
హీరో భార్య ఇంట్లో దొంగలుపడ్డారు
ముంబై: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు ఇంట్లో దొంగతనం జరిగింది. డైమండ్ నెక్లెస్, ఉంగరం సహా దాదాపు 80 లక్షల రూపాయల విలువైన నగలను దోచుకెళ్లారు. కిరణ్ రావు ఇటీవల ఈ విషయాన్ని గుర్తించింది. కిరణ్ రావు బంధువు ఫిర్యాదు మేరకు ఖర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్నారు.
కిరణ్ రావుకు ముంబైలోని బాంద్రాలో ఓ ఇల్లు ఉంది. కాగా ఆమె తన భర్త ఆమిర్‌తో కలసి కార్టర్ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. బాంద్రా ఇంట్లో ఆమె బంధువులు ఉంటున్నారు. ఈ ఇంటి బెడ్రూంలో కిరణ్ దాచిన నగలు మాయమయ్యాయి. ఆమె బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఇంట్లో పరిశీలించారు. ఇంట్లో పనిచేస్తున్న వారు నగలు కాజేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐదు రోజుల నుంచి ముగ్గురు పనిమనుషులను విచారిస్తున్నారు.