
తమిళసినిమా: పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల ప్రేమ వ్యవహారంతో ఇంతకుముందు పలు చిత్రాలు తెరకెక్కి విజయం సాధించాయి. ఎదిగీఎదగని ఆ వయసులోని ప్రేమను విభిన్న కోణంలో ఆసక్తిగా, అదే సమయంలో మంచి సందేశంతో రూపొందిన తాజా చిత్రం పళ్లిపరువత్తిలే. వాసుదేవ్ భాస్కర్ కథ ,కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని వీకేపీటీ క్రియేషన్ పతాకంపై డి.వేలు నిర్మించారు. ప్రముఖ సంగీతదర్శకుడు సిర్పి కొడుకు నందన్‌రావు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. కథానాయకిగా వెంబ నటించింది.
ప్రధాన పాత్రల్లో దర్శకుడు కేఎస్.రవికుమార్, ఊర్వశి నటించగా, తంబిరామయ్య, గంజాకరుప్పు హాస్య పాత్రల్లోనూ, పొన్‌వన్నన్, ఆర్‌కే.సురేశ్, పరుత్తివీరన్ సుజాత, పూవిత, భువన, వైశాలి ముఖ్యపాత్రల్లో నటించారు. వినోద్‌కుమార్ ఛాయాగ్రహణం, విజయ్‌నారాయణన్ సంగీతాన్ని అందించారు.ఈయన ఇళయరాజా, ఏఆర్.రెహ్మాన్‌ల శిష్యుడన్నది గమనార్హం. ఈ చిత్రం ఈ నెల 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు వాసుదేవ్ భాస్కర్ తెలుపుతూ తల్లిదండ్రుల తరువాత పిల్లలకు ఉపాధ్యాయుడే పూజ్యసమానులు.పిల్లలు తల్లిదండ్రుల తరువాత ఎక్కువగా గడిపేది ఉపాధ్యాయులతోనే నన్నారు.అలాంటి గురువులు చూపే మార్గాన్ని బట్టే పిల్లల భవిష్కత్ ఉంటుందన్నారు.
అలాంటి నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం పళ్లిపరువత్తిలే అని చెప్పారు. ఇది ఉపాధ్యాయుల గొప్పతనాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు.అందుకే ప్రపంచంలోని ఉపాధ్యాయులందరికీ పళ్లిపరువత్తిలే చిత్రాన్ని అంకితం ఇస్తున్నామన్నారు. గామీణ ప్రాంతానికి వెళ్లి వైద్యసాయం అందించే ఇతివృత్తంతో తెరకెక్కిన ధర్మదురై చిత్రం ప్రేక్షకాదరణతో పాటు జాతీయ అవార్డును గెలుసుకుందని, అదే విధంగా ఈ చిత్రం జాతీయ అవార్డును సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు అన్నారు.ఈ చిత్ర క్‌లైమాక్స్ ట్రాజిడీగా ఉంటూ చూసిన ప్రతి ప్రేక్షకుడి గుండెల్ని బరువెక్కిస్తుందని చెప్పగలనన్నారు.
సెన్సార్ ప్రశంసలు
దర్శకుడు కేఎస్.రవికుమార్ చిత్రం చూసి చాలా కాలం తరువాత మంచి చిత్రాన్ని చూశానని మెచ్చుకున్నారన్నారు. సెన్సార్‌బోర్డు సభ్యులు మంచి చిత్రం అని ప్రశంసించారని చెప్పారు. చిత్రాన్ని ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నామని, దీన్ని తెలుగులోనూ రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్ర కథానాయకి వెంబ ఇంతకు ముందు నటించిన కాదల్ కసక్కుదయా చిత్రం తెలుగులో అనువాదం అయ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment