అపర్ణ, రాజీవ్ మీనన్, జీవీ ప్రకాశ్
‘‘కర్ణాటిక్ సంగీతం మీద డాక్యుమెంటరీ చేస్తున్న సమయంలో, మృదంగం తయారు చేసేవాళ్లతో సంభాషిస్తున్నప్పుడు ఈ చిత్రకథ ఆలోచన వచ్చింది. నచ్చిన కళను ఇష్టపడి నేర్చుకుంటూ, ఆ మార్గంలో అడ్డంకులు ఎదుర్కొని గెలిచిన యువకుడి కథే ఈ ‘సర్వం తాళమయం’’ అని రాజీవ్ మీనన్ అన్నారు. జీవీ ప్రకాశ్ కుమార్, అపర్ణా బాలమురళి జంటగా ‘మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది’ వంటి హిట్స్‌ను ఇచ్చిన రాజీవ్ మీనన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్వం తాళమయం’ ఈ నెల 8న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘గత కొన్నేళ్లుగా కథలు రాస్తూనే ఉన్నాను. కానీ అవి సినిమా వరకు వెళ్లలేదు. ఆ గ్యాప్‌లో యాడ్స్ చేశా, మా ఇన్‌స్టిట్యూట్ పనుల్లో బిజీగా ఉన్నాను. రామాయణంలో రాముడు 14 ఏళ్లే వనవాసం చేశాడు, నాది 18 ఏళ్ల వనవాసం (దర్శకుడిగా వచ్చిన గ్యాప్‌ను ఉద్దేశించి). యాడ్ ఫిల్మ్ చేస్తున్న సమయంలో రెహమాన్ నాకు పరిచయం. కొన్ని వందల యాడ్ ఫిల్మ్ కలసి చేశాం. రెహమానే నన్ను దర్శకుడిగా సిఫార్సు చేసింది. ఈ సినిమాలో నేనో ట్యూన్ కంపోజ్ చేశా. రెహమాన్‌కు చెబుదామంటే భయం. కానీ ట్యూన్ నచ్చడంతో ఇష్టంగా స్వీకరించి సినిమాలో పెట్టుకున్నాడు.
అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ‘శంకరాభరణం, సాగర సంగమం’ లాంటి సంగీత ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. కె. విశ్వనాథ్‌గారు మా సినిమా చూసి, నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. క్లైమాక్స్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా’’ అన్నారు. ‘‘ఈ మూవీ నాకు చాలా స్పెషల్. రాజీవ్ మీనన్‌గారు క్లాస్ డైరెక్టర్. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు జీవి ప్రకాశ్. ‘‘ఈ ఆఫర్ రాగానే ముందు నమ్మలేదు. ఎవరో ఆటపట్టించడానికి కాల్ చేశారేమో అనుకున్నాను. నిజంగానే రాజీవ్‌గారు అని తెలిసి చాలా ఆనందపడ్డా’’ అన్నారు అపర్ణ.
Comments
Please login to add a commentAdd a comment