
ముంబై : పదేళ్ల కిందట సినిమా సెట్స్‌లో తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసినందుకు తనుశ్రీ దత్తాకు నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి బుధవారం లీగల్ నోటీసులు అందాయి. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ అనే సినిమా సెట్‌లో ఓ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తనతో అసభ్యంగా వ్యవహరించారని, దీనిపై తాను గొంతెత్తగా తనపై మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన కార్యకర్తలను ఉసిగొల్పారని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో సందర్భంలో దర్శకుడు వివేక్ తన దుస్తులు తొలగించాలని కోరారని ఆమె ఆరోపించారు.
తనకు నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి లీగల్ నోటీసులు అందాయని దేశంలో వేధింపులు, అణిచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తనుశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు. వారి (నానా పటేకర్, వివేక్) మద్దతుదారులు తనపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారని అన్నారు. తన ఇంట్లోకి చొచ్చుకువచ్చేందుకు ఇద్దరు ఆగంతకులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారన్నారు. ఎంఎన్‌ఎస్ పార్టీ తనకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయస్ధానాలకు లాగడం ద్వారా వ్యయప్రయాసలకు లోనుచేస్తున్నారని, తప్పుడు సాక్ష్యాలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కోర్టు కేసులు ఎలాంటి ముగింపు లేకుండా దశాబ్ధాల పాటు సాగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తాను తనుశ్రీ దత్తాను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని నానా పటేకర్ తనపై ఆరోపణలను తోసిపుచ్చారు. సెట్‌పై 50 మంది వ్యక్తులున్నారని, ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. పరువు నష్టం దావా సహా ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నానా పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోడ్కర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment