ఆ ఆలోచనే లేదు!
పెళ్లి చేసుకోను, ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నానంటోంది నటి ధన్సిక. పేరాన్మై చిత్రం ద్వారా కోలీవుడ్ తెరపై మెరిసిన ఈ భామ ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అలాంటిది కబాలి చిత్రంలో రజనీకాంత్‌కు కూతురిగా నటించింది కాసేపే అయినా ఇరగదీసింది. అందుకు మంచి పేరే తెచ్చుకుంది కూడా. తాజాగా కోలీవుడ్‌తో పాటు మాలీవుడ్, శాండిల్‌వుడ్‌లోకి పరిచయమైన నటి ధన్సిక నటించిన తాజా చిత్రం ఉరు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి ధన్సిక తెలుపుతూ ఇందులో రచయిత అయిన కలైయరసన్‌కు అర్ధాంగిగా నటించానని చెప్పింది. వాణిజ్య అంశాలతో కథ రాయమని ఒత్తిడి చేయడంతో అలాంటి కథను రాయడానికి కలైయరసన్ కోడైక్కానల్ వెళతానన్నారు.
అక్కడ జరిగే అనూహ్య సంఘటనలే ఉరు చిత్రం అని చెప్పింది. ఉరు అంటే భయం అని దర్శకుడు విక్కీఆనంద్ తెలిపారని అంది. గ్లామర్ గురించి మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు ధన్సిక బదులిస్తూ కొత్తలో తెలియక గ్లామర్ పాత్రల్లో నటించానని చెప్పింది. అయితే ఇకపై గ్లామరస్‌గా నటించేది లేదని చెప్పింది. తాను సాయి భక్తురాలినని,అందుకే తన పేరును కూడా సాయి ధన్సికగా మార్చుకున్నానని తెలిపింది. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్న తనకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని అంది.
అనాథాశ్రమాన్ని కట్టించనున్నానని తెలిపింది. అదే విధంగా నటిగా తనకు తగ్గ పాత్రలనే ఎంపిక చేసుకుని నటించాలని నిర్ణయించుకున్నాని చెప్పింది. మరో నటిని చూసి అసూయ పడే మనస్తత్వం తనది కాదని ధన్సిక పేర్కొంది. అన్నట్లు ఈ అమ్మడు మలయాళ చిత్రంలో అంధురాలిగా నటిస్తున్నారట.