తమిళంలో... తేజస్వి
కలిసొచ్చే కాలం వస్తే... అవకాశాలు పొరుగు సినీ పరిశ్రమలో నుంచి కూడా వస్తాయి. కావాలంటే, నటి తేజస్విని అడిగి చూడండి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన తేజస్వి గుర్తుందిగా! ఈ తెలుగమ్మాయికి ఇప్పుడు తమిళచిత్ర పరిశ్రమ ఆహ్వానం పలికింది. రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన ‘ఐస్‌క్రీమ్’ చిత్రంలో కథకు అత్యంత కీలకమైన పాత్రను పోషించిన ఆమె ప్రతిభకు తమిళ దర్శక, నిర్మాతలు ముగ్ధులయ్యారు.
ఫలితంగా సమకాలీన సమాజంలోని స్నేహాలు, ప్రేమ, ప్రణయం అనే అంశాలపై రూపొందుతోన్న ‘నట్పదికారమ్ 79’ అనే తమిళ చిత్రంలో అవకాశం లభించింది. తేజస్వి, రాజ్ భరత్ ఒక జంటగా, అమ్జద్ ఖాన్ - రేష్మీలు రెండో జంటగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాటల్లో తన నాట్య నైపుణ్యం ద్వారా ఈ చిత్రబృందాన్ని ఆకట్టుకున్న తేజస్వి రేపు తమిళ ప్రేక్షకులనూ అలాగే బుట్టలో వేసుకుంటారేమో చూడాలి.