
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) గురించి కీలక అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాని 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు మేకర్స్. ‘ఆర్‌ఆర్‌ఆర్, దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్, సలార్’ వంటి హిట్స్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘ఎన్టీఆర్ నీల్’.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించింది యూనిట్. అయితే తాజాగా ఆ తేదీకి కాకుండా 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు. ‘‘ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మా సినిమా అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్‌లో బాక్సాఫీస్ విధ్వంసమయ్యే అనుభూతికి సిద్ధంకండి. 2026 జూన్ 25న థియేటర్లు దద్దరిల్లే సౌండ్స్ మీరు వింటారు. మాస్‌లకే మాస్ అయిన ఎన్టీఆర్ పుట్టినరోజున (మే 20) ప్రత్యేక గ్లింప్స్‌తో వస్తాం’’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. ఈ చిత్రానికి కెమేరా: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్.