
ష్... తమిళ్ సేల్స్ క్లోజ్డ్!
మహేశ్‌బాబు ‘స్పైడర్’ టీజర్‌లో ఏముంది? అనడిగితే ‘ష్...’ అనే చెప్పాలి! అందులో నో డైలాగ్స్, నో యాక్షన్, నో డీటెయిల్స్! మాంచి స్టైలిష్ లుక్కులో ఉన్న మహేశ్ ‘ష్..’ అంటూ ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. జస్ట్ వన్ మినిట్ ఉన్న ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేశ్‌బాబు–దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌కి తోడు, సిన్మాపై ఉన్న అంచనాలను ఈ టీజర్ మరింత పెంచింది. అందుకు ఉదాహరణగా ఈ విజయ దశమికి విడుదలవుతోన్న ఈ సినిమా తమిళ్ సేల్స్ రెండు నెలల ముందే క్లోజ్ అవ్వడాన్ని చెప్పుకోవాలి.
‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ‘స్పైడర్’ తమిళ్ థియేట్రికల్ రైట్స్‌ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ సొంతం చేసుకుంది. రజనీకాంత్ ‘2.0’ను నిర్మిస్తున్నది ఈ సంస్థే. రూ. 25 కోట్లకు లైకా సంస్థ ‘స్పైడర్’ రైట్స్‌ను సొంతం చేసుకుందని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్, ఎస్.జె. సూర్య విలన్. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారీస్ జయరాజ్, కెమెరా: సంతోష్ శివన్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిక్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్.