నో అబ్జెక్షన్ అంటారా?
సెన్సార్ సర్టిఫికెట్ కోసం సెన్సార్ బోర్డ్‌కి సినిమా చూపించినప్పుడు కొన్ని సినిమాలకు చిక్కులు వస్తుంటాయి. మాజీ ప్రధాని మనోహ్మన్‌సింగ్ జీవిత కథ ఆధారంగా అనుపమ్ ఖేర్ లీడ్ రోల్ చేస్తున్న ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రానికి షూటింగ్ పూర్తవక ముందే సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన వెంటనే సెంట్రల్ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ స్పందించారు.
‘‘మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ బయోపిక్‌లో అనుపమ్ ఖేర్ నటించడం ఆనందించదగ్గ విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మన్మోహన్‌సింగ్‌ల నుంచి ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్స్‌ను ఈ సినిమా మేకర్స్ సెన్సార్ బోర్డుకు సమర్పించవలసి ఉంటుంది. 2018 జనవరిలో నా పదవీ విరమణ ఉంటుంది. ఈ చిత్రం అప్పటికి సెన్సార్‌కు రాకపోవచ్చు. అయితే ఇప్పటి ఈ రూల్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అనుకుంటున్నాను’’ అన్నారు పహ్లాజ్.
మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న టైమ్‌లో మీడియా సలహాదారులు సంజయ్ బారు రచించిన ‘ది యాక్సిడెంటల్ ప్రెమ్‌మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు హన్సల్ మెహతా రచయిత కాగా, విజయ్ రత్నాకర్ గుట్టే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సెన్సార్ బోర్డ్ సభ్యులు అశోక్ పండిట్ ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ఆ సంగతలా ఉంచితే, సోనియా, మన్మోహన్ ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్స్ ఇస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను 2019 ఎన్నికల సమయానికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుందని బాలీవుడ్ టాక్.