Telugu comedian
-
టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
టాలీవుడ్లో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే చిత్రపరిశ్రమకు చెందిన గొప్ప వ్యక్తులు కన్నుమూయడం అందరినీ కలిచివేస్తోంది. ప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ మరణ వార్త నుంచి కోలుకోకముందే తాజాగా మరో నటుడు, కమెడియన్ విశ్వేశ్వర రావు(62) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఏప్రిల్ 2న) కన్నుమూశారు. వందలాది సినిమాల్లో.. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం తమిళనాడు చెన్నైలోని సిరుశేరి గ్రామంలోని తన నివాసంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా విశ్వేశ్వర రావు స్వస్థలం కాకినాడ. ఆరేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించారు. తన తొలి సినిమా పొట్టి ప్లీడరు. భక్తి పోతన, బాలమిత్రుల కథ, ఓ సీత కథ, మా నాన్న నిర్దోషి, పట్టిందల్లా బంగారం, అందాల రాముడు, సిసింద్రీ చిట్టిబాబు, ఇంటి గౌరవం.. ఇలా బాలనటుడిగా 150కి పైగా సినిమాలు చేశారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ తర్వాతి కాలంలో కామెడీ, సహాయక పాత్రలతో పేరు గడించారు. ముఠా మేస్త్రీ, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, ఆమె కథ, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివాజీ, అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు ఇలా దాదాపు రెండు వందల సినిమాల్లో తనదైన కామెడీ పండించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక సినిమాలు చేసి హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. 150కి పైగా సీరియల్స్‌లోనూ నటించారు. విస్సు టాకీస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా నడిపారు. అందులో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా తన అనుభవాలను, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉండేవారు. చదవండి: నాలుగేళ్లుగా విడిగానే జీవిస్తున్నాం.. తను గొప్ప స్థాయిలో ఉంది: నటి మాజీ భర్త -
నవ్వు చిన్నబోయింది
వెండితెర మీద నవ్వులు తరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, గుండూ హనుమంతరావు లాంటి టాప్ కమెడియన్లను తెలుగు సినిమా కోల్పోగా.. తాజాగా మరో స్టార్ కమెడియన్ వేణుమాధవ్ కన్నుమూశారు. 400లకు పైగా సినిమాల్లో నవ్వులు పంచిన వేణు మాధవ్ కాలేయ సంబందిత సమస్యతో మరణించారు. ఆయనకు భార్య శ్రీవాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా స్టేజ్ షోలు చేసిన వేణుమాధవ్ తరువాత బుల్లితెర మీద తరువాత వెండితెర మీద తనదైన ముద్రవేశారు. 1996లో రిలీజ్ అయిన సాంప్రదాయం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ కామెడీ స్టార్ దాదాపు దశాబ్ద కాలంపాటు వెండితెరను ఏలాడు. ఒక దశలో తెలుగులో రిలీజ్ అయిన ప్రతీ సినిమాలో వేణుమాధవ్ కనిపించారంటే అతిషయోక్తి కాదు. అంతేకాదు ఒక్క 2005లో వేణు మాధవ్ నటించిన 60 సినిమాలు విడుదలయ్యాయంటే ఆయన ఎంత బిజీ నటుడో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వేణుమాధవ్ కెరీర్ తొలినాళ్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన వేణుమాధవ్, తొలి ప్రేమ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆ సినిమాలో ప్రేమికుల గురించి వేణు మాధవ్ చెప్పిన డైలాగ్ సెన్సేషన్ సృష్టించింది. తరువాత దిల్, ఆది, ఛత్రపతి, సై లాంటి సినిమాల్లో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘లక్ష్మీ’ సినిమాలో చేసిన సత్తన్న పాత్రకు నంది అవార్డు సైతం వరించింది. సొంతం, నువ్వే నువ్వే, నాగ, సాంబ, ఆర్య, గుడుంబా శంకర్, శంకర్ దాదా ఎంబీబీయస్, మాస్, బన్నీ, అతనొక్కడే, సూపర్, జై చిరంజీవ, రణం, పోకిరి, కిక్, దేశ ముదురు, నేనింతే లాంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రల్లో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. కమెడియన్‌గా మంచి ఫాంలో ఉండగానే హీరోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు వేణుమాధవ్. తనను వెండితెరకు పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే హంగామా సినిమాతో అలీతో కలిసి హీరోగా పరిచయం అయ్యారు. తరువాత భూకైలాష్, ప్రేమాభిషేకం సినిమాల్లో హీరోగా నటించారు. అంతేకాదు ప్రేమాభిషేకం సినిమాను తానే స్వయంగా నిర్మించారు. చివరగా రుద్రమదేవి సినిమాలో నటించిన వేణు మాధవ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యంపై రకరకాల వందుతులు వినిపించాయి. పలుమార్లు వేణుమాధవ్ స్వయంగా ఈ వార్తలు ఖండించారు. అయితే బుధవారం అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియ జేస్తున్నారు. చదవండి: హాస్య నటుడు వేణు మాధవ్ కన్నుమూత ‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’ నేను మౌలాలి మెగాస్టార్‌ని! -
కల నెరవేరకుండానే..
హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి వందకు పైగా సినిమాల్లో వివిధ పాత్రలు హీరోగా సినిమా పూర్తికాకుండానే కన్నుమూత జగ్గంపేట : చిన్ననాటి నుంచి ఆయనకు నాటకాలంటే మక్కువ. ఊళ్లో ఏ ఉత్సవం జరిగినా అక్కడ వేదికపై ఆయన ప్రదర్శన ఉండేది. తనదైన శైలిలో అందర్నీ మెప్పించి ‘మనోడు నటనలో గట్టివాడు’ అనిపించుకునేవారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఓ నాటక ప్రదర్శన ఆయన సినీ రంగంలోకి సోపానం అరుుంది. ప్రముఖ నటుడు విజయ్‌చందర్.... రాంబాబు ప్రతిభను గుర్తించి సినీ అవకాశాన్ని కల్పించారు. వందకు పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నవ్వుల పువ్వులు పూయించి, ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పొట్టి రాంబాబు అందరికీ విషాదం మిగిల్చి వెళ్లిపోయూడు! హైదరాబాద్ శ్రీనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన స్వగ్రామం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొట్టి రాంబాబు అసలు పేరు కనపర్తి రాంబాబు (43). ‘ఈశ్వర్’తో పరిశ్రమకు పరిచయమై వందకుపైగా సినిమాల్లో నటించారు. రాంబాబుకు భార్య మంగ, మూడేళ్ల కుమారుడు వేణు, ఏడాది వయసు గల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌లో మకాం ఉంటున్నా ఎక్కువగా జగ్గంపేటలోనే ఉండేవారు. సినిమా షూటింగ్‌ల కోసం జిల్లాకు వచ్చిన సందర్భంలో ఎక్కువగా తోటి నటులను జగ్గంపేట తీసుకువచ్చి స్థానికులు, స్నేహితులకు పరిచయం చేసేవారు. వారం రోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన ఓ సినిమా షూటింగ్లో నటించారు. ‘తూర్పు’ యాసతో హాస్యం పండించాడు.. ఈశ్వర్ సినిమాలో హీరో మిత్ర బృందంలో పనసకాయ పట్టుకుని తిరిగే క్యారెక్టర్లో తూర్పు గోదావరి యాసతో రాంబాబు హాస్యాన్ని పండించారు. ఆ తర్వాత చంటిగాడు చిత్రంలో కోటప్పకొండ పాత్రలో కడుపుబ్బ నవ్వించారు. జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ తల్లి అంటే రాంబాబుకు ఎంతో భక్తి. స్వగ్రామానికి వచ్చిన ప్రతిసారీ అమ్మవారి దర్శనం చేసుకునేవారు. తమిళంలో కూడా రెండు చిత్రాల్లో నటించారు. రాంబాబు హీరోగా ‘పులిరాజా ఐపీఎస్’ చిత్రాన్ని ఈ ఏడాది ప్రారంభించారు. చిత్రం షూటింగ్ దశలో ఉండగా తండ్రి పాత్రలో నటిస్తున్న ఎంఎస్ నారాయణ మృతి చెందడంతో కొన్నాళ్లు షూటింగ్ వాయిదాపడింది. స్వగ్రామంలో విషాదఛాయలు రాంబాబు మృతితో బూరుగుపూడిలో విషాదఛాయలు నెలకొన్నాయి. అతడి తల్లి, భార్యను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. రాంబాబుతో అనుబంధాన్ని స్థానికులు గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. రాంబాబు మృతదేహానికి బుధవారం బూరుగుపూడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
అలా వచ్చిందే.. 'అయితే ఓకే'
చిత్రమైన శైలిలో ‘అయితే... ఓకె’ అంటూ డైలాగ్ విరుపుతో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ప్రముఖ హాస్యనటుడు, రంగస్థల కళాకారుడు కొండవలస లక్ష్మణరావు. సోమవారం రాత్రి ఆయన ఆకస్మిక మరణంతో కళాభిమానులు శోకంలో మునిగిపోయారు. సినిమాల్లోకి రాక ముందే రంగస్థలంపై ఆయన ప్రసిద్ధులు. విశాఖ పోర్ట్ టు వెండితెర సినీ రంగంలోకి రాక ముందు విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో కొండవలస ఉద్యోగం చేశారు. రంగస్థలంపై కొన్ని వందల కొద్దీ నాటక ప్రదర్శనలిచ్చిన కళాకారుడాయన. రంగస్థలంపై ఆయన ప్రతిభ చూసి, ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎం.వి. రఘు తన దర్శకత్వంలో తీసిన ‘కళ్ళు’ (1988) చిత్రంలో రౌడీ పాత్ర ద్వారా కొండవలసను సినీ రంగానికి పరిచయం చేశారు. ఆ తొలి చిత్రం తరువాత చాలా కాలం గ్యాప్ వచ్చిన కొండవలస మళ్ళీ వంశీ దర్శకత్వంలోని ‘ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ (2002)తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలోని ‘అయితే... ఓకె’ అనే డైలాగ్‌తో సినీరంగంలో స్థిరమైన స్థానం సంపాదించారు. గడచిన పదమూడేళ్ళుగా దాదాపు 200 పై చిలుకు చిత్రాల్లో కమెడియన్‌గా రాణించి, ప్రేక్షకులను నవ్వించారు. ఆయన నటించిన చిత్రాల్లో ‘కబడ్డీ... కబడ్డీ’, ‘ఎవడి గోల వాడిది’, ‘రాఖీ’, ‘రాధా గోపాళం’, ‘సైనికుడు’ లాంటి పాపులర్ సినిమాలు అనేకం ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రతిభాకిరణం సినీ రంగంలో కొండవలసగా ప్రసిద్ధులైన కొండవలస లక్ష్మణరావు స్వగ్రామం - శ్రీకాకుళం జిల్లాలోని కొండవలస అనే పల్లెటూరు. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు కూడా. కొండవలస తండ్రి రైల్వే ఉద్యోగి. తండ్రి ఉద్యోగ రీత్యా ఆయన కొన్నాళ్ళు ఒడిశాలోని కంటాబంజీలో కూడా ఉన్నారు. అక్కడకు వచ్చే బుర్రకథ బృందాలు చూసి, చిన్నప్పుడే కొండవలస ప్రేరణ పొందారు. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధమైన కుమ్మరి మాస్టారు బుర్రకథ చూసి ఆయననూ, అలాగే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చూసినప్పుడు వాళ్ళనూ అనుకరించడం ద్వారా కొండవలస నటన వైపు బుడిబుడి అడుగులు వేశారు. నాటక రచన... మేకప్ ఆదాయం... విశాఖపట్నంలో కాలేజీలో చదువుకొనే రోజుల్లో ‘సవతి తల్లి’ అనే నాటికలో ద్విపాత్రాభినయం చేసి, బహుమతి అందుకున్న కొండవలస ఆ తరువాత నాటకాల వైపు మొగ్గారు. విశాఖలోని ఏ.వి.ఎన్. కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీలో విస్తృతంగా నాటకాలు వేస్తూ వచ్చారు. డిగ్రీ పూర్తవగానే పోర్ట్ ట్రస్ట్‌లో క్లర్కు ఉద్యోగం రావడంతో, అందులో చేరిపోయారు. పోర్ట్ ట్రస్ట్‌లో ఏటా జరిగే నాటికల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొండవలసకు బాగా కలిసి వచ్చాయి. రాష్ట్రస్థాయి నాటకాల పోటీల్లో పాల్గొని, బహుమతులు అందుకున్నారు. ‘స్వార్థం బలి తీసుకుంది’, ‘హెచ్చరిక’, ‘స్వాగతం’ అనే మూడు నాటకాలు కూడా రాసిన ఆయన, స్వయంగా మేకప్ వేయడం కూడా నేర్చుకున్నారు. ముగ్గురు అక్కచెల్లెళ్ళు, నలుగురు అన్నదమ్ములతో కూడిన పెద్ద కుటుంబం ఆయనది. ఆ కుటుంబ బాధ్యతలు తీర్చడానికి అప్పులు కూడా చేయాల్సి వచ్చేది. ఆ పరిస్థితుల్లో మేకప్ చేయడం ద్వారా వచ్చే సంపాదన కూడా కొంత ఉపయోగపడిందని కొండవలస ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. రంగస్థలంపై రెండు నందులు రంగస్థల అనుభవం వల్లే ఆయనకు కుప్పిలి వెంకటేశ్వరరావు, చాట్ల శ్రీరాములు, మిశ్రో, కృష్ణజిత్, రావూజీ లాంటి రంగస్థల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమశిక్షణ, అంకితభావం, పెద్దల పట్ల గౌరవం లాంటి ఎన్నో విషయాలు వాళ్ళ నుంచి నేర్చుకున్నానని కొండవలస చెబుతూ ఉండేవారు. సినీ రంగానికి రాకముందే ఆయన నంది అవార్డు గ్రహీత. ‘నవరాగం’ నాటకంలో ఉత్తమ నటుడిగా, ‘కేళీ విలాసం’ నాటకంలో ఉత్తమ విలన్‌గా రెండు నంది అవార్డులు ఆయనకు వచ్చాయి. అనేక పదుల ప్రదర్శనలు ఇచ్చిన ‘రేపటి శత్రువు’ నాటకంలో క్లైమాక్స్‌లో కొండవలస చూపే భావోద్వేగభరిత అభినయం ప్రేక్షకులకు కన్నీళ్ళు తెప్పించేది. ఆ సినిమాతో... ఔను... అందరూ ఇష్టపడ్డారు! తొలి చిత్రం ‘కళ్ళు’లో అవకాశం కానీ, ఆ తరువాత చాలాగ్యాప్ వచ్చాక ద్రాక్షారామంలో నాటక ప్రదర్శనలో దర్శకుడు వంశీ చూసి ‘ఔను... వాళ్ళిద్దరూ...’లో ఇచ్చిన రీ-ఎంట్రీ ఛాన్స్ కానీ కొండవలసకు రంగస్థలం పెట్టిన భిక్షే. ఇక, అక్కడ నుంచి కొండవలస వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినీ రంగంలో కమెడియన్ బ్రహ్మానందం ఆయనకు బాగా సన్నిహితులు. గతంలో ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు బ్రహ్మానందం తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని కొండవలస చాలా కృతజ్ఞతతో చెబుతూ ఉండేవారు. వంశీ, ఇ.వి.వి. సత్యనారాయణ లాంటి ప్రసిద్ధ హాస్య చిత్రాల దర్శకులందరితో పనిచేసిన కొండవలస రంగస్థల నటనను స్వర్గీయ జంధ్యాల కూడా మెచ్చుకున్నారు. రంగస్థల అభినయానికి జంధ్యాల నుంచి బహుమతి అందుకున్నప్పటికీ సినిమాల్లో మాత్రం ఆయన వద్ద నటించలేకపోవడం తనకు తీరని వెలితేనని కొండవలస ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఇప్పుడు కొండవలస మృతితో తెలుగు హాస్య కుటుంబానికి వచ్చిన వెలితి కూడా ఇప్పుడిప్పుడే తీరేది కాదు! సినీ హాస్య ప్రియులకు ఈ మరణవార్త ఎంతమాత్రం ‘....ఓకె’ కాదు!! స్టైల్ మారిస్తే... ‘అయితే... ఓకె’ రంగస్థలంపై ఎంతో పేరు, నంది అవార్డులు తెచ్చుకున్న కొండవలస లక్ష్మణరావు వాయిస్ కామెడీ గురించి ఇవాళ అందరూ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొదట్లో ఆయనకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు. అప్పుడు కొండవలస కష్టపడి, కొత్త రకంగా వాయిస్‌తో ట్రై చేశారు. అలా వచ్చిందే ఆయన ‘అయితే... ఓకే’ స్టైల్. కొండవలస గొంతు సీరియస్‌గా ఉందనీ, కొత్తదనం కోసం వేరొకరితో డబ్బింగ్ చెప్పిద్దామనీ ‘ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ దర్శకుడు వంశీ మొదట అనుకున్నారు. కానీ, కొండవలస అలా కాదని, కష్టపడి, తన గొంతు చిత్రమైన యాస చేర్చి, డైలాగ్ చెప్పి, వినిపించారు. ఆ స్టైల్ ఓ.కె అయింది. అలా ఆయనకు ‘అయితే... ఓకె’ అనే స్టైల్ ఒక ట్రేడ్ మార్క్ అయింది. ఆయన వాయిస్, ఆ వాయిస్ కామెడీనే సినిమా కెరీర్ అంతటా ఆయనకు అనేక పాత్రలు తెచ్చిపెట్టింది. - రెంటాల జయదేవ -
కామెడీ కుటుంబానికి ఏమిటీ శాపం!
హైదరాబాద్ : వెండితెర కమెడియన్లందరూ ఇటీవలే ఒక్కొక్కరే భౌతికంగా కనుమరుగవుతున్నారు. ఇదంతా చూస్తుంటే, తెలుగు హాస్యకుటుంబానికి శాపం తగిలిందా అనిపిస్తోందని సినీ వర్గాలు వాపోతున్నాయి. గడచిన ఏణ్ణర్ధం పైచిలుకు కాలంలో ప్రముఖ కమెడియన్ ఏ.వి.ఎస్. మొదలు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్ క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆ తరువాత ఈ ఏడాది మొదట్లో ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ ఆకస్మికంగా కన్నుమూశారు. ఈ అక్టోబర్‌లో ‘కళ్ళు’ చిదంబరం, ఆ వెంటనే మాడా వెంకటేశ్వరరావులు మరణించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆ దుఃఖం నుంచి తేరుకోక ముందే ఇప్పుడు కొండవలస కన్నుమూశారు. దీంతో, తెలుగు సినీ హాస్య కుటుంబానికి ఏదో తీరని శాపం తగిలినట్లుందని సినీ ప్రముఖులు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. మా ‘కళ్ళు’ కొండవలస తొలి సినిమా! కొండవలస లక్ష్మణరావు సినీ రంగప్రవేశం వంశీ దర్శకత్వంలోని ‘ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ (2002)తో జరిగిందని అందరూ అనుకుంటూ ఉంటారు. అంతటా అదే ప్రచారమూ అయింది. అయితే, ఆ సినిమా రావడానికి 14 ఏళ్ళ ముందే ఆయన తొలిసారిగా కెమేరా ముందుకొచ్చారన్న విషయం చాలామందికి తెలియదు. కొండవలస తెరంగేట్రం చేసిన ఆ సినిమాఏమిటంటే - ‘కళ్ళు’ (1988). గొల్లపూడి మారుతీరావు నాటకం ‘కళ్ళు’ ఆధారంగా ఆ సినిమా రూపొందింది. దర్శకుడిగా మారిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎం.వి. రఘు ఆ సినిమా కోసం ప్రధానంగా రంగస్థల కళాకారుల్ని పాత్రధారులుగా ఎంచుకున్నారు. ఎక్కువగా విశాఖ పరిసరాల్లోని వాళ్ళకు అవకాశమిచ్చారు. ‘కళ్ళు’ చిదంబరం కూడా ఆ సినిమాతో వెండితెరపై ప్రసిద్ధమైన రంగస్థల కళాకారుడే. అదే ‘కళ్ళు’ సినిమాలో ఒక రౌడీ వేషం ద్వారా కొండవలస లక్ష్మణరావు వెండితెర మీదకొచ్చారు. ‘‘ ‘కళ్ళు’ చిత్రానికి నటీనటులను సెలక్ట్ చేయడానికి నేను, అప్పట్లో కోడెరైక్టరైన ఇ.వి.వి. సత్యనారాయణ (తరువాతి కాలంలో ప్రసిద్ధ దర్శకుడయ్యారు) విశాఖ పరిసరాల్లో రంగస్థల కళాకారుల్ని చూశాం. కొండవలస ప్రతిభ గమనించి, మా సినిమాలో ఒక రౌడీ వేషం ఇచ్చాం. అదే ఆయనకు తొలి సినిమా ఛాన్స్. ఆ తరువాత చాన్నాళ్ళకు వంశీ దర్శకత్వంలోని ‘ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో లేటు వయసులో ఆయన కెరీర్‌కు పెద్ద బ్రేక్ వచ్చింది. ఇప్పుడు కొండవలస ఆకస్మిక మృతితో ప్రతిభావంతుడైన కమెడియన్‌ను కోల్పాయాం’’ అని ప్రముఖ కెమేరామన్ - ‘కళ్ళు’ చిత్ర దర్శకుడు ఎం.వి. రఘు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మొత్తానికి, ‘కళ్ళు’తో ప్రారంభించి, ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో కెరీర్ మలుపు తిరిగిన కొండవలస మృతి తీరనిలోటే! - రెంటాల జయదేవ -
మరో నవ్వు రాలిపోయింది
ప్రస్తుతం తెలుగు సినీ రంగానికి బ్యాడ్‌టైం నడుస్తోంది. వెండితెర మీద నవ్వులు పూయించే ఎన్నో మహా వృక్షాలు ఒక్కటొక్కటిగా నెలకొరుగుతున్నాయి. అదే వరుస మరో నవ్వుల నటుడు వెండితెరను వదిలివెళ్లారు. 'ఐతే ఓకె' అంటూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. సీనియర్ నటులు మాడా వెంకటేశ్వరరావు మరణవార్త మరిచిపోకముందే కొండవలస మృతి తెలుగు ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. 300 లకు పైగా సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన కొండవలస.. వేల నాటకాలతో అలరించారు. రంగస్థల నటుడిగా ఎంతో అనుభవంతో పాటు అదే స్ధాయిలో పేరు ప్రఖ్యాతలు కూడా సాధించిన ఆయన 378 అవార్డులు అందుకున్నారు. అంతేకాదు రంగస్థలంపై ఉత్తమ నటుడిగా రెండుసార్లు నంది అవార్డును సైతం అందుకున్నారు. కొండవలస లక్ష్మణరావు శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో 1946 ఆగస్టు 10న జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావటంతో లక్ష్మణరావు విద్యాబ్యాసం విశాఖలో జరిగింది. కళాశాలలో చదివే సమయంలోనే నాటక రంగం పట్ల ఆకర్షితులైన కొండవలస ఎన్నో నాటకాల్లో ప్రధాన పాత్రలతో అలరించారు. చదువు పూర్తయి విశాఖ పోర్ట్ర్ ట్రస్ట్ లో ఉద్యోగిగా మారినా.. నాటకరంగాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఎంతో మంది లబ్థప్రతిష్టులైన నటులతో కలిసి నటించిన కొండవలస మూడు దశాబ్దాలకు పై రంగస్థలంపై తన ప్రతిభ కనబరిచారు. ఉద్యోగానికి విఆర్ఎస్ తీసుకొని హైదరాబాద్‌లో ఉంటున్న తన కొడుకు దగ్గరకు వచ్చిన కొండవలస లక్ష్మణరావు, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాతో సినీరంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో పొట్రాజుగా నటించిన ఆయన.. ఐతే ఓకే అంటూ ప్రేక్షకులను తన అభిమానులుగా మర్చేసుకున్నాడు. తొలి సినిమాతోనే స్టార్ కామెడియన్‌గా మారిన కొండవలస తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన తుది శ్వాస వరుకు నటిస్తూనే ఉన్నారు. అతి తక్కువ సమయంలో 300లకు పైగా సినిమాలతో కామెడియన్‌గా తన క్రేజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇలా వెండితెరపై తనదైన హాస్యాన్ని పండించిన కొండవలస లక్ష్మణరావు మరణం తెలుగు సినిమాకు తెలుగు హాస్యానికి తీరని లోటు. -
మిస్ యు ఎం.ఎస్
-
'మాది సినిమా కుటుంబం'
పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా చేయాలనేది తన కోరిక అని ప్రముఖ హాస్యనటుడు, రచయిత, దర్శకుడు ఎమ్మెస్ నారాయణ తెలిపారు. ఇప్పటివరకు తాను విలన్ కేరెక్టర్ చేయలేదని, ఈ పాత్ర చేస్తే సంపూర్ణమైన నటుడు అనే పేరుస్తోందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా 'సాక్షి' టీ్వీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉప్పలపాటి నారాయణరావు తనకు విలన్ వేషం ఇస్తానన్నారని వెల్లడించారు. తాగుబోతు పాత్రలు చేయడంలో తనది ప్రపంచ రికార్డు అని చెప్పారు. తానిప్పటికి 700 పాత్రలు చేస్తే అందులో 200 తాగుబోతు వేషాలు వేశానని వెల్లడించారు. తాను ఇన్నిసార్లు తాగుబోతుగా నటించినా ప్రేక్షకులు విసుగు చెందలేదని అన్నారు. ఇకముందు కూడా తాగుబోతు పాత్రలు చేస్తానని స్పష్టం చేశారు. తమది సినిమా కుటుంబమని ఎమ్మెస్ నారాయణ చెప్పారు. తన కుమార్తె దర్శకులిరాలిగా, కుమారుడు నటుడిగా కొనసాగుతున్నారని తెలిపారు. తనది ప్రేమ వివాహమని వెల్లడించారు. తన దగ్గరకు ట్యూషన్ కు వచ్చే స్టూడెంట్ నే ప్రేమించి పెళ్లిచేసుకున్నానని తెలిపారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తన లెక్చరర్ అయిన పరుచూరి గోపాలకృష్ణ తమ పెళ్లి చేశారని చెప్పారు. తాను సినిమాల్లో రావడానికి తన భార్య ప్రోత్సాహం చాలా ఉందని ఎమ్మెస్ నారాయణ తెలిపారు. అవకాశమున్నంత వరకు నటుడిగానే కొనసాగుతానని చెప్పారు. -
'నింగి, నేల ఉన్నంత వరకు నవ్విస్తూనే ఉంటా'
మూడు దశాబ్దాల సినీ జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని.. అవన్నీ తన హృదయ ఫలకంపై తీపి గుర్తులుగా మిగిలిపోయాయని ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మనందం వెల్లడించారు. నింగి, నేల ఉన్నంత వరకు ప్రేక్షకులకు వినోదం పంచుతునే ఉంటానని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి మూడు దశాబ్దలు పూరైన సందర్భంగా చెన్నైలో బ్రహ్మనందం విలేకర్లతో మాట్లాడారు. తాను చిత్ర పరిశ్రమకు రెండేళ్ల ముందే వచ్చిన 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'చంటబ్బాయి' చిత్రం తనకు బ్రేక్ ఇచ్చిందని... నాటి జ్ఞాపకాల దొంతరలో నిక్షిప్తమైన స్మృతులను ఆయన ఈ సందర్భంగా నెమరేసుకున్నారు. వెయ్యికి పైగా చిత్రాలలో నటించినట్లు చెప్పారు. తాను ఈ రోజు ఇంత విజయం సాధించానంటే చిత్ర దర్శకులు,నిర్మాతలే ప్రధాన కారణమన్నారు. షూటింగ్ సమయంలో లైట్ బాయ్స్ నుంచి మేకప్ ఆర్టిస్ట్‌ల వరకు వారితో ఉన్న అనుబంధాన్ని బ్రహ్మనందం ఈ సందర్భంగా విశదీకరించారు. అటు తెలుగు ఇటు తమిళ చిత్ర రంగంలో సినిమాలలో నటిస్తు 58 ఏళ్ల బ్రహ్మనందం మహా బిజీగా ఉన్నారు.