టాలీవుడ్‌లో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే చిత్రపరిశ్రమకు చెందిన గొప్ప వ్యక్తులు కన్నుమూయడం అందరినీ కలిచివేస్తోంది. ప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ మరణ వార్త నుంచి కోలుకోకముందే తాజాగా మరో నటుడు, కమెడియన్ విశ్వేశ్వర రావు(62) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఏప్రిల్ 2న) కన్నుమూశారు.
వందలాది సినిమాల్లో..
ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం తమిళనాడు చెన్నైలోని సిరుశేరి గ్రామంలోని తన నివాసంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా విశ్వేశ్వర రావు స్వస్థలం కాకినాడ. ఆరేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించారు. తన తొలి సినిమా పొట్టి ప్లీడరు. భక్తి పోతన, బాలమిత్రుల కథ, ఓ సీత కథ, మా నాన్న నిర్దోషి, పట్టిందల్లా బంగారం, అందాల రాముడు, సిసింద్రీ చిట్టిబాబు, ఇంటి గౌరవం.. ఇలా బాలనటుడిగా 150కి పైగా సినిమాలు చేశారు.
సొంతంగా యూట్యూబ్ ఛానల్
తర్వాతి కాలంలో కామెడీ, సహాయక పాత్రలతో పేరు గడించారు. ముఠా మేస్త్రీ, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, ఆమె కథ, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివాజీ, అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు ఇలా దాదాపు రెండు వందల సినిమాల్లో తనదైన కామెడీ పండించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక సినిమాలు చేసి హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. 150కి పైగా సీరియల్స్‌లోనూ నటించారు. విస్సు టాకీస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా నడిపారు. అందులో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా తన అనుభవాలను, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉండేవారు.
చదవండి: నాలుగేళ్లుగా విడిగానే జీవిస్తున్నాం.. తను గొప్ప స్థాయిలో ఉంది: నటి మాజీ భర్త
Comments
Please login to add a commentAdd a comment