ఔర్ ఏక్‌బార్..ఏక్ దూజే కేలియే
బాలు-స్వప్న... ఈ పేర్లు సుపరిచితమే. తమిళబ్బాయి.. తెలుగుమ్మాయ్. భాష తెలియదు. తెలిసిందల్లా మనసు భాష మాత్రమే. మనసుతో మాట్లాడుకుని ప్రేమించేసుకున్నారు. ప్రేమతో ‘స్వప్న... నల్ల పిల్ల’ అంటాడు బాలు. స్వప్న నల్లగా ఉంటుంది కదా... అందుకే అలా అన్నాడా? కాదు. ‘నల్ల’ అంటే తమిళంలో ‘మంచి’ అని అర్థం. ఇక పెద్దగా చెప్పకుండానే కె. బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’లో బాలూగా కమల్‌హాసన్, స్వప్నగా సరితల లవ్‌స్టోరీ గుర్తొచ్చేస్తుంది.
ఈ వెండితెర ప్రేమకావ్యం హిందీలో ‘ఏక్ దూజే కేలియే’గా రీమేక్ అయ్యి, అక్కడా ఘనవిజయం సాధించింది. హిందీలో కమల్‌హాసన్, రతి అగ్నిహోత్రీ జంటగా నటించారు. 1981లో వచ్చిన ఈ హిందీ చిత్రం రీమేక్ హక్కులను నాటి కథానాయిక రతి అగ్నిహోత్రీ సొంతం చేసుకున్నారు. తనయుడు తనూజ్ వీర్వానీ హీరోగా ఆమె ఈ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. స్క్రిప్ట్‌ను కూడా ఇప్పటి తరానికి సెట్ అయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. ఇది ఇలా ఉంటే... పాత చిత్రంలో నటించిన రతి ఇప్పుడు తన తనయుడితో ఈ విషాద ప్రేమకథను తీయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో కమల్ కూతురు శ్రుతీహాసన్ నటిస్తే బాగుంటుంది కదూ.