
మళ్లీ వచ్చింది.. ద మమ్మీ రిటర్న్స్
ఈజిప్టు నాగరికత నేపథ్యంలో వచ్చిన అద్భుత జానపద దృశ్య కావ్యం 'ద మమ్మీ'రిటర్న్. 1999లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మమ్మీ సినిమాకు సీక్వెల్ ఇది. ఇది కూడా బాక్సాఫీసును షేక్ చేసింది. కేవలం 98 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా 480 మిలియన్ అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. స్టీఫెన్‌సోమర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హాలీవుడ్ అందించిన అద్భుత జానపద చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
ప్రధాన పాత్రలు:
రిచర్డ్ ఓ నీల్ (బ్రాండన్ ఫ్రేజర్), ఎవ్లీన్ (రేచల్ వీజ్), జొనాథన్ హనా (జాన్ హనా) హిమోతే (ఆర్నాల్ ఓస్లో) అంకు సు నమూన్ (పత్రిసియా) స్కార్పియన్ కింగ్ (డ్వాన్ జాన్సన్) అలెక్స్ ( రిచర్డ్ కుమారుడు), హఫీజ్ (అలన్ ఆర్మ్‌స్ట్రాంగ్ )
నేపథ్యం!
క్రీస్తుపూర్వం 5వేల ఏళ్ల క్రితం మొదలవుతుంది. స్కార్పియన్ కింగ్ ప్రపంచాన్ని జయించడానికి తన సైన్యంతో బయల్దేరుతాడు. థెబిస్‌పై దండయాత్ర చేసినపుడు అమ్ షీర్ ఎడారిలో వారు ఓడిపోతారు. ఎండవేడికి స్కార్పియన్‌కింగ్ సైన్యం ఒక్కొక్కరుగా మరణిస్తారు. స్కార్పియన్ కింగ్ ఒక్కడే మిగులుతాడు. అతని ప్రార్థనతో అనుబిస్ తన సైన్యాన్ని స్కార్పియన్ కింగ్‌కు అండగా పంపిస్తాడు. దీంతో స్కార్పియన్ కింగ్ ఈజిప్టును జయిస్తాడు. ఇంతలో స్కార్పియన్ కింగ్ ఆత్మను అతనికిచ్చిన సైన్యాన్ని అనుబిస్ తిరిగి తీసేసుకుంటాడు. అక్కడ స్కార్పియన్ కింగ్, అతని సైన్యం శాశ్వతంగా నిద్రపోతుంటారు.
కథేంటంటే!
1933లో కథ తిరిగి మొదలవుతుంది. రిచర్డ్, ఎవ్లీన్ వారి కుమారుడు అలెక్స్‌తో కలిసి ఓ పిరమిడ్‌ను తవ్వుతారు. అక్కడ వారికి బుక్ ఆఫ్ డెడ్ లభిస్తుంది. అందులో ఓ ముంజేతి కంకణం ఉంటుంది. అది స్కార్పియన్ కింగ్‌ది. మరోవైపు లండన్ మ్యూజియం పర్యవేక్షకుడు హఫీజ్ కొందరు వ్యక్తుల సాయంతో దుష్టశక్తి అయిన అంకు సు నమూన్ (పత్రిసియా)కు ప్రాణం పోస్తాడు. హిమోతే (ఆర్నాల్ ఓస్లో)కు సైతం ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తుంటాడు. తద్వారా స్కార్పియన్ కింగ్‌ను అతని సైన్యం సాయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలన్నది హఫీజ్ పన్నాగం. ఎలాగోలా ఇద్దరికీ ప్రాణం పోస్తాడు. కానీ, అలెక్స్ సాయం లేకుండా అమ్‌షీర్ ఎడారిలో ‘స్కార్పియన్ కింగ్’ నిద్రపోతున్న స్థలం గుర్తించలేమని అర్థమవుతుంది. ఈలోగా అలెక్స్‌కు దొరికిన స్కార్పియన్ కింగ్ ముంజేతి కంకణం అతడి చేతికి అతుక్కుపోతుంది. అది ఊడాలంటే ఏడురోజుల్లోగా స్కార్పియన్ కింగ్ సమాధి వద్దకు వెళ్లాలి. లేదంటే మరణిస్తారని తెలుసుకుంటాడు. ఈలోగా హఫీజ్ తన మనుషులతోపాటు వచ్చి బుక్ ఆఫ్ డెడ్‌తోపాటు అలెక్స్‌ను ఎత్తుకెళతాడు.
ఒళ్లు గగుర్పొడిచే పోరాటాలు:
తన కుమారుడిని కాపాడుకునేందుకు భార్య ఎవ్లీన్, బావమరిది జొనాథన్‌తో కలిసి బయల్దేరుతాడు ఓ నీల్. ఈ ప్రయాణంలో తాను పూర్వం ఈజిప్టు రాజు అయిన పారో సేతి-1 కుమార్తెనని ఎవ్లీన్ తెలుసుకుంటుంది. తన తండ్రిని చంపిన సవతి తల్లి అంకు సు నమూన్, ఆమె ప్రియుడు హిమోతేపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో హఫీజ్ సైన్యంతో బస్సులు, రైళ్లు, ఆకాశంలో పారాచ్యూట్‌లో జరిగే పోరాటాలు ‘న భూతో.. న భవిష్యతి’ అన్న విధంగా ఉంటాయి. అలెక్స్ తానెక్కడున్నది తన తల్లిదండ్రులకు గుర్తుల ద్వారా తెలియజేస్తుంటాడు. వాటి ఆధారంగా ఓనీల్ వారిని అనుసరిస్తాడు. ఈలోగా స్కార్పియన్ కింగ్ సమాధి ఉన్న ఒయాసిస్ వద్దకు చేరుకుంటారు. హఫీజ్ సైన్యంతో పోరాడి తన కుమారుడిని కాపాడుకుంటాడు. అప్పటికే వారం గడుస్తుంది. సూర్యోదయం కాకముందే స్కార్పియన్ కింగ్ ఉన్న పిరమిడ్‌కు చేరుకుంటారు. అలా తన కుమారుడు అలెక్స్ ప్రాణాలు కాపాడుకుంటాడు ఓనీల్. కానీ ఈలోగా వచ్చిన అంకుసునమూన్ ఎవ్లీన్‌ను చంపి హిమోతేతో కలిసి పిరమిడ్‌లోకి చేరుతుంది. ఓనీల్ హిమోతేతో తలపడతాడు. అంకుసున మూన్ వద్ద ఉన్న బుక్ ఆఫ్ డెడ్‌ను అలెక్స్ తీసుకుని చదువుతాడు. దీంతో తన తల్లిని తిరిగి బతికించుకుంటాడు. స్కార్పియన్ కింగ్ సైన్యం అదృశ్యమవుతుంది. మరోవైపు హిమోతే పూజలతో నిద్రలేచిన స్కార్పియన్ కింగ్‌ను ఓనీల్ చంపుతాడు. ఇంతలో సమాధి కూలడం మొదలవుతుంది. హిమోతే, ఓనీల్ అగ్నిగుండం అంచున వేలాడుతుంటారు. అంకు సున మూన్ ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోతుంది. కానీ ఎవ్లీన్ ప్రాణాలకు తెగించి వచ్చి ఓనీల్‌ను కాపాడుకుంటుంది. మరోసారి భంగపాటుకు గురైన హిమోతే నిరాశతో ప్రాణాలు వదిలేస్తాడు.