్న హీరో, హీరోయిన్ పాత్రల్లో బోలెడంత మానసిక సంఘర్షణ, వదులుకోలేని భయాలు, వదిలించుకోలేని గతం - వర్తమానాలు ఉంటాయి.

ఆ పాత్రలకు తెరపై బొమ్మ కట్టడంలో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనేలు నూటికి నూరుపాళ్ళూ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా తండ్రితో పాటు సొసైటీ చేసిన కండిషనింగ్‌తో మనసును చంపుకొని, యాంత్రికంగా ఉద్యోగం చేసే వేద్ పాత్రలో రణ్‌బీర్ నటన బాగుంది. అలాగే, అతనెవరో తెలీని పరిస్థితుల్లో అతనిలోని ఆ కోణాన్నే ఇష్టపడి, ప్రేమించి, ఆనక ఆ లక్షణం కనబడనప్పుడు దూరం జరిగే లవర్‌గా దీపిక యాక్షన్ సూపర్. ఈ నిజజీవిత మాజీ లవర్‌‌స మధ్య కెమిస్ట్రీ వెండితెరను వెలిగించింది.
 
గతంలో ‘జబ్ ఉయ్ మెట్’, ‘లవ్ ఆజ్ కల్’తో అభినందనలు అందు కున్న ఇమ్తియాజ్ అలీ ఈ సారి అనుకున్న కథను వెండితెరపై కన్విన్సింగ్‌గా చూపించడంలో తడబడ్డారనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో చిన్న పిల్లాడి ఎపిసోడ్ దగ్గరే చాలాసేపు గడవడంతో, ఇంటర్వెల్ ముందు కానీ కాస్తంత కథ జరిగినట్లు అనిపించదు. అసలు కథ నడిచేదంతా సెకండాఫ్‌లో.

కాకపోతే, సెకండాఫ్‌లో ఒక దశ దాటిన తరువాత హీరో పాత్ర ప్రవర్తన అతని మానసిక స్వస్థతను అనుమానించేలా చేస్తుంది. ఒక దశలో హీరో పెళ్ళి ప్రతిపాదనను హీరోయిన్ కాదనడానికి కానీ, ఆ తరువాత అతణ్ణి మక్కువతో అక్కున చేర్చుకోవడానికి కానీ సరైన భూమికను సినిమాలో చూపెట్టలేకపోయారు. ఈ లోపాలు నీరుగార్చినా, సినిమాలో కాస్తయినా గుర్తుండేవి హీరో, హీరోయిన్ల అభినయమే.

రవివర్మన్ కెమేరా వర్‌‌కలో సిమ్లా మొదలు ఫ్రాన్‌‌స మీదుగా కలకత్తా, ఢిల్లీ దాకా అన్నీ కనువిందు చేస్తాయి. ఏ.ఆర్. రహమాన్ సంగీతంలో పంజాబీ సాంగ్ లాంటి కొన్ని ఊపు తెప్పిస్తాయి. హిందీ సినిమాల నిర్మాణ విలువల సంగతి వేరుగా చెప్పనక్కరలేదు. అన్నీ ఉన్నా... అదేదో అన్నట్లు... డెరైక్షన్ వీక్ అవడంతో ఆశించిన తృప్తి కలగకపోతే, ఎవరిని తప్పు పడతాం.                     
- రెంటాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement