ఎంఎస్ నారాయణను అప్పడే మరిచిపోయారా?
కమెడియన్గా టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి ఎంఎస్ నారాయణ. 700కు పైగా సినిమాలలో తన నటనతో ప్రేక్షకులకు ఆయన నవ్వుల జల్లులు కురిపించారు. ఆశ్చర్యకర విషయమేమంటే... ఇటీవలే మరణించిన ఎమ్మెస్ నారాయణ గౌరవార్థం సంస్మరణ సభను తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం.
టాలీవుడ్ నటీనటులు ఎవరైనా మరణిస్తే వారి గౌరవార్థం సంస్మరణ సభను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎంఎస్ నారాయణ మరణించి వారం రోజులు అవుతున్నా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ గాని, మూవీ అసోసియేషన్ కాని, తెలుగు చిత్ర నిర్మాతల మండలి గాని, దర్శకుల మండలి... ఇలా ఎవరూ ఎంఎస్ సంస్మరణ సభ ఏర్పాటు విషయాన్ని పట్టించుకోకపోవడం తెలుగు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.
కాగా ఎంఎస్ కుటుంబసభ్యులు సంస్మరణసభ ఏర్పాటు విషయమై 'మూవీ ఆర్ట్ అసోసియేషన్ (మా) 'ని సంప్రదించగా, సభ లాంటివి నిర్వహించేది లేదనే సమాధానం వారిని బాధకు గురి చేసిందని సమాచారం. ఓ నటుడు టాలీవుడ్కి పరిచయమైన 20 ఏళ్లలోనే 700 సినిమాలలో నటించడం అనేది మామూలు విషయం కాదు. ఎంఎస్ నారాయణ నటుడుగానే కాకుండా దర్శకత్వంతో పాటు రచయితగానూ చిత్ర పరిశ్రమకు సేవలందించారు. అనారోగ్యంతో ఎంఎస్ నారాయణ జనవరి 24న మృతి చెందిన విషయం తెలిసిందే.