టాలీవుడ్ హీరో రవితేజ నేడు మీడియా ముందుకు రానున్నారు. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే ఒక విమర్శ ఉంది. సినిమా రన్‌టైమ్ 3గంటలు ఉండటం టైగర్ నాగేశ్వరరావుకు పెద్ద మైనస్ అయింది. కొన్ని అవసరం లేని సీన్లతో ప్రేక్షకులను బోర్ కొట్టించారని విమర్శలు రావడంతో మేకర్స్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 3గంటల నిడివి కాస్త 2 గంటల 37 నిమిషాలకు కుదించారు. ఈ విషయాన్ని తాజాగా టైగర్ నాగేశ్వరరావు మేకర్స్ ప్రకటించారు.
(ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు)
ఇదే విషయంపై నేడు హీరో రవితేజ మీడియా సమావేశం పెట్టనున్నారు. సినిమా విడుదల సమయంలో కూడా ఆయన తెలుగు మీడియాకు పెద్దగా ఇంటర్వ్యూలు ఏమీ ఇవ్వలేదు. టాలీవుడ్‌లో రవితేజను ఎలాగూ ఆదరిస్తారు కాబట్టి 'టైగర్ నాగేశ్వరరావు' మార్కెట్‌ను పెంచుకునేందుకు ఎక్కువగా బాలీవుడ్, కోలీవుడ్‌లోనే పలు మీడియా సమావేశాలు నిర్వహించారు.
ఈ సినిమా ట్రైలర్‌ను కూడా ముంబైలోనే ఆయన లాంచ్ చేశారు. ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం రవితేజకు తెలుగు మీడియా మీద పెద్దగా ఆసక్తి లేదని సమాచారం. ప్రముఖ మీడియా సంస్థల నుంచి కాకుండా యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించే వారు సరైన ప్రశ్నలు అడగరని ఆయనలో ఒక అపనమ్మకం ఉందట. దీంతో టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం టాలీవుడ్ మీడియాకు నో చెప్పి బాలీవుడ్ మీడియాకు ఎడా పెడా ఇంటర్వ్యూలు ఇచ్చారు రవితేజ.
కానీ సినిమా విడుదలకు ముందు పరిస్థితి ఇలా ఉన్నా.. అనంతరం మూవీపై నెగటివిటీ రావడంతో టైగర్ నాగేశ్వరరావు టీమ్‌లో మార్పు వచ్చింది. ఎలాగైనా సినిమాను నిలబెట్టుకోవాలని యూనిట్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే తాజాగా సినిమా నిడివి తగ్గించారు. ఇదే విషయంపై హీరో రవితేజ టైగర్ నాగేశ్వరరావు గురించి పలు విషయాలను నేడు మీడియా ముందు తెలపనున్నారు. టాలీవుడ్‌లో తన సినిమాను మీడియా ద్వారా ప్రమోట్ చేయాలని రవితేజ ఆలోచించినట్లు సమాచారం. సినిమా రన్‌టైమ్ తగ్గించడంతో కొత్తగా చూసేవారు తప్పకుండా టైగర్ నాగేశ్వరరావును ఆదరిస్తారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment