'మాది సినిమా కుటుంబం'
పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా చేయాలనేది తన కోరిక అని ప్రముఖ హాస్యనటుడు, రచయిత, దర్శకుడు ఎమ్మెస్ నారాయణ తెలిపారు. ఇప్పటివరకు తాను విలన్ కేరెక్టర్ చేయలేదని, ఈ పాత్ర చేస్తే సంపూర్ణమైన నటుడు అనే పేరుస్తోందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా 'సాక్షి' టీ్వీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉప్పలపాటి నారాయణరావు తనకు విలన్ వేషం ఇస్తానన్నారని వెల్లడించారు.
తాగుబోతు పాత్రలు చేయడంలో తనది ప్రపంచ రికార్డు అని చెప్పారు. తానిప్పటికి 700 పాత్రలు చేస్తే అందులో 200 తాగుబోతు వేషాలు వేశానని వెల్లడించారు. తాను ఇన్నిసార్లు తాగుబోతుగా నటించినా ప్రేక్షకులు విసుగు చెందలేదని అన్నారు. ఇకముందు కూడా తాగుబోతు పాత్రలు చేస్తానని స్పష్టం చేశారు. తమది సినిమా కుటుంబమని ఎమ్మెస్ నారాయణ చెప్పారు. తన కుమార్తె దర్శకులిరాలిగా, కుమారుడు నటుడిగా కొనసాగుతున్నారని తెలిపారు.
తనది ప్రేమ వివాహమని వెల్లడించారు. తన దగ్గరకు ట్యూషన్ కు వచ్చే స్టూడెంట్ నే ప్రేమించి పెళ్లిచేసుకున్నానని తెలిపారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తన లెక్చరర్ అయిన పరుచూరి గోపాలకృష్ణ తమ పెళ్లి చేశారని చెప్పారు. తాను సినిమాల్లో రావడానికి తన భార్య ప్రోత్సాహం చాలా ఉందని ఎమ్మెస్ నారాయణ తెలిపారు. అవకాశమున్నంత వరకు నటుడిగానే కొనసాగుతానని చెప్పారు.