
మరో నవ్వు రాలిపోయింది
ప్రస్తుతం తెలుగు సినీ రంగానికి బ్యాడ్టైం నడుస్తోంది. వెండితెర మీద నవ్వులు పూయించే ఎన్నో మహా వృక్షాలు ఒక్కటొక్కటిగా నెలకొరుగుతున్నాయి. అదే వరుస మరో నవ్వుల నటుడు వెండితెరను వదిలివెళ్లారు. 'ఐతే ఓకె' అంటూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. సీనియర్ నటులు మాడా వెంకటేశ్వరరావు మరణవార్త మరిచిపోకముందే కొండవలస మృతి తెలుగు ఇండస్ట్రీ షాక్కు గురైంది.
300 లకు పైగా సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన కొండవలస.. వేల నాటకాలతో అలరించారు. రంగస్థల నటుడిగా ఎంతో అనుభవంతో పాటు అదే స్ధాయిలో పేరు ప్రఖ్యాతలు కూడా సాధించిన ఆయన 378 అవార్డులు అందుకున్నారు. అంతేకాదు రంగస్థలంపై ఉత్తమ నటుడిగా రెండుసార్లు నంది అవార్డును సైతం అందుకున్నారు.
కొండవలస లక్ష్మణరావు శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో 1946 ఆగస్టు 10న జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావటంతో లక్ష్మణరావు విద్యాబ్యాసం విశాఖలో జరిగింది. కళాశాలలో చదివే సమయంలోనే నాటక రంగం పట్ల ఆకర్షితులైన కొండవలస ఎన్నో నాటకాల్లో ప్రధాన పాత్రలతో అలరించారు. చదువు పూర్తయి విశాఖ పోర్ట్ర్ ట్రస్ట్ లో ఉద్యోగిగా మారినా.. నాటకరంగాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఎంతో మంది లబ్థప్రతిష్టులైన నటులతో కలిసి నటించిన కొండవలస మూడు దశాబ్దాలకు పై రంగస్థలంపై తన ప్రతిభ కనబరిచారు.
ఉద్యోగానికి విఆర్ఎస్ తీసుకొని హైదరాబాద్లో ఉంటున్న తన కొడుకు దగ్గరకు వచ్చిన కొండవలస లక్ష్మణరావు, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాతో సినీరంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో పొట్రాజుగా నటించిన ఆయన.. ఐతే ఓకే అంటూ ప్రేక్షకులను తన అభిమానులుగా మర్చేసుకున్నాడు. తొలి సినిమాతోనే స్టార్ కామెడియన్గా మారిన కొండవలస తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన తుది శ్వాస వరుకు నటిస్తూనే ఉన్నారు. అతి తక్కువ సమయంలో 300లకు పైగా సినిమాలతో కామెడియన్గా తన క్రేజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇలా వెండితెరపై తనదైన హాస్యాన్ని పండించిన కొండవలస లక్ష్మణరావు మరణం తెలుగు సినిమాకు తెలుగు హాస్యానికి తీరని లోటు.