‘‘మణిరత్నంగారి ‘నాయగన్’ తరహా సినిమాలు తెలుగులో ఎప్పుడు వస్తాయా? అనుకునేవాడిని. ‘పుష్ప’తో నెరవేరింది. ‘టైగర్ నాగేశ్వర రావు’ కూడా అలా అనిపించింది’’ అన్నారు రచయిత–దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. రవితేజ టైటిల్ రోల్‌లో రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కె. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రవితేజగారు చేసిన ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని తమిళ, కన్నడ, హిందీలో రీమేక్ చేశారు. అయితే ఎవరూ ఆయన్ను మ్యాచ్ చేయలేకపోయారు.
రవితేజగారు తెలుగు సినిమాలకే పరిమితమైపోకుండా ఇతర భాషల చిత్రాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ‘టైగర్ నాగేశ్వర రావు’ ట్రైలర్ చూడగానే ప్రతి ఫేమ్‌ను దర్శకుడు వంశీ అద్భుతంగా తీశారనిపించింది. అభిషేక్ అగర్వాల్‌గారికి మంచి టైమ్ నడుస్తోంది. దసరా పండగ వచ్చింది. దుర్గమ్మవారికి ఎవడూ ఎదురు నిలబడలేడు. ఆ దుర్గమ్మ తల్లి వాహనం టైగర్ ముందు కూడా ఎవడూ నిలబడలేడు. దసరా మీదే (టైగర్ నాగేశ్వరరావు టీమ్‌ను ఉద్దేశించి)’’ అన్నారు. మరో ముఖ్య అతిథి ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా మాట్లాడుతూ– ‘‘రవితేజగారికి ఉత్తరప్రదేశ్‌లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీ గర్వపడేలా నా మిత్రుడు అభిషేక్ అగర్వాల్ మరిన్ని సినిమాలు తీయాలి.
ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా కథ విని, ఎగ్జయిట్ అయ్యాను. ఎమోషన్, థ్రిల్.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. సినిమాలో ఉన్నవన్నీ ఒరిజినల్ పాత్రలే. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించిన అభిషేక్‌గారు ‘టైగర్’తో హ్యాట్రిక్ హిట్ సాధించాలి’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక బెస్ట్ ఫిలిమ్‌గా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు వంశీ. ‘‘నాలుగేళ్ల ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రయాణాన్ని జీవితంలో మర్చిపోలేను’’ అన్నారు అభిషేక్ అగర్వాల్. ఈ వేడుకలో చిత్ర సహ–నిర్మాత మయాంఖ్, దర్శకులు గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, టీజీ విశ్వప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment