వారెవ్వా... ప్రపంచంలో ఈ చిత్రాలదే హవా! | Top 10 Highest Grossing Hollywood Movies | Sakshi
Sakshi News home page

వారెవ్వా... ప్రపంచంలో ఈ చిత్రాలదే హవా!

Published Sat, Aug 1 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

Top 10 Highest Grossing Hollywood Movies

 ప్రపంచ ప్రేక్షకుల్ని పాదాక్రాంతం చేసుకోవడానికి హాలీవుడ్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఖరీదైన కలలే కంటుంది. వందల, వేల కోట్ల రూపాయలు అలా పోసేసి మరీ హాలీవుడ్ సినిమాలు తీస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే వసూళ్లు కూడా వందల, వేల కోట్లలోనే ఉంటాయి. ఒకదాన్ని మించి ఒకటి వసూళ్ల సునామీ సృష్టిస్తాయి. ఏ రికార్డూ కుదురుగా ఉండదంటే అర్థం చేసుకోండి. హాలీవుడ్‌లో ఇప్పటివరకూ భారీ వసూళ్లు సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి.  వాటిల్లో ‘టాప్ టెన్’గా నిలిచిన సినిమాల గురించి స్పెషల్ ఫోకస్.

 1. 16వేల కోట్లతో వరల్డ్ నంబర్ వన్ ఫిల్మ్...  ‘అవతార్’
 ‘టెర్మినేటర్’, ‘టైటానిక్’ లాంటి అద్భుత చిత్రాల దర్శకుడు జేమ్స్ కామరూన్ నుంచి వచ్చిన  చిత్రం ‘అవతార్’ (2009). ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అందర్నీ అబ్బురపరిచింది. కామరూన్ కొత్త అవతారాన్నే ఆవిష్కరించారని సాటి ఫిలిం మేకర్లు, ప్రేక్షకులు ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్‌లో లోపాలు వెతికినా కనిపించవు. సినిమా చూస్తున్నప్పుడు నిజంగానే మరో ప్రపంచంలో ఉన్న అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగడం ఓ ప్లస్ పాయింట్. ఆరేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం వసూళ్ల రికార్డును ఇప్పటివరకూ వేరే ఏ చిత్రమూ బ్రేక్ చేయలేకపోవడం విశేషం. 278 కోట్ల డాలర్లు (సుమారు 16,680 కోట్ల రూపాయల) వసూళ్లతో ‘నంబర్ వన్’ స్థానంలో నిలిచింది ‘అవతార్’.
 
 2. విషాదాంత ప్రేమకథకు వసూళ్ల మణిహారం
 ప్రపంచం అంతా మెచ్చుకున్న వెండితెర ప్రేమకావ్యం - ‘టైటానిక్’ (1997). ప్రాంతీయ, భాషా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ఈ ప్రేమకథ దర్శకుడు కూడా - జేమ్స్ కామరూనే! ఆయన ఆవిష్కరించిన ఈ ప్రేమకథ అందరి మనసుల్లో ఇవాళ్టికీ చెరగని ముద్రే వేసింది. కథలో టైటానిక్ షిప్ ధ్వంసమవుతుంది. కళ్లెదుటే ప్రియుడు మునిగిపోతాడు. ప్రేయసి ఒంటరిగా మిగిలిపోతుంది. సినిమా పూర్తయ్యాక ఓ రకమైన ఉద్వేగంతో ప్రేక్షకులు బయటికొస్తాడు. అదే ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ఈ విషాదాంత ప్రేమకథ ప్రపంచం మొత్తం మీద భారీ వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. 218 కోట్ల డాలర్లు (సుమారు 13,080 కోట్ల రూపాయలు) సాధించిందీ చిత్రం.
 
 3. వసూళ్లలో సూపర్ డైనోసార్!
 బాక్సాఫీస్ వద్ద సత్తా చూపిన మరో అద్భుత దర్శకుడు - స్టీవెన్ స్పీల్‌బర్గ్. వెండితెరపై ఆయన ఆవిష్కరించిన భారీ డైనోసార్‌ను చూసి, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు. ఈ డైనోసార్ చేసే విన్యాసాలను చూడడం కోసం ఆబాలగోపాలం తండోపతండాలుగా థియేటర్లకు వెళ్లారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం నాలుగో భాగం ‘జురాసిక్ వరల్డ్’ (2015)కి కూడా భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమా తాజాగా ప్రపంచం మొత్తం మీద మూడో అతి పెద్ద గ్రాసర్ అయింది. కాలిన్ ట్రెవరో దర్శకత్వంలో క్రిస్ ప్రాట్ నటించిన ఈ లేటెస్ట్ డైనాసార్ ఫిల్మ్ ఇప్పటి దాకా సాధించిన వసూళ్ళే 152 కోట్ల డాలర్లు (సుమారు 9,120 కోట్ల రూపాయలు). అందులో 61.43 కోట్ల డాలర్లు అమెరికాలో వస్తే, ఇతర దేశాలన్నీ కలిపి 90.73 కోట్ల డాలర్లు వసూలైంది.
 
 4. సూపర్ హీరోలకు సూపర్ కలెక్షన్లు
 సూపర్ హీరో క్యారెక్టర్లను ఇష్టపడనివారుండరు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సూపర్ హీరోలు చేసే వీరోచిత పోరాటాలు చూసి, ఆ హీరోల్లో తమను ఊహించుకునే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అలా కనెక్ట్ అయ్యే ‘ది ఎవెంజర్స్’ (2012) చిత్రాన్ని తెగ చూశారు. ‘మార్వెల్ కామిక్స్’ బుక్ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ కామిక్స్‌కి తెరరూపం ఇవ్వడం చాలామందిని థ్రిల్‌కి గురి చేసింది. ఆ థ్రిల్లే వాళ్లని థియేటర్‌కి వచ్చేలా చేసింది. ఫలితంగా ఈ సూపర్ హీరో మూవీ - వసూళ్ల వర్షం కురిపించింది. జాస్ వెడాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 151.9 కోట్ల డాలర్లు (దాదాపు 9114 కోట్ల రూపాయలు) వసూలు చేసి, నాలుగో స్థానం దక్కించుకుంది.
 
 5. యాక్షన్ భేష్... కలెక్షన్స్ శభాష్
 హాలీవుడ్‌లో రూపొందే యాక్షన్ చిత్రాలకు బోల్డంత మంది అభిమానులుంటారు. యాక్షన్ సీక్వెన్సెస్ ఆ స్థాయిలో ఉంటాయి. అందుకే ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ’ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఆ చిత్రానికి ఏడో సీక్వెల్ అయిన లేటెస్ట్ ఫిల్మ్ ‘ఫ్యూరియస్ 7’ (2015) కూడా వసూళ్ల పరంగా దుమ్ము రేపింది. విలన్‌లో గ్యాంగ్‌లో ఉండే ఓ అమ్మాయి ఒక నూతన కెమెరా కనిపెడుతుంది. ఆన్ చేయకుండా కూడా రికార్డ్ చేయగల శక్తి దానికి ఉంటుంది. విలన్ గ్యాంగ్ నుంచి బయటికొచ్చి, మంచి మనిషిగా మారుతుందా అమ్మాయి, కానీ, ఆ కెమెరాని తన నుంచి దక్కించుకోవడానికి విలన్ గ్యాంగ్ వెంటపడుతుంది. వారి నుంచి హీరో ఆమెను ఎలా కాపాడాడు? అనేది కథాంశం.జేమ్స్ వాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి దాకా 151.1 కోట్ల డాలర్లు (సుమారు 9066 కోట్ల రూపాయలు) వసూళ్లు సాధించి, ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానం దక్కించుకుంది.
 
 6. టాక్ ఓకే.. బాక్సాఫీస్ అదుర్స్...
 ‘ది ఎవెంజర్స్’ (2012)కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘అవెంజర్స్- ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ (2015). మార్వెల్ కామిక్స్ బుక్ ఆధారంగానే ఈ చిత్రాన్ని కూడా దర్శకుడు జాస్ వెడాన్ రూపొందించారు. ‘ది ఎవెంజర్స్’లో ఉన్నంత ఎగ్జయిటింగ్‌గా యాక్షన్ సీక్వెన్సెస్ లేకపోయినా ఈ సీక్వెల్ కూడా బాగానే ఉందనిపించుకుంది. టాక్ పరంగా ఫరవాలేదనిపించుకున్నప్పటికీ వసూళ్లు బాగానే సాధించింది. దాదాపు 139 కోట్ల డాలర్ల (సుమారు రూ. 8,340 కోట్లు) వసూళ్ళతో బాక్సాఫీస్ వద్ద ఆరో స్థానంలో నిలిచింది.
 
 7. లాస్ట్ హ్యారీ... బెస్ట్ కలక్షన్స్
 ‘హ్యారీ పోటర్’ సిరీస్‌లో భాగంగా రూపొందిన చిత్రం ‘హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హ్యాలోస్’  (2010). ఈ సిరీస్‌లో ఇది ఎనిమిదో చిత్రం. హ్యారీ పోటర్ సిరీస్‌లో ఇదే చివరి చిత్రం కావడం విశేషం. 134 కోట్ల డాలర్ల వసూళ్లతో (సుమారు రూ. 8,040 కోట్ల రూపాయలు) ఈ చిత్రం ఏడో స్థానాన్ని దక్కించుకుంది.
 
 8. అదరగొట్టిన యానిమేషన్ మూవీ
 యానిమేటెడ్ మ్యూజికల్ ఫ్యాంటసీ మూవీగా రూపొందిన చిత్రం ‘ఫ్రోజెన్’ (2013). పిల్లలతో పాటు పెద్దలను కూడా థ్రిల్‌కు గురి చేసే విధంగా ఉన్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో స్థానం దక్కింది. 127 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 7,620 కోట్లు) వసూళ్లు సాధించిందీ చిత్రం.
 
 9. ఐరన్ మ్యానా... మజాకానా!
 మార్వెల్ కామిక్స్ బుక్ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఐరన్ మ్యాన్’. ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఐరన్ మ్యాన్ 2’ని కూడా బాగానే చూశారు. ఇక, ‘ఐరన్ మ్యాన్ 3’ (2013) అయితే బంపర్ హిట్. సుమారు 121 కోట్ల డాలర్ల వసూళ్లతో (సుమారు రూ.7,260 కోట్ల రూపాయలు) తొమ్మిదో స్థానంలో నిలిచింది.
 
 10. సైన్స్ ఫిక్షన్ చేసిన మేజిక్
 సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా రూపొందిన ‘ట్రాన్స్‌ఫార్మర్స్’కి మూడో సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘టాన్స్‌ఫార్మర్: డార్క్ ఆఫ్ ది మూన్’ (2011). ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కథ అంత బాగా లేదనే విమర్శ వినిపించింది. కానీ, వసూళ్ల పరంగా అదరగొట్టింది. దాదాపు 112 కోట్ల డాలర్లు (సుమారు రూ. 6,720 కోట్లు) సాధించి ఈ చిత్రం పదో స్థానంలో నిలిచింది.  ఇవన్నీ ప్రస్తుతం వసూళ్ళలో టాప్ టెన్ సినిమాలు. ప్రతి శుక్రవారం కొత్త రిలీజ్‌లతో బాక్సాఫీస్ ప్లేసులు మారిపోతుంటాయి కాబట్టి, భవిష్యత్తులో ఈ ‘టాప్ టెన్’ జాబితాను మార్చే సినిమాలు మరిన్ని రావడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement