
అదో స్వీట్ షాక్ !
నేను కలలో కూడా ఊహించని అవకాశం ఇది అంటోంది నటి శ్రద్ధాశ్రీనాథ్. మలయాళంలో యూటర్న్ చిత్రంతో ప్రాచుర్యం పొందిన ఈ మాలీవుడ్ భామ ఇప్పుడు కోలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి మణిరత్నం చిత్రం కాట్రు వెలియిడై. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అతిథిరావు. కాగా ఇందులో మరో ముఖ్యపాత్రలో శ్రద్ధాశ్రీనాథ్ నటించింది. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ఇది ప్యూర్ లవ్‌స్టోరీ అని చిత్ర వర్గాలు చెబుతున్నారు.ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని శ్రద్ధాశ్రీనాథ్ తెలుపుతూ లెజెండ్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఇంత త్వరగా నటించే అవకావం వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదంది.
ఆయన చిత్రాల్లో అవకాశాల కోసం ఎందరో ఆశగా ఎదురు చూస్తుంటారని అంది. మణిరత్నం చిత్రాలను, ఆయన వర్కింగ్ స్టైల్‌ను తాను గమనిస్తూ వచ్చానని చెప్పింది. అలాంటిది ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రాగానే తాను షాక్‌కు గురయ్యానని, అది చాలా స్వీట్ షాక్ అని పేర్కొంది. అలాంటిది ఆయన దర్శకత్వంలో కాట్రు వెలయిడై చిత్రంలో నటించడం లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పింది. చిత్రంలో తాను నటించిన ఒక సన్నివేశాన్ని మానిటర్‌లో చూసి మణిరత్నం చాలా హ్యాపీగా దరహాసం చేశారని అంది. ఆ సన్నివేశం ఏమిటన్నది చిత్రం చూస్తే మీకే తెలుస్తుందని పేర్కొంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఇవన్ తందిరన్, విక్రమ్ వేదా చిత్రాల్లో నటిస్తోంది.