సీనియర్ జర్నలిస్టు ఎంవీ కామత్ కన్నుమూత
మణిపాల్ (కర్ణాటక)/న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు, ప్రసారభారతి మాజీ చైర్మన్ మాధవ్ విఠల్ కామత్ గురువారం ఉదయుం కన్నుమూశారు. 93 ఏళ్ల కామత్‌కు ఛాతీలో నొప్పిరావడంతో బుధవారం రాత్రి మణిపాల్‌లోని కస్తూర్బా ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రమైన గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఎంవీ కామత్‌గా అందరికీ పరిచితులైన ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీతకూడా. 1946లో కామత్ ముంబైలో ‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’లో విలేకరిగా పాత్రికేయ జీవితం ప్రారంభించారు. 1955 నుంచి 58 వరకు ఆయన ఐక్యరాజ్యసమితిలో పీటీఐకి స్పెషల్ కరెస్పాండెంట్‌గా పనిచేశారు. అనంతరకాలంలో ఆయన ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియూ, ఫ్రీ ప్రెస్ బులెటిన్, భారత్ జ్యోతి వంటి పత్రికలకు ఎడిటర్‌గా, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు యుూరొప్, అమెరికాల్లో కరెస్పాండెంట్‌గా పనిచేశారు. 1947 ఆగస్టు 14వ తేదీ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పు డు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాతంత్య్ర ప్రకటన వెలువడే సమయంలో ఆయన అక్కడే ఉన్నారు.
ఆ అద్భుత ఘట్టాన్ని రిపోర్టుచేసిన వారిలో ఇప్పటివరకు ఉన్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. ఆయన 45 పుస్తకాలు రాశారు. 1921 సెప్టెంబర్ 7వ తేదీన ఆయన కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. కామత్ మృతికి ప్రదాని మోదీ సంతాపం తెలిపారు.