ముంబై: హీరోయిన్ తనుశ్రీ దత్తాను వేధించిన కేసులో విలక్షణ నటుడు నానాపటేకర్‌కు పోలీసులు క్లీన్‌చిట్ ఇవ్వలేదని ఆమె తరపు న్యాయవాది నితిన్ సత్పాతే తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నానాపటేకర్‌కు పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారన్నది కేవలం వదంతి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కేసు నుంచి బటయపడేందుకు, తప్పుడు పుకార్లు ప్రచారం చేసి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును తప్పుదోవ పట్టించేందుకు నానాపటేకర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు ఇప్పటివరకు నమోదు చేయలేదన్నారు. సాక్షులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వడానికి భయపడుతున్నారని చెప్పారు. ‘పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ఇంకా కోర్టుకు వెళ్లలేదు. పోలీస్ స్టేషన్‌లో మాకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు నార్కో ఎనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరామ’ని నితిన్ చెప్పారు. ‘హారన్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్‌లో నానాపటేకర్ తనను వేధించాడని 2018, సెప్టెంబర్‌లో తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. తనుశ్రీ కేసు దేశంలో ‘మీటూ’ ఉద్యమానికి ఉత్ప్రేరంగా పనిచేసింది. తాము కూడా లైంగిక వేధింపులకు గురయ్యామని ఎంతో మంది మహిళలు నిర్భయంగా గళం విప్పారు.
Comments
Please login to add a commentAdd a comment