
మనవి ఆలకించరాదటె!
శ్రీవిష్ణుకు పిచ్చి పట్టిందంటున్నారు అతడి స్నేహితులు. పక్కనున్న వాళ్లను పట్టించుకోకుండా ఎప్పుడూ ప్రేయసి ఊహల్లో విహరిస్తుండడంతో ‘అతడిది లవ్ మెంటల్’ అని డిసైడ్ చేశారట! ‘‘సిగ్గుతో మనసులో ఫీలింగ్స్ చెప్పలేకపోవడం, ప్రేమలో ఓ పనికి బదులు మరో పని చేయడం ‘మెంటల్’ అయితే.. నాది మెంటలే’’ అంటున్నారు శ్రీవిష్ణు. రియల్ లైఫ్‌లో కాదు... రీల్ లైఫ్ సంగతిది. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మిస్తున్న సినిమా ‘మెంటల్ మదిలో’.
మనవి ఆలకించరాదటె.. అనేది ఉపశీర్షిక. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రేమికుల రోజున విడుదల చేశారు. ఇందులో షై, ఇంట్రా వర్ట్, కన్ఫ్యూజ్డ్ కుర్రాడిగా శ్రీవిష్ణు నటిస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ తర్వాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కూర్పు: విప్లవ్, కెమేరా: వేదా రామన్, సంగీతం: ప్రశాంత్ విహారి.