nomore
-
వసివాడిన పసివాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్న నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. బిడ్డ తిరిగొస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. తమిళనాడులో ఐదురోజుల క్రితం బోరుబావిలో పడిపోయిన సుజిత్ (2)ను అధికారులు రక్షించలేకపోయారు. బాలుడి మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో మంగళవారం వెలికితీశారు. తిరుచ్చిరాపల్లి జిల్లా నడుకాట్టుపట్టికి చెందిన ఆరోగ్యరాజ్ (40), కళామేరి (35) దంపతుల సుజిత్ విల్సన్ ఈనెల 25న ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. రక్షించేందుకు చేసే ప్రయత్నాల్లో 88 అడుగుల లోతులోకి జారిపోయాడు. బోరు బావికి సమాంతరంగా తవ్వుతున్న సమయంలో సొరంగ మార్గం నుంచి దుర్వాసన రావడాన్ని అధికారులు గుర్తించారు. సుజిత్ మరణించినట్లు రెవెన్యూ కార్యదర్శి రాధాకృష్ణన్ ప్రకటించారు. అనంతరం బోరుబావిని కాంక్రీటుతో మూసివేశారు. ఈ వార్తతో తమిళనాడు ప్రజలు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ముఖ్యమంత్రి ఎడపాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పలువురు మంత్రులు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్లు తిరుచ్చికి చేరుకుని సుజిత్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. సుజిత్ కుటుంబానికి సీఎం ఎడపాడి, స్టాలిన్ వేర్వేరుగా రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అనంతరం బాలుడి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
ఆగిపోయిన ప్రజా కలం
– ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసు అస్తమయం – చిన్న వయస్సులోనే వందల పాటలు రాసిన రచయిత – మూడో తరగతే చదివినా.. జీవితాన్ని అధ్యయనం చేసిన ప్రజాకవి – వాసు మృతికి ప్రముఖుల సంతాపం కర్నూలు (కల్చరల్): నా చిట్టి తమ్ముళ్లారా రారే.. నా చిట్టి చెళ్లెల్లారా రారే.. రేపన్న రూపు రేఖలు మీరే... నా సెమట సుక్కో.. నా సెమెట సుక్కో... సుత్తి కొడవలి మీద ముత్యమై మెరిసే...అమ్మా నేను ఆగమైతే.. అక్షరాలు రెండు నేర్వక... నాగమ్మ పడగలో లాంటి రాష్ట్రవ్యాప్త ప్రాచుర్యం పొందిన ప్రజలు పాటలు రాసిన కలం ఆకస్మికంగా ఆగిపోయింది. కర్మాగారాల్లో, చేలల్లో, వర్కు షాపుల్లో పని చేస్తున్న బాల కార్మికుల దయనీయ జీవితాలను కూలి, నాలీల కడగండ్లను సిరాగా మార్చి కలంలో పోసి, అద్వితీయమైన పాటలు రాసిన ప్రజానాట్య మండలి వాసి ఇక లేరు. కర్నూలు నగరం, ఇందిరాగాంధీ నగర్ వాస్తవ్యులైన వాసు చదువుకున్నది మూడో తరగతే. కానీ దారిద్య్రాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడపడంతో పేదరికం కోణాలన్నింటినీ చవి చూసిన వాసు దారిద్య్రంపై అక్షరాలను ఎక్కుపెట్టి సాహితీ సృజన చేశారు. ఆయన ఆదివారం ఉదయం అమరావతిలో జరుగుతున్న ప్రజానాట్య మండలి శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ, మాట్లాడుతూనే తీవ్రమైన గుండెనొప్పితో కుప్పకూలి పోయారు. సహచర కళాకారులు ఆయనను వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణం కోల్పోయారు. గతరెండు రోజులుగా ప్రజా కళలపై పాటలు రాసి, బాణీలు కట్టి, గజ్జ కట్టి ఆడుతూ, పాడుతూ ఉత్సాహం నింపిన ప్రజా కళాకారుడు తమ కళ్ల ముందే ప్రాణం కోల్పోవడం చూసిన కళాకారులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాల్యం నుంచి పాటలపైనే దష్టి .. కర్నూలు నగరంలోని మురికి వాడల్లో పుట్టి పెరిగిన వాసు మూడో తరగతితోనే చదువుకు చుక్క పెట్టారు. పని చేస్తేగాని పొద్దుగడవని స్థితిలో ఉన్న వాసు రకరకాల వర్క్‌షాపుల్లో కూలీగా పని చేశారు. ఈ క్రమంలో ఆయనకు సీపీఎం ప్రధాన నాట్య మండలితో పరిచయం ఏర్పడింది. పదునైన పాటలు పాడుతూ.. పాడుతూ.. ఆయన పాటలు రాయడం ప్రారంభించారు. బాల కార్మిక వ్యవస్థ, నిరక్ష్యరాస్యత నిర్మూలన తదితర కార్యక్రమాల్లో 1990 నుంచి ఆయన చురుగ్గా పాల్గొన్నారు. మహిళా కూలీలు, ఫ్యాక్టరీల్లో కార్మికులు చాలీచాలని జీతాలతో బతుకుతున్న వైనాన్ని అక్షరీకరించారు. ఉద్యమ ప్రస్థానంలో భాగంగా ప్రజా పాటలు పాడుతున్న సుజాత అనే కళాకారిణిని పెళ్లి చేసుకున్నారు. ప్రజానాట్య మండలికే తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. పేద ప్రజల కడగండ్లను నాటికలుగా, గేయాలుగా, పాటలుగా రాస్తూ ప్రజా కళలను ఆదరించాలనే ప్రచారం చేశారు. ఈయన రాసిన నా సెమట సుక్కో.. పాటను విని ఆంధ్రప్రదేశ్ తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షుడు రాళ్లబండి కవితా ప్రసాద్ కన్నీరు కార్చి, వాసును భుజం తట్టి మెచ్చుకున్నారు. సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ వాసు పాటల్లో ప్రజల ఆర్థి, ప్రజల వ్య«థ స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. కళాకారుల సంతాపం.. ప్రజల పాటలు రాస్తూ, పేదల కోసమే జీవితాన్ని అంకితం చేసిన వాసు మరణం ప్రజా నాట్య మండలికి తీరని లోటని, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి బసవరాజు, సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, జిల్లా కార్యదర్శి కెంగార మోహన్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వాసు రాసిన పాటలను పలు వేదికలపై పాడి, ప్రజల్లో చైతన్యం నింపామని, ప్రముఖ గజల్ గాయకుడు మహమ్మద్‌మియ్యా అన్నారు. వాసు పాటలు అజరామరంగా ప్రజల్లో గుండెల్లో నిలిచిపోతాయని ప్రముఖ రచయిత ఇనాయతుల్లా అన్నారు. వాసు పాటలు ప్రజ ల బాధల్ని లోకానికి చాటి చెప్పాయని లలిత కళా సమితి పత్తి ఓబులయ్య అన్నారు. ప్రముఖ రచయితలు ఎస్‌డీవీ అజీజ్, వెంకటకష్ణ, ప్రజాభ్యుదయ సంస్థ భార్గవ, అధ్యక్షుడు శ్రీనివాస్, ధర్మపేట యువజన సంఘం నాయకులు ఇమ్మానియేలు, యేసేపు తదితరులు సంతాపం ప్రకటించారు. -
అలా వచ్చిందే.. 'అయితే ఓకే'
చిత్రమైన శైలిలో ‘అయితే... ఓకె’ అంటూ డైలాగ్ విరుపుతో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ప్రముఖ హాస్యనటుడు, రంగస్థల కళాకారుడు కొండవలస లక్ష్మణరావు. సోమవారం రాత్రి ఆయన ఆకస్మిక మరణంతో కళాభిమానులు శోకంలో మునిగిపోయారు. సినిమాల్లోకి రాక ముందే రంగస్థలంపై ఆయన ప్రసిద్ధులు. విశాఖ పోర్ట్ టు వెండితెర సినీ రంగంలోకి రాక ముందు విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో కొండవలస ఉద్యోగం చేశారు. రంగస్థలంపై కొన్ని వందల కొద్దీ నాటక ప్రదర్శనలిచ్చిన కళాకారుడాయన. రంగస్థలంపై ఆయన ప్రతిభ చూసి, ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎం.వి. రఘు తన దర్శకత్వంలో తీసిన ‘కళ్ళు’ (1988) చిత్రంలో రౌడీ పాత్ర ద్వారా కొండవలసను సినీ రంగానికి పరిచయం చేశారు. ఆ తొలి చిత్రం తరువాత చాలా కాలం గ్యాప్ వచ్చిన కొండవలస మళ్ళీ వంశీ దర్శకత్వంలోని ‘ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ (2002)తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలోని ‘అయితే... ఓకె’ అనే డైలాగ్‌తో సినీరంగంలో స్థిరమైన స్థానం సంపాదించారు. గడచిన పదమూడేళ్ళుగా దాదాపు 200 పై చిలుకు చిత్రాల్లో కమెడియన్‌గా రాణించి, ప్రేక్షకులను నవ్వించారు. ఆయన నటించిన చిత్రాల్లో ‘కబడ్డీ... కబడ్డీ’, ‘ఎవడి గోల వాడిది’, ‘రాఖీ’, ‘రాధా గోపాళం’, ‘సైనికుడు’ లాంటి పాపులర్ సినిమాలు అనేకం ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రతిభాకిరణం సినీ రంగంలో కొండవలసగా ప్రసిద్ధులైన కొండవలస లక్ష్మణరావు స్వగ్రామం - శ్రీకాకుళం జిల్లాలోని కొండవలస అనే పల్లెటూరు. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు కూడా. కొండవలస తండ్రి రైల్వే ఉద్యోగి. తండ్రి ఉద్యోగ రీత్యా ఆయన కొన్నాళ్ళు ఒడిశాలోని కంటాబంజీలో కూడా ఉన్నారు. అక్కడకు వచ్చే బుర్రకథ బృందాలు చూసి, చిన్నప్పుడే కొండవలస ప్రేరణ పొందారు. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధమైన కుమ్మరి మాస్టారు బుర్రకథ చూసి ఆయననూ, అలాగే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చూసినప్పుడు వాళ్ళనూ అనుకరించడం ద్వారా కొండవలస నటన వైపు బుడిబుడి అడుగులు వేశారు. నాటక రచన... మేకప్ ఆదాయం... విశాఖపట్నంలో కాలేజీలో చదువుకొనే రోజుల్లో ‘సవతి తల్లి’ అనే నాటికలో ద్విపాత్రాభినయం చేసి, బహుమతి అందుకున్న కొండవలస ఆ తరువాత నాటకాల వైపు మొగ్గారు. విశాఖలోని ఏ.వి.ఎన్. కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీలో విస్తృతంగా నాటకాలు వేస్తూ వచ్చారు. డిగ్రీ పూర్తవగానే పోర్ట్ ట్రస్ట్‌లో క్లర్కు ఉద్యోగం రావడంతో, అందులో చేరిపోయారు. పోర్ట్ ట్రస్ట్‌లో ఏటా జరిగే నాటికల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొండవలసకు బాగా కలిసి వచ్చాయి. రాష్ట్రస్థాయి నాటకాల పోటీల్లో పాల్గొని, బహుమతులు అందుకున్నారు. ‘స్వార్థం బలి తీసుకుంది’, ‘హెచ్చరిక’, ‘స్వాగతం’ అనే మూడు నాటకాలు కూడా రాసిన ఆయన, స్వయంగా మేకప్ వేయడం కూడా నేర్చుకున్నారు. ముగ్గురు అక్కచెల్లెళ్ళు, నలుగురు అన్నదమ్ములతో కూడిన పెద్ద కుటుంబం ఆయనది. ఆ కుటుంబ బాధ్యతలు తీర్చడానికి అప్పులు కూడా చేయాల్సి వచ్చేది. ఆ పరిస్థితుల్లో మేకప్ చేయడం ద్వారా వచ్చే సంపాదన కూడా కొంత ఉపయోగపడిందని కొండవలస ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. రంగస్థలంపై రెండు నందులు రంగస్థల అనుభవం వల్లే ఆయనకు కుప్పిలి వెంకటేశ్వరరావు, చాట్ల శ్రీరాములు, మిశ్రో, కృష్ణజిత్, రావూజీ లాంటి రంగస్థల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమశిక్షణ, అంకితభావం, పెద్దల పట్ల గౌరవం లాంటి ఎన్నో విషయాలు వాళ్ళ నుంచి నేర్చుకున్నానని కొండవలస చెబుతూ ఉండేవారు. సినీ రంగానికి రాకముందే ఆయన నంది అవార్డు గ్రహీత. ‘నవరాగం’ నాటకంలో ఉత్తమ నటుడిగా, ‘కేళీ విలాసం’ నాటకంలో ఉత్తమ విలన్‌గా రెండు నంది అవార్డులు ఆయనకు వచ్చాయి. అనేక పదుల ప్రదర్శనలు ఇచ్చిన ‘రేపటి శత్రువు’ నాటకంలో క్లైమాక్స్‌లో కొండవలస చూపే భావోద్వేగభరిత అభినయం ప్రేక్షకులకు కన్నీళ్ళు తెప్పించేది. ఆ సినిమాతో... ఔను... అందరూ ఇష్టపడ్డారు! తొలి చిత్రం ‘కళ్ళు’లో అవకాశం కానీ, ఆ తరువాత చాలాగ్యాప్ వచ్చాక ద్రాక్షారామంలో నాటక ప్రదర్శనలో దర్శకుడు వంశీ చూసి ‘ఔను... వాళ్ళిద్దరూ...’లో ఇచ్చిన రీ-ఎంట్రీ ఛాన్స్ కానీ కొండవలసకు రంగస్థలం పెట్టిన భిక్షే. ఇక, అక్కడ నుంచి కొండవలస వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినీ రంగంలో కమెడియన్ బ్రహ్మానందం ఆయనకు బాగా సన్నిహితులు. గతంలో ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు బ్రహ్మానందం తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని కొండవలస చాలా కృతజ్ఞతతో చెబుతూ ఉండేవారు. వంశీ, ఇ.వి.వి. సత్యనారాయణ లాంటి ప్రసిద్ధ హాస్య చిత్రాల దర్శకులందరితో పనిచేసిన కొండవలస రంగస్థల నటనను స్వర్గీయ జంధ్యాల కూడా మెచ్చుకున్నారు. రంగస్థల అభినయానికి జంధ్యాల నుంచి బహుమతి అందుకున్నప్పటికీ సినిమాల్లో మాత్రం ఆయన వద్ద నటించలేకపోవడం తనకు తీరని వెలితేనని కొండవలస ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఇప్పుడు కొండవలస మృతితో తెలుగు హాస్య కుటుంబానికి వచ్చిన వెలితి కూడా ఇప్పుడిప్పుడే తీరేది కాదు! సినీ హాస్య ప్రియులకు ఈ మరణవార్త ఎంతమాత్రం ‘....ఓకె’ కాదు!! స్టైల్ మారిస్తే... ‘అయితే... ఓకె’ రంగస్థలంపై ఎంతో పేరు, నంది అవార్డులు తెచ్చుకున్న కొండవలస లక్ష్మణరావు వాయిస్ కామెడీ గురించి ఇవాళ అందరూ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొదట్లో ఆయనకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు. అప్పుడు కొండవలస కష్టపడి, కొత్త రకంగా వాయిస్‌తో ట్రై చేశారు. అలా వచ్చిందే ఆయన ‘అయితే... ఓకే’ స్టైల్. కొండవలస గొంతు సీరియస్‌గా ఉందనీ, కొత్తదనం కోసం వేరొకరితో డబ్బింగ్ చెప్పిద్దామనీ ‘ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ దర్శకుడు వంశీ మొదట అనుకున్నారు. కానీ, కొండవలస అలా కాదని, కష్టపడి, తన గొంతు చిత్రమైన యాస చేర్చి, డైలాగ్ చెప్పి, వినిపించారు. ఆ స్టైల్ ఓ.కె అయింది. అలా ఆయనకు ‘అయితే... ఓకె’ అనే స్టైల్ ఒక ట్రేడ్ మార్క్ అయింది. ఆయన వాయిస్, ఆ వాయిస్ కామెడీనే సినిమా కెరీర్ అంతటా ఆయనకు అనేక పాత్రలు తెచ్చిపెట్టింది. - రెంటాల జయదేవ -
కామెడీ కుటుంబానికి ఏమిటీ శాపం!
హైదరాబాద్ : వెండితెర కమెడియన్లందరూ ఇటీవలే ఒక్కొక్కరే భౌతికంగా కనుమరుగవుతున్నారు. ఇదంతా చూస్తుంటే, తెలుగు హాస్యకుటుంబానికి శాపం తగిలిందా అనిపిస్తోందని సినీ వర్గాలు వాపోతున్నాయి. గడచిన ఏణ్ణర్ధం పైచిలుకు కాలంలో ప్రముఖ కమెడియన్ ఏ.వి.ఎస్. మొదలు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్ క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆ తరువాత ఈ ఏడాది మొదట్లో ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ ఆకస్మికంగా కన్నుమూశారు. ఈ అక్టోబర్‌లో ‘కళ్ళు’ చిదంబరం, ఆ వెంటనే మాడా వెంకటేశ్వరరావులు మరణించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆ దుఃఖం నుంచి తేరుకోక ముందే ఇప్పుడు కొండవలస కన్నుమూశారు. దీంతో, తెలుగు సినీ హాస్య కుటుంబానికి ఏదో తీరని శాపం తగిలినట్లుందని సినీ ప్రముఖులు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. మా ‘కళ్ళు’ కొండవలస తొలి సినిమా! కొండవలస లక్ష్మణరావు సినీ రంగప్రవేశం వంశీ దర్శకత్వంలోని ‘ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ (2002)తో జరిగిందని అందరూ అనుకుంటూ ఉంటారు. అంతటా అదే ప్రచారమూ అయింది. అయితే, ఆ సినిమా రావడానికి 14 ఏళ్ళ ముందే ఆయన తొలిసారిగా కెమేరా ముందుకొచ్చారన్న విషయం చాలామందికి తెలియదు. కొండవలస తెరంగేట్రం చేసిన ఆ సినిమాఏమిటంటే - ‘కళ్ళు’ (1988). గొల్లపూడి మారుతీరావు నాటకం ‘కళ్ళు’ ఆధారంగా ఆ సినిమా రూపొందింది. దర్శకుడిగా మారిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎం.వి. రఘు ఆ సినిమా కోసం ప్రధానంగా రంగస్థల కళాకారుల్ని పాత్రధారులుగా ఎంచుకున్నారు. ఎక్కువగా విశాఖ పరిసరాల్లోని వాళ్ళకు అవకాశమిచ్చారు. ‘కళ్ళు’ చిదంబరం కూడా ఆ సినిమాతో వెండితెరపై ప్రసిద్ధమైన రంగస్థల కళాకారుడే. అదే ‘కళ్ళు’ సినిమాలో ఒక రౌడీ వేషం ద్వారా కొండవలస లక్ష్మణరావు వెండితెర మీదకొచ్చారు. ‘‘ ‘కళ్ళు’ చిత్రానికి నటీనటులను సెలక్ట్ చేయడానికి నేను, అప్పట్లో కోడెరైక్టరైన ఇ.వి.వి. సత్యనారాయణ (తరువాతి కాలంలో ప్రసిద్ధ దర్శకుడయ్యారు) విశాఖ పరిసరాల్లో రంగస్థల కళాకారుల్ని చూశాం. కొండవలస ప్రతిభ గమనించి, మా సినిమాలో ఒక రౌడీ వేషం ఇచ్చాం. అదే ఆయనకు తొలి సినిమా ఛాన్స్. ఆ తరువాత చాన్నాళ్ళకు వంశీ దర్శకత్వంలోని ‘ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో లేటు వయసులో ఆయన కెరీర్‌కు పెద్ద బ్రేక్ వచ్చింది. ఇప్పుడు కొండవలస ఆకస్మిక మృతితో ప్రతిభావంతుడైన కమెడియన్‌ను కోల్పాయాం’’ అని ప్రముఖ కెమేరామన్ - ‘కళ్ళు’ చిత్ర దర్శకుడు ఎం.వి. రఘు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మొత్తానికి, ‘కళ్ళు’తో ప్రారంభించి, ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో కెరీర్ మలుపు తిరిగిన కొండవలస మృతి తీరనిలోటే! - రెంటాల జయదేవ -
మరో నవ్వు రాలిపోయింది
ప్రస్తుతం తెలుగు సినీ రంగానికి బ్యాడ్‌టైం నడుస్తోంది. వెండితెర మీద నవ్వులు పూయించే ఎన్నో మహా వృక్షాలు ఒక్కటొక్కటిగా నెలకొరుగుతున్నాయి. అదే వరుస మరో నవ్వుల నటుడు వెండితెరను వదిలివెళ్లారు. 'ఐతే ఓకె' అంటూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. సీనియర్ నటులు మాడా వెంకటేశ్వరరావు మరణవార్త మరిచిపోకముందే కొండవలస మృతి తెలుగు ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. 300 లకు పైగా సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన కొండవలస.. వేల నాటకాలతో అలరించారు. రంగస్థల నటుడిగా ఎంతో అనుభవంతో పాటు అదే స్ధాయిలో పేరు ప్రఖ్యాతలు కూడా సాధించిన ఆయన 378 అవార్డులు అందుకున్నారు. అంతేకాదు రంగస్థలంపై ఉత్తమ నటుడిగా రెండుసార్లు నంది అవార్డును సైతం అందుకున్నారు. కొండవలస లక్ష్మణరావు శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో 1946 ఆగస్టు 10న జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావటంతో లక్ష్మణరావు విద్యాబ్యాసం విశాఖలో జరిగింది. కళాశాలలో చదివే సమయంలోనే నాటక రంగం పట్ల ఆకర్షితులైన కొండవలస ఎన్నో నాటకాల్లో ప్రధాన పాత్రలతో అలరించారు. చదువు పూర్తయి విశాఖ పోర్ట్ర్ ట్రస్ట్ లో ఉద్యోగిగా మారినా.. నాటకరంగాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఎంతో మంది లబ్థప్రతిష్టులైన నటులతో కలిసి నటించిన కొండవలస మూడు దశాబ్దాలకు పై రంగస్థలంపై తన ప్రతిభ కనబరిచారు. ఉద్యోగానికి విఆర్ఎస్ తీసుకొని హైదరాబాద్‌లో ఉంటున్న తన కొడుకు దగ్గరకు వచ్చిన కొండవలస లక్ష్మణరావు, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాతో సినీరంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో పొట్రాజుగా నటించిన ఆయన.. ఐతే ఓకే అంటూ ప్రేక్షకులను తన అభిమానులుగా మర్చేసుకున్నాడు. తొలి సినిమాతోనే స్టార్ కామెడియన్‌గా మారిన కొండవలస తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన తుది శ్వాస వరుకు నటిస్తూనే ఉన్నారు. అతి తక్కువ సమయంలో 300లకు పైగా సినిమాలతో కామెడియన్‌గా తన క్రేజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇలా వెండితెరపై తనదైన హాస్యాన్ని పండించిన కొండవలస లక్ష్మణరావు మరణం తెలుగు సినిమాకు తెలుగు హాస్యానికి తీరని లోటు. -
అపురూప చిత్రాల నిర్మాత అస్తమయం
శంకరాభరణం, సాగరసంగమం, సీతాకోక చిలుక, సితార, స్వాతిముత్యం, స్వయం కృషి ఇలాంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలను వెండితెర మీద ఆవిష్కరించిన సాహసి ఆయన. ఆర్ట్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు వేరు వేరుగా ఉంటాయన్న అపవాదును చెరిపేస్తూ మంచి కథాబలం ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నిరూపించిన నిర్మాత. కథ కోసం హీరోలు కావాలి గాని, హీరోల కోసం కథలు రాయకూడదని నమ్మిన అసలుసిసలు సినీ జ్ఞాని. ముప్పై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కేవలం పది చిత్రాలను మాత్రమే నిర్మించినా.. వేయ్యేళ్ల పాటు చెరగని కీర్తి సంపాదించుకున్న సినీ శిఖరం. ఆ మహోన్నత వ్యక్తే పూర్ణోదయ బ్యానర్ పై ఎన్నో కళాత్మక చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. నటుడు కావాలన్న ఆలోచనతో కాలేజీ రోజుల్లోనే నాటకాలు వేసిన నాగేశ్వరరావు, సినీ రంగంలో అడుగుపెట్టి 25కు పైగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ తరువాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొంత మంది నటులకు గాత్ర దానం చేశారు. 'నేను చిన్నతనం నుంచి విలువల కోసమే బతికాను. ఆ విలువలతోనే సినిమాలు నిర్మిస్తున్నాను` అన్న ఏడిద నాగేశ్వరరావు సినీ నిర్మాణం వ్యాపారాత్మకంగా మారిన తరువాత సినిమాలకు దూరమయ్యారు. ఏడిద నాగేశ్వరరావు 1934 ఏప్రిల్ 24 న తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో జన్మించారు. సత్తిరాజు నాయుడు, పాపలక్ష్మీ ఆయన తల్లిదండ్రులు. కాలేజీ రోజుల నుంచే నాటకాలు వేయటం ప్రారంభించిన నాగేశ్వరావు తరువాత సినీ రంగం వైపు అడుగులు వేశారు. అదే సమయంలో ప్రముక దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి కళా ప్రపూర్ణ రాఘవ కళా సమితిని స్థాపించి ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. ఇలా నాటకరంగంలో ఆయనకు ఉన్న అనుభవమే తరువాత సినీ రంగంలో ఉపయోగపడింది. అలా నాటకాలలో ఉన్న అనుభవం వల్ల సినిమాల్లో నటించేందుకు మద్రాసు చేరారు నాగేశ్వరరావు. అయితే అనుకున్నట్టుగా ఆయనకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. తిరిగి ఊరు వెళ్లి మొహం చూపించే పరిస్థితి లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఆల్ ఇండియా రేడియో లో ఏగ్రేడ్ ఆర్టిస్ట్ గా ఆడిషన్ లభించింది. తరువాత ఆ సర్టిఫికేట్ తోనే సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కొంత కాలం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, అనంతరం నటుడిగా కొనసాగారు. అయినా ఏదో వెలితి. సినిమా రంగంలోనే ఇంకా ఏదో సాధించాలనే ఆశయంతో నలుగురు మిత్రలతో కలిసి తమిళ సినిమాలను అనువాదం చేసి రిలీజ్ చేయటం ప్రారంభించారు. అలా నిర్మాతగా మారారు ఏడిద నాగేశ్వరరావు. మరికొంత మంది మిత్రులతో కలిసి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తొలి ప్రయత్నంగా సిరిసిరిమువ్వ సినిమాను నిర్మించారు. తొలి సినిమాతోనే సంచలన విజయం సాదించారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. శంకరాభరణం, సీతాకోకచిలుక, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంవుడు ప్రతి సినిమా ఓ సంచలనం. మరే నిర్మాత తాకడానికి కూడా సాహసం చేయని ప్రయోగాత్మక కథలు.. అయినా అన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్ లు.. అందుకే ఆయన ప్రస్థానం తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. ఏడాది నాగేశ్వరావు ఈ రోజు (ఆదివారం కన్నుమూశారు) భౌతికంగా దూరమైనా ఆయన గత 17 ఏళ్లుగా తెలుగు సినిమాకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కళాత్మకంగా ఉండాల్సిన సినిమా వ్యాపారంగా మారిన తరువాత ఆయన సినిమాలు తీయడం మానేశారు. అయితే ఆయన చేసిన పది సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో పది అపూర్వఘట్టాలు.. కళాత్మక సినిమా నిర్మించే అభిరుచి మాత్రమే కాదు సాహసం కూడా ఉన్న ఏడిద నాగేశ్వరరావు లాంటి నిర్మాతలు మళ్లీ వస్తారని ఆశించటం కూడా అత్యాశే అవుతుందేమో.. తెలుగు సినీ అభిమానుల కోసం అపురూప చిత్ర రాజాలను అందించిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. -
సీనియర్ జర్నలిస్టు ఎంవీ కామత్ కన్నుమూత
మణిపాల్ (కర్ణాటక)/న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు, ప్రసారభారతి మాజీ చైర్మన్ మాధవ్ విఠల్ కామత్ గురువారం ఉదయుం కన్నుమూశారు. 93 ఏళ్ల కామత్‌కు ఛాతీలో నొప్పిరావడంతో బుధవారం రాత్రి మణిపాల్‌లోని కస్తూర్బా ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రమైన గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఎంవీ కామత్‌గా అందరికీ పరిచితులైన ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీతకూడా. 1946లో కామత్ ముంబైలో ‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’లో విలేకరిగా పాత్రికేయ జీవితం ప్రారంభించారు. 1955 నుంచి 58 వరకు ఆయన ఐక్యరాజ్యసమితిలో పీటీఐకి స్పెషల్ కరెస్పాండెంట్‌గా పనిచేశారు. అనంతరకాలంలో ఆయన ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియూ, ఫ్రీ ప్రెస్ బులెటిన్, భారత్ జ్యోతి వంటి పత్రికలకు ఎడిటర్‌గా, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు యుూరొప్, అమెరికాల్లో కరెస్పాండెంట్‌గా పనిచేశారు. 1947 ఆగస్టు 14వ తేదీ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పు డు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాతంత్య్ర ప్రకటన వెలువడే సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. ఆ అద్భుత ఘట్టాన్ని రిపోర్టుచేసిన వారిలో ఇప్పటివరకు ఉన్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. ఆయన 45 పుస్తకాలు రాశారు. 1921 సెప్టెంబర్ 7వ తేదీన ఆయన కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. కామత్ మృతికి ప్రదాని మోదీ సంతాపం తెలిపారు. -
దిగంతాలకు తెలుగు సంతకం
ఆకాశంలో సూర్యుడు మర్డర్ చేసినట్టుగా లేడు... కన్నీటి ముద్దలా ఉన్నాడు. ముత్యమంతా పసుపు... ముఖమెంతొ చాయ... కూనిరాగం మూగబోయింది. సగటు ఇల్లాలి గొంతు దుఃఖంతో రుద్ధమైంది. పట్టీల పాదాల ఆడపిల్లలందరూ చిన్నబుచ్చుకుని పక్కకు తప్పుకున్నారు. బుడుగు అల్లరి ఆపేశాడు... సీగాన పెసూనాంబ నోటికి తాళం పడింది. ఇంతకాలం నవ్వించిన తెలుగు వ్యంగ్య రేఖా పాత్రలన్నీ తండ్రి కనిపించని పిల్లల్లా కేర్కేర్మని ఏడుస్తున్నాయి. రామయ్య దర్పం, సీతమ్మ చిర్నవ్వు క్షణమాత్రం చెదిరి వదనాలు విషణ్ణమయ్యాయి. బాపు మరి లేరు. కుదురుగా బలిష్టంగా ఉండే ఆయన బొటనవేలు, చూపుడు వేలు మధ్య ఆ కుంచె మరి లేదు. తెలుగు అందం మరి లేదు. తెలుగు హాస్యం మరి లేదు. పాశ్చాత్య ప్రపంచాన్ని తన వైపు లాగిన రామాయణ, భారత, భాగవతాల తెలుగు రేఖా సౌరభం మరి లేదు. తెలుగుదనంతో నిండిన ఆ సినిమా మరి లేదు. తెలుగు స్నేహానికి తార్కాణంగా నిలిచిన ఆ జోడి మరి లేదు. 50 ఏళ్ల చలనచిత్రకారుడు బాపు... 65 ఏళ్ల చిత్రకారుడు బాపు... 81 ఏళ్ల చరిత్రకారుడు బాపు ఇక మనకు లేరు. సాక్షి ప్రతినిధులు: సుప్రసిద్ధ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్టు బాపు (81) ఆదివారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ సాయంత్రం 4.45 గంటలకు తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా వృద్ధాప్య కారణాలతో ఇంటిపట్టునే ఉంటున్న బాపు మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. రాత్రి 7.30 గంటలకు బాపు భౌతికకాయాన్ని చెన్నై అడయారులోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. బాపు మరణవార్త నగరంలో వేగంగా వ్యాపించడంతో పలువురు ప్రముఖులు ఇంటికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. బాపు భార్య భాగీరథి గత ఏడాది ఏప్రిల్ 24న కన్నుమూశారు. ఆయనకు కుమార్తె భానుమతి, కుమారులు వేణుగోపాల్, వెంకటరమణ ఉన్నారు. బాపు పెద్ద కుమారుడు వేణుగోపాల్ ఈ నెల 29న జపాన్‌కు వెళ్లారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న ఆయన సోమవారం చెన్నై చేరుకుంటారని తెలిసింది. హైదరాబాద్ నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. సోమవారం సాయంత్రం చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నాయి. చిత్రకారుడు బాపు పదిహేనేళ్ల వయసులోనే బాపు కుంచె చేతబూనారు. బాలానంద సంఘం నుంచి బాలపత్రికలో బాపు బొమ్మల కథ మొదలయ్యింది. నవ యవ్వన దశలోనే కవర్ డిజైన్లు, కామిక్సు, కార్టూన్లు గీయడం మొదలుపెట్టారు. బాపు బొమ్మల్లో ఆడతనం, జాణతనం, కన్నెతనం, గడుసుతనం మద్రాసు మేధావుల్ని విస్తుపోయేలా చేసింది. ‘ఎవరయ్యా ఈ ఆర్టిస్టూ’ అంటూ కనురెప్పలెగరేసేలా చేసింది. అప్పట్నుంచి బాపు బొమ్మలు కూడా వారికి దీటుగా మాట్లాడటం, వెక్కిరించడం, ఎగతాళి చేయడం, ముక్కున వేలేసుకోవడం నేర్చాయి. ఇలస్ట్రేటర్‌గా, కార్టూనిస్ట్‌గా, పెయింటర్‌గా, డిజైనర్‌గా... బాపుది అద్వితీయ ప్రస్థానం. వాలుజడను విసురుతూ.. చారడేసి కళ్ళు, కోటేరు ముక్కుతో వయ్యారాలు ఒలకబోసే బాపు బొమ్మ తెలుగువారి ఆస్తి. అడపాదడపా బాపు బొమ్మను స్మరించకుండా మన సినీ గేయ రచయితలు కూడా ఉండలేరు. బాపు ఆగమనంతో సినిమా వాల్‌పోస్టర్ల రూపు రేఖలు మారిపోయాయి. ఈ అద్వితీయ ప్రతిభే ఆయన్ను తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన చిత్రకారునిగా నిలబెట్టింది. బాపు కుంచె నుంచి జాలువారిన తిరుమల శ్రీవారి చిత్రాలు, అన్నమయ్య నాట్య విన్యాసాలు తిరుమల భక్తులను నేటికీ తన్మయానికి గురి చేస్తుంటాయి. వెండితెరపై బాపు అద్భుతాలు ‘సాక్షి’ తర్వాత బాపు వెండితెర అద్భుతం అంటే ‘బుద్ధిమంతుడు’ (1969) సినిమానే చెప్పుకోవాలి. నాస్తికునిగా, ఆస్తికునిగా రెండు విభిన్న పాత్రల్లో అక్కినేనిని చూపించి శభాష్ అనిపించారు బాపు. ఫాంటసీలో ఇదొక వినూత్న ప్రయత్నం. ఇప్పటికీ ఈ సినిమా కొత్తగానే ఉంటుంది. ఇక అప్పటివరకూ వచ్చిన పౌరాణికాలు ఒక ఎత్తు, బాపూ ‘సంపూర్ణ రామాయణం’(1971) ఒక ఎత్తు. శోభన్‌బాబుని రామునిగా చేసి బాపు తీసిన ఈ సినిమా ఓ క్లాసిక్. వాల్మీకి రామాయణాన్ని ఇంత మధురంగా తీర్చిదిద్దిన సినిమా ఇప్పటికీ లేదంటే అతిశయోక్తికాదు. 1973లో అక్కినేనితో చేసిన ‘అందాల రాముడు’ సినిమా అయితే.. ఓ అందమైన గోదారి ప్రయాణమే. శ్రీరాముడంటే బాపు-రమణలకు మహాభక్తి. ఎంత భక్తంటే.. రాముడే తమను నడిపిస్తున్నాడనుకునేంత. ఆ భక్తినంతా క్రోడీకరించి వారు తీసిన సినిమా ‘శ్రీరామాంజనేయ యుద్ధం’. వెండితెరపై రాముడిగా అప్పటికే చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్.. బాపు దృక్కోణంలో రాముడిగా శోభతో వెలిగిపోయారు. ఈ కల్పిత కథను జనరంజకంగా మలిచి, శభాష్ అనిపించుకున్నారు బాపు. బాపు ‘ముత్యాలముగ్గు’ సాంఘిక చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్. 1975లో ‘ముత్యాలముగ్గు’ తెలుగు సినిమా గమనాన్ని మార్చేసింది. ముళ్లపూడి వెంకటరమణ అయితే.. సంభాషణలతో చెలరేగిపోయారు. రావుగోపాలరావు అనే నటుడు దశాబ్దంన్నర పాటు తిరుగులేని విలన్‌గా తెలుగుతెరను ఏలారంటే కారణం ‘ముత్యాలముగ్గు’. రామాయణాన్ని సోషలైజ్ చేసి తీసిన సినిమా ఇది. ‘సీతా కల్యాణం’(1976) చిత్రంలో తెలుగు తెరపై సాంకేతిక విప్లవం సృష్టించారు బాపు. లండన్, షికాగో ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన చిత్రమిది. అలాగే లండన్‌లోని ఆర్కైవ్స్‌లో ఈ చిత్రాన్ని భద్రపరిచారు. ఈ సినిమా చూసిన దర్శకుడు కె.బాలచందర్ ఢిల్లీలోని ఓ అవార్డు ఫంక్షన్లో బాపుని కలిసి.. ‘నేను గుడికి వెళ్లను. దేవుణ్ణి నమ్మను. కానీ... నీ ‘సీతాకల్యాణం’ చూశాక.. ఆ దృశ్యాలే నా కళ్లలో మెదులుతున్నాయి’ అన్నారు పారవశ్యంతో. వెండితెరకు కన్నప్ప.. ధూర్జటి ‘కాళహస్తి మహత్యం’(1976) కావ్యానికి బాపు ఇచ్చిన వెండితెర రూపం ‘భక్త కన్నప్ప’. కృష్ణంరాజుని కన్నప్పగా, బాలయ్యను పరమశివునిగా చూపిస్తూ ఆయన తీసిన ఈ కావ్యం ఇప్పటికీ ప్రేక్షకుల్ని తన్మయానికి గురి చేస్తుంది. సామాజిక దృక్పథంతో కూడిన కథాంశంతో బాపు తీసిన సినిమా ‘మనవూరి పాండవులు’(1978). చిరంజీవి తొలి శతదినోత్సవ చిత్రమిదే. బాపూలోని విప్లవభావాలకూ ఈ సినిమా అద్దం పడుతుంది. ఇంకా గోరంత దీపం, తూర్పువెళ్లే రైలు, వంశవృక్షం, బైబిల్ కథాంశంతో తీసిన ‘రాజాధిరాజు’, త్యాగయ్య, రాధాకల్యాణం, మంత్రిగారి వియ్యంకుడు, జాకీ, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీరామరాజ్యం... ఇలా ఎన్నో అద్భుతాలు బాపు సృజన నుంచి జాలువారాయి. పదికి పైగా హిందీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు బాపు. ఎక్కడ చూసినా ఆయన అక్షరాలే.. అక్షరాలు గుండ్రంగానే ఉండాలా? అలాగైతే పాత అక్షరాలనే కంపోజ్ చేసుకోవచ్చుగా అంటూ ముద్రణ రంగంలోని పాత చింతకాయ విధానాలపై ఉద్యమించారు బాపు. ఇక బాపు ఫ్రీస్టయిల్ అక్షరాలు ముద్రణ రంగంలో పోటెత్తాయి. సినిమా పోస్టర్లు, సైన్ బోర్డులు, పత్రిక శీర్షికలు ఇలా ప్రతి వాటిపై బాపు అక్షరాలే. ఈ సాఫ్ట్వేర్ యుగంలో కూడా బాపు బ్రష్, బాపు నిబ్ అంటూ పలు రకాల లిపులు అక్షర చరిత్రలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. తెలుగునాట ఏ శుభకార్యం జరిగినా సదరు శుభలేఖలపై ఉండే బాపు అక్షరాలే తెలుగువారికి శుభాక్షితలు. ముళ్లపూడితో స్నేహం బాపు-రమణ.. వీరిద్దరి శరీరాలే వేరు. ఆత్మలు ఒక్కటే. బాపు విజయాల్లో సగభాగం రమణకు ఇవ్వాల్సిందే. ముళ్లపూడి చివరి శ్వాస విడిచే వరుకూ బాపూ చేయి విడువలేదు. బాపు గీత, ముళ్లపూడి రాత జీవ నదుల్లా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ముళ్లపూడి మరణం బాపుని మానసికంగా కుంగదీసింది. అప్పట్నుంచే ఆయన ఆనారోగ్యానికి గురయ్యారు. ఈరోజు బాపు మన మధ్య లేకపోవడం యావత్ భారతావనికే తీరని లోటు. చలన చిత్రకారుడు.. బాపుకు మొదట్నుంచీ సినిమాల పిచ్చి. వచ్చిన ప్రతి సినిమానూ చూసేవారు. నచ్చితే మళ్లీ మళ్లీ చూసేవారు. చూసొచ్చిన తర్వాత మిత్రులతో ‘నేనైతే.. ఇలా తీసేవాణ్ణి’ అంటూ చర్చాగోష్టి పెట్టేవారు. చిత్రకారుడైన తనకు ఎప్పటికైనా చలనచిత్రకారుడు కూడా కావాలని ఆకాంక్ష. ఆ కోరికను ప్రాణమిత్రుడైన ముళ్లపూడి వెంకటరమణ తీర్చేశారు. అప్పటికే రమణ స్టార్ రైటర్. రక్తసంబంధం, మూగ మనసులు, దాగుడు మూతలు, గుడిగంటలు లాంటి సిల్వర్‌జూబ్లీ చిత్రాలకు రచనలు చేసిన అనుభవం ఆయనది. పైగా బాపు ప్రతిభ బాగా తెలిసిన వ్యక్తి. అందుకే బాపు ‘డెరైక్షన్’ అనగానే రమణ ‘యాక్షన్’ అనేశారు. 1967లో కేవలం రెండున్నర లక్షల ఖర్చుతో ‘సాక్షి’ సినిమాను తీసేశారు బాపు. బొమ్మలు గీసుకునేవాడికి సినిమాలేంటి? అని వెటకారం చేసిన వారే ముక్కున వేలేసుకున్నారు. ఇక అప్పట్నుంచి ‘శ్రీరామరాజ్యం’ వరకూ 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు బాపు. తెలుగుదనానికి బ్రాండ్ అంబాసిడర్ 1977లో ‘స్నేహం’ సినిమా ద్వారా బాపూరమణలు నన్ను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ రమణగారు నాముందు ప్రత్యక్షమయ్యారు. ‘పెళ్లిపుస్తకం’ సినిమా తీశారు. ఇవాళ ఏ తెలుగువారి ఇంట పెళ్లి జరిగినా ఇందులోని శ్రీరస్తు.. శుభమస్తు.. పాట మోగాల్సిందే కదా. వారే మళ్లీ మిస్టర్ పెళ్లాం చేశారు. మధ్యతరగతి లలిత శృంగారాన్ని చూపిన సినిమాగా అదెలా నిలిచిపోయిందో మనందిరికీ తెలుసు. వీటన్నింటికన్నా బాపూగారిని మనం తలుచుకోవాల్సింది ఆయన బొమ్మలని, వాటిలోని తెలుగుదనాన్ని. ఆయన తెలుగుదనానికి బ్రాండ్ అంబాసిడర్. - నటుడు రాజేంద్రప్రసాద్ వెండితెర అమరశిల్పి జక్కన్న కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరు బాపుగారు. ఆయన తీసిన ప్రతి చిత్రమూ సకుటుంబ సమేతంగా చూడదగ్గవే. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా ఆవిష్కరించిన వెండితెర అమరశిల్పి జక్కన్న బాపుగారు. అసలు రమణగారు పోయినప్పుడే బాపూగారు మానసికంగా చనిపోయారు. ఇప్పుడు భౌతికంగా దూరమయ్యారు. తెలుగు సినిమా తెర మీద ఆయన ముద్ర ప్రగాఢమైనది. అందమైన అమ్మాయి కనిపిస్తే బాపు బొమ్మ అనడం మన తెలుగువారికి పరిపాటి అయ్యింది. ఆయన మరణం తీరని లోటు. - దర్శకుడు దాసరి నారాయణరావు తొలి కథానాయికను.. దర్శకునిగా ‘సాక్షి’ ఆయనకు తొలి సినిమా. ఆ విధంగా బాపూగారి తొలి కథానాయికను నేను కావడం నాకెప్పటికీ ఆనందంగా ఉంటుంది. నేను దర్శకురాల్ని కావడానికి కారణం బాపూగారే. సినిమా గురించి ఏ సందేహం అడిగినా విసుక్కోకుండా చెప్పేవారు. ‘సాక్షి’ చిత్రం ద్వారానే నాకు కృష్ఱగారితో పరిచయం ఏర్పడింది. బాపూగారి దయవల్ల కృష్ణగారు నా జీవితంలోకి వచ్చారు. ఏడాది క్రితం ఆయన్ను ఓ ఫంక్షన్లో కలిశాను. కానీ, ఇంత త్వరగా మనకు దూరమవుతారని ఊహించలేదు. - నటి, దర్శకురాలు విజయనిర్మల బొమ్మల దర్శకులను చూడలేదు నా తొలి చిత్రం ‘తేనె మనసులు’కి రమణగారే కథ రాశారు. ఆ చిత్రం లొకేషన్‌కి రమణగారు, బాపూగారు అప్పుడప్పుడు వస్తుండేవారు. నేను హీరోగా బాపు గారు తీసిన ‘సాక్షి’ సినిమాను 17, 18 రోజుల్లోనే పూర్తి చేసేశారు. ప్రతి సీన్ తీసే ముందు బొమ్మలు గీసి, కెమెరామేన్‌కి చూపించి ‘ఈ షాట్ నాకిలా రావాలి’ అని చెప్పేవారు బాపూగారు. నేనిప్పటివరకు 300కు పైగా సినిమాల్లో నటించాను. కానీ, అలా బొమ్మలు గీసి, ఆ ప్రకారమే సీన్స్ రావాలని చెప్పిన దర్శకులను చూడలేదు. అంతటి మహా దర్శకుణ్ణి కోల్పోవడం దురదృష్టం. - సూపర్‌స్టార్ కృష్ణ ఆ ఘనత బాపూగారిదే: మోహన్‌బాబు వాలు జడ, సొగసు కళ్లు.. ఇంత అందంగా ఉండాలని చూపించిన కుంచె ఆయనది. కంప్యూటర్ గ్రాఫిక్స్ అందుబాటులో లేని రోజుల్లోనే ‘సీతమ్మ పెళ్లి’ చిత్రంలో సీతాదేవి భూమి నుంచి పైకి వచ్చే సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించిన బాపు ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మహోన్నత వ్యక్తి తన స్నేహితుడు రమణగారితో ‘మోహన్‌బాబు చాలా బాగా నటించాడు’ అనడం నా జీవితంలో మర్చిపోలేని అభినందన. అది ఆయనకే సాధ్యం: బాలకృష్ణ పౌరాణిక చిత్రాలు కనుమరుగవుతున్న రోజుల్లో బాపూగారు నాతో ‘శ్రీరామరాజ్యం’ చిత్రం తీశారు. నన్ను శ్రీరాముడిగా మలిచిన తీరు, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన వైనం ఒక్క బాపూగారికే సాధ్యం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో బాపూగారితో ఉన్న ప్రతి క్షణం ఓ తీపి గుర్తు.