
సూపర్ ఫాస్ట్
సప్తగిరి హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సప్తగిరి సూపర్‌ఫాస్ట్’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జొన్నాడ రమణమూర్తి సమర్పణలో నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు పి. కిరణ్ క్లాప్ ఇవ్వగా, సీనియర్ రచయిత విజయేంద్రప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ –‘‘నా చిరకాల మిత్రుడు హర్షవర్ధన్ నాతో కలిసి చాలా సినిమాలకు వర్క్ చేశాడు. ఈ సినిమా కథను రెడీ చేసి, నాకు వినిపించి నా అనుమతి తీసుకున్నాడు. సప్తగిరికి సూట్ అయ్యే మంచి కథ ఇది. హీరోగా మరో మెట్టు పైకి ఎదుగుతాడు’’ అన్నారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ– ‘‘కొత్త నిర్మాతలిద్దరూ సినిమాపై మంచి ప్యాషన్‌తో ఉన్నారు’’ అన్నారు. ‘‘మా టీమ్‌ని నమ్మి సప్తగిరిగారు సినిమా చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు సప్తగిరి.