'నోట మాటలు రావడం లేదు'
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. దాసరి ఇంటికి చేరుకుని ఆయన బౌతికకాయాన్ని దర్శించుకున్న అనంతరం టాలీవుడ్ 'రాములమ్మ' విజయశాంతి మీడియాతో మాట్లాడారు. 'అసలు మాటలు రావడం లేదు. నేను ఇంకా షాక్‌లో ఉన్నాను. దాసరిగారు ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఓ గొప్ప దార్శనికుడు. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని' నటి విజయశాంతి తెలిపారు.
'సునామీ వస్తే ప్రజలు ఎలా అయిపోతారో.. దర్శక దిగ్గజం దాసరి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక సినీ ఇండస్ట్రీ అలా అయిపోతుంది. ఇండస్ట్రీలో కార్మికుల నుంచి దర్శకులు, నిర్మాతలకు సమస్యలు వచ్చినా నిమిషాల్లో పరిష్కరించే వ్యక్తి దాసరి' అని సీనియర్ నటుడు శివకృష్ణ అభిప్రాయపడ్డారు.
పెద్ద దిక్కును కోల్పోయాం ఒక తెలుగు దర్శకుడిగా అన్ని 151 చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకుడే కెప్టెన్ అని నిరూపించిన వ్యక్తి దాసరిగారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు అండగా నిలబడే వ్యక్తి కూడా ఆయనే. తెలుగు చిత్రసీమకు ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పలేం. దాసరిగారి దర్శకత్వంలో అహంకారి అనే సినిమాను చేశాను. ఆ సినిమా సమయంలో ఆయనతో చేసిన జర్నీ మరచిపోలేను. ఆయన మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవారు. మా కుటుంబ పెద్దను కోల్పోయాం. దాసరిగారి కుటుంబంతో కూడా మాకెంతో సన్నిహితంగా ఉంటారు. దాసరినారాయణరావుగారి మరణం మాకు, కుటుంబానికే కాదు, తెలుగు చిత్రసీమకే తీరనిలోటు. దాసరి వంటి దర్శకుడు మళ్ళీ రాడు, రాలేడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆ దేవణ్ణి వేడుకుంటున్నాను. - డా.రాజశేఖర్, జీవిత
'నన్ను నటుడిగా ఆదరించి ఆశీర్వదించిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో దాసరి గారు ప్రథములు, అటువంటి గొప్ప మనిషి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు' అని నటుడు శ్రీవిష్ణు అన్నారు.
దాసరి నారాయణరావు మృతి కళా రంగానికి తీరనిలోటు. దాసరితో నాకు ప్రత్యేక అనుబంధం ఉందిని ప్రజా గాయకుడు గద్దర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక వ్యక్తిగా నాపై దాసరి గారి ప్రభావం చాలా ఉంటుంది. అలాంటి మనిషి మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది. - నటుడు, దర్శకుడు రవిబాబు
నా సినిమాల్లో తెలుగుదనం ఎక్కువగా ఉండాలనే ఆలోచన దాసరి గారి వల్లనే వచ్చింది. ఆయన సినిమాలు నాపై చూపిన ప్రభావం అలాంటిది. అలాంటి వ్యక్తి మరణం నన్ను కలచివేసింది. - దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి