టాలీవుడ్‌లోకి ప్రతి ఏడాది వందలాది మంది నటులు, హీరోహీరోయిన్లు వస్తూనే ఉంటారు. వీళ్లలో కొందరు నిలబడతారు. మరికొందరు మాత్రం కొన్నాళ్ల పాటు పలు సినిమాల్లో కనిపిస్తారు. కొన్నాళ్ల తర్వాత పూర్తిగ తెరమరుగైపోతారు. ఈ హాస్య నటుడు కూడా సేమ్ అలానే. ఒకప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు ఇండస్ట్రీని వదిలేసి డీజేగా పనిచేస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బబ్లూ. తేజ తీసిన 'చిత్రం' సినిమాతో కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. తర్వాత ఆనందం, ఎవడి గోల వాడిదే, ఆర్య, చిరుత, బోణీ తదితర చిత్రాలు చేశాడు. మంచు విష్ణు హీరోగా చేసిన 'వస్తాడు నా రాజు'లో చివరగా కనిపించాడు. కొన్నాళ్ల క్రితం బబ్లూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తన కెరీర్ గురించి చెప్పాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'డ్యూడ్'.. డేట్ ఫిక్సయిందా?)
బబ్లూ అసలు పేరు సదానంద్. 'ముద్దుల మేనల్లుడు' సినిమాలో బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. జంధ్యాల తీసిన 'పోపుల పెట్టె' సీరియల్‌లో బబ్లూ పాత్ర చేశాడు. తర్వాత నుంచి ఇదే అతడి పేరు అయిపోయింది. వయసొచ్చిన తర్వాత 'చిత్రం'లో నటించే అవకాశమొచ్చింది. తర్వాత పవన్ కల్యాణ్, బన్నీ, చరణ్ సినిమాలు చేశాడు. అయితే జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు వరసగా చనిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, ఇంట్లోనే అలా ఉండిపోవడం వల్ల నటనకు దూరమయ్యానని బబ్లూ చెప్పుకొచ్చాడు. మంచి ఆఫర్స్ వస్తే ఇప్పుడు కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా అన్నాడు.
యాక్టింగ్ చేయట్లేదని బబ్లూ ఖాళీగా అయితే లేడు. ప్రస్తుతం డీజేగా పనిచేస్తున్నాడు. ఇతడి ఇన్ స్టా ఓపెన్ చేసి చూస్తే మొత్తం డీజే వీడియోలే ఉంటాయి. 2006 నుంచి డీజే వృత్తిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఉంది. అంటే ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఈ పని కూడా చేసేవాడనమాట. ఒకప్పుడు కమెడియన్‌గా స్టార్ హీరోలతో పనిచేసిన బబ్లూ.. ఇప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా డీజేగా చేస్తుండటం మెచ్చుకోదగిన విషయమే!
(ఇదీ చదవండి: రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ)


